తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా సంక్షోభంలో విద్యాసంస్థలు తెరుచుకునేది ఎలా? - యూజీసీ మార్గదర్శకాలు

కరోనా సంక్షోభంతో మూతపడ్డ విద్యాసంస్థల పునఃప్రారంభంపై సందిగ్దత నెలకొంది. దశలవారీగా యూనివర్సిటీలను తెరవాలని యూజీసీ సూచించింది. అయితే కొవిడ్‌ ఉద్ధృతి శీతాకాలంలో మరింత తీవ్రస్థాయికి చేరవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టడం కన్నా ఆన్​లైన్​ బోధనను మరికొంత కాలం కొనసాగించడమే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Reopening of Universities, still a tough ask amid corona crisis
కరోనా సంక్షోభంలో విద్యాసంస్థలు తెరుచుకునేది ఎలా?

By

Published : Nov 17, 2020, 8:48 AM IST

కళాశాలలు, విశ్వవిద్యాలయాలను దశలవారీగా పునఃప్రారంభించాలని యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ) ఇటీవల ఆదేశించింది. దీనికి సంబంధించి సమగ్ర వివరాలతో మార్గదర్శకాలనూ విడుదల చేసింది. విద్యాపరంగా, కెరీర్‌పరంగా విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలనే సదుద్దేశంతోనే ఉన్నత విద్యాసంస్థలను ప్రారంభించాలని సూచించినట్లు తెలుస్తోంది. యూజీసీ సమగ్ర మార్గదర్శకాలు ఇచ్చినా వైద్య నిపుణులు, ఆరోగ్య ప్రాధికార సంస్థలు విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాసంస్థల పునఃప్రారంభం ఎంతవరకు సాధ్యం, సమంజసం అనేది లోతుగా పరిశీలించాల్సి ఉంది.

జాగ్రత్తలు తప్పనిసరి

శీతకాలంతోపాటు, పండగల సందర్భంగా దేశవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు మరోసారి విజృంభిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీతి ఆయోగ్‌, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), భారత ప్రజారోగ్య ఫౌండేషన్‌ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాయి. అమెరికా, ఐరోపాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొనే ఇలాంటి హెచ్చరికలు వస్తున్నాయి. ప్రజలు గుమిగూడేందుకు అనుమతించడం, చలి పెరగడం, వంటి కారణాలతో ఆయా దేశాల్లో కరోనా వైరస్‌ ప్రభావిత కేసుల సంఖ్య జోరెత్తిన సంగతి గుర్తించాలి. కొవిడ్‌ ఉద్ధృతి- శీతాకాలంలో మరింత తీవ్రస్థాయికి చేరవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటప్పుడు తరగతులను ప్రారంభిస్తే ఎదురయ్యే పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలనే విషయమై యూజీసీ వెలువరించిన మార్గదర్శకాలు- ఉన్నత విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, విద్యార్థులకు సవాలు విసరుతున్నాయి. మార్గదర్శకాలను రూపొందించే సందర్భంగా విద్యార్థులు, బోధకులు, సిబ్బంది బాగోగులకు సంబంధించి యూజీసీ ఎన్ని జాగ్రత్తలను పరిగణనలోకి తీసుకున్నా, వాటి అమలు విషయంలో సమస్యలు తప్పవు. భారత ఉన్నత విద్యా వ్యవస్థలో 50వేలకుపైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో 3.74 కోట్ల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. భౌగోళిక వైవిధ్యం, మౌలిక సదుపాయాల సామర్థ్యం, దేశవ్యాప్తంగా విభిన్న రకాల కోర్సులను అందించాల్సిన విస్తృతి ప్రాతిపదికన దేశీయ విద్యావ్యవస్థలో యూజీసీ మార్గదర్శకాల అమలు కొంతమేర క్లిష్టతరమనే చెప్పాలి.

యూజీసీ మార్గదర్శకాల అమలు కళాశాలలు, వర్సిటీలకు తలకుమించిన భారమే. ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భద్రతా చర్యలు చేపట్టేందుకు- తరగతి గదులు, ప్రయోగశాలలు, పార్కింగ్‌ ప్రదేశాలు మొదలైన చోట్ల 'శానిటైజేషన్' కోసం అదనపు సిబ్బంది అవసరమవుతారు. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం- బోధన ఉపకరణాలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు తదితర యంత్రాలను నిరంతరం శుభ్రపరుస్తూ ఉండాలి. తరగతి గదిలో రెండు సీట్ల మధ్య ఒక సీటును ఖాళీగా వదలాలి. కళాశాల బస్సులు, ఇతర రవాణా వాహనాలను తగిన రీతిలో శానిటైజ్‌ చేయాలి. ఇలాంటి జాగ్రత్త చర్యలు పైకి తేలికగానే కనిపించినా- వాటిలో కొన్ని ఆచరణలో పాటించడం చాలా కష్టం. ఉదాహరణకు.. కనీసం ఆరు అడుగుల దూరం పాటించడం, వసతి గృహాల గదుల్లో ఒకరిని మించి అనుమతించకపోవడం, ఉమ్మడి స్నానాల గదులు, టీవీ గదుల్లో గుంపులుగా ఉండకుండా చూడటం, భోజనశాలల్లోకి చిన్న బృందాలుగా అనుమతించడం; విద్యార్థులు, సిబ్బంది నిత్యావసరాల కోసం మార్కెట్‌కు వెళ్లకుండా, అవన్నీ ప్రాంగణానికే వచ్చేలా చేయడం వంటివన్నీ అంత తేలికైనవేమీ కాదు.

విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని నిరంతరం విద్యాసంస్థ పర్యవేక్షించడం పెద్ద సవాలే. 'ఆరోగ్యసేతు' యాప్‌ను ఉపయోగించాలని యూజీసీ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. విద్యార్థులతోపాటు, వారితో అనునిత్యం అనుసంధానమయ్యే ఫ్యాకల్టీ, కౌన్సెలర్లు, బోధన, బోధనేతర సిబ్బందికీ తీవ్రమైన ‘ఇన్‌ఫెక్షన్‌’ ముప్పు పొంచి ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది మానసిక ఆరోగ్య అంశాలనూ యూజీసీ మార్గదర్శకాలు ప్రస్తావించాయి. కేంద్ర విద్యాశాఖ రూపొందించిన 'మనోదర్పణ్' వెబ్‌పేజీని ఉపయోగించుకోవడం ద్వారా మనస్తత్వ నిపుణుల సేవలు పొందవచ్చని అవి సూచించాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను సైతం ఏర్పాటు చేశారు. కౌన్సెలర్లుగా వ్యవహరించేందుకు ఎంతమంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారన్నదీ ముఖ్యమే. కళాశాలల్లో ఆరోగ్య కేంద్రాలు చాలావరకు కాగితాలకే పరిమితమయ్యాయి.

సంసిద్ధత అవసరం

కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించిన విద్యార్థులు, సిబ్బందిని ఐసొలేషన్‌లో ఉంచేలా ఉన్నత విద్యాసంస్థలు గట్టి చర్యలు తీసుకోవాల్సిందేనని యూజీసీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడైనా కేసులు విజృంభిస్తే వర్సిటీలు, కళాశాలల మూసివేతకు సంసిద్ధంగా ఉండాలి. కొన్నిచోట్ల బడులు తెరవడంవల్ల కరోనా కేసులు పెరిగిన ఉదంతాల్నీ పరిగణనలోకి తీసుకుంటూ, ఉన్నత విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిస్తే ఎదురయ్యే ఆరోగ్య ముప్పులనూ గుర్తుంచుకోవాలి. చాలావరకు విద్యాసంస్థల్లో ఆరోగ్య సంరక్షణకు తగిన సదుపాయాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు కళాశాలల్ని తిరిగి తెరవాలని ఆదేశించడం కాకుండా, ప్రస్తుత పరిస్థితుల్ని సరైన రీతిలో మదింపు వేయాలి. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వంటివారితో సంప్రతింపులు జరపాలి. విద్యార్థులు బస్సుల్లో ప్రయాణించాల్సి రావడాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. వారానికి ఆరు రోజులు రెండు విడతలుగా తరగతి బోధన, మరోవైపు 'ఆన్‌లైన్'లో చెప్పడం సిబ్బందికీ కష్టమే. ఈ క్రమంలో విద్యార్థులు, సిబ్బంది ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీ పడటానికి బదులుగా- మరికొంతకాలం 'ఆన్‌లైన్‌' పద్ధతిలోనే పాఠాల బోధన మేలు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

- డాక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌.జ్యోతి కుమార్‌

(మిజోరం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వాణిజ్య శాఖాధిపత

ABOUT THE AUTHOR

...view details