కూర్చున్న కొమ్మనే తెగనరికి అభివృద్ధికి నిచ్చెనలు వెయ్యాలనుకొనే వివేక భ్రష్టత్వం అనేక విధాలుగా మనిషి మనుగడను దుర్భరం చేస్తోంది. పారిశ్రామికీకరణ కారణంగా జడలు విరబోసుకొన్న కాలుష్యం నేలానింగీ, గాలీనీటిని విష సదృశం చేసి మనుషుల ఆయుర్దాయాన్ని నిర్దయగా చిదిమేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కాటుకు 83 లక్షలమంది బలి అయితే, అందులో 23 లక్షలమంది భారతీయులేనని నిరుడు డిసెంబరునాటి అంతర్జాతీయ అధ్యయనం నిగ్గుతేల్చింది. ఒక్క పారిశ్రామిక కాలుష్యమే ఇండియాలో దాదాపు పన్నెండున్నర లక్షలమందికి మరణశాసనం లిఖిస్తోంది. కరోనా మహమ్మారి కట్టడి వ్యూహంలో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ అమలుచేయడంతో పారిశ్రామిక కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయి- పర్యావరణం తేటపడిన తీరు విస్తుగొలుపుతోంది.
మూడున్నర దశాబ్దాలైనా..
జీవ నదుల్లోకి విషకాలుష్య వ్యర్థాల వరద ఆగిపోవడంతో వాటిలో స్వచ్ఛ జలకళ ఉట్టిపడుతోందని ఉత్తర్ ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి స్పష్టీకరిస్తోంది. కాలుష్య కాసారంలా మారిన పావన గంగను శుద్ధిచేసే మహా సంకల్పాన్ని కేంద్రం ప్రకటించి మూడున్నర దశాబ్దాలైంది. రాజీవ్ జమానాలో మొదలై నాలుగు వేలకోట్ల రూపాయలు ధారపోశాక కూడా గంగ ప్రక్షాళన జరగకపోబట్టే మోదీ సర్కారు ‘నమామి గంగ’ ప్రాజెక్టును చేపట్టింది. రూ.28,790 కోట్ల వ్యయంతో 310 ప్రాజెక్టులు చేపట్టి ఈ సంవత్సరాంతానికి లక్ష్యం సాధించాలనుకున్నా, 37 శాతం పనులే పూర్తి అయ్యాయి. మురుగునీటి శుద్ధి ప్రాజెక్టుల్ని విస్తృతంగా చేపట్టి గంగను పరిశుద్ధం చెయ్యాలని ప్రభుత్వం భావిస్తే- పారిశ్రామిక వ్యర్థాలు కలవకుంటే తనకు తానే పునరుజ్జీవం పొందగలనని గంగమ్మ చాటిచెబుతోంది. కాలుష్యం కాటు లేకపోవడంతో ప్రధాన నదీమ తల్లులన్నీ తమంతట తామే తేరుకొంటున్న తీరు- జలసిరుల పునరుజ్జీవన వ్యూహాలు మారాలనీ స్పష్టీకరిస్తోంది!
ప్రజారోగ్యానికి చేటుగా..