తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఈ-వ్యర్థాల పునర్వినియోగమే మానవాళికి క్షేమం - ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు

ఎలక్ట్రానిక్‌ యుగంలో పలు నూతన ఆవిష్కరణలు నిత్యకృత్యమయ్యాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం పెరగడం వల్ల వాటి వ్యర్థాలూ ఎక్కువై జనజీవనానికి హాని కలిగించే ప్రమాదముంది. మున్ముందు ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలకు అడ్డుకట్టవేయకపోతే సమాజంపై దుష్ప్రభావాలు కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

electronic waste
ఈ-వ్యర్థాల పునర్వినియోగమే మానవాళికి క్షేమం

By

Published : May 17, 2021, 8:52 AM IST

దేశంలో సాంకేతిక విప్లవం వెల్లువెత్తుతూ, ఆధునిక పరికరాల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఎలక్ట్రానిక్‌ యుగంలో పలు నూతన ఆవిష్కరణలు నిత్యకృత్యమయ్యాయి. ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం పెరగడం వల్ల వాటి వ్యర్థాలూ ఎక్కువై జనజీవనానికి హాని కలిగించే ప్రమాదముంది. మున్ముందు ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలకు అడ్డుకట్టవేయకపోతే సమాజంపై దుష్ప్రభావాలు కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నూతన ఆవిష్కరణల కారణంగా గతంలో వినియోగించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలకు గిరాకీతోపాటు, వినియోగం తగ్గుతోంది. వినియోగదారులు ఎప్పటికప్పుడు నూతన వస్తువుల వినియోగంపైనే ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా పాత ఉపకరణాలను తిరిగి ఉపయోగించకపోవడంతో అవి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు (ఈ-వ్యర్థాలు)గా మారుతున్నాయి.

పర్యావరణానికి కీడు

కంప్యూటర్లు, చరవాణులతోపాటు రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లు తదితర ఉపకరణాలన్నింటినీ పాడయిపోతే పారవేయడం తప్ప- తిరిగి ఉపయోగించేలా చేసే కేంద్రాలు తక్కువే. కొన్ని నగరాల్లో అలాంటి వెసులుబాట్లు ఉన్నా అంతగా వినియోగంలేదు. తగినన్ని రీ-సైక్లింగ్‌ కేంద్రాలు లేక ఈ-వ్యర్థాల్లోని పదార్థాలు వాతావరణంలో కలిసిపోయి పర్యావరణ సమస్యలకు కారణమవుతున్నాయి. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల సేకరణ, వినియోగం వంటి చర్యలు దేశంలో నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉండే మూలకాలు, రసాయనాలు భూమిలో కలిసి పోయి ప్రాణికోటి వినాశనానికి కారణమవుతున్నాయి. చరవాణుల్లో సుమారు 40కి పైగా లోహాలు ఉంటాయని ఐరాస పర్యావరణ కార్యక్రమం గతంలోనే వెల్లడించింది. ఈ-వ్యర్థాల్లో హానికారక మూలకాలను నిర్మూలించడం భారమవుతోంది. పునర్వినియోగం ఖర్చుతో కూడుకొన్న వ్యవహారంగా మారుతోంది.

ఈ-వ్యర్థాల వల్ల గర్భిణుల్లో హార్మోన్లు, పిండాలపై దుష్ప్రభావం పడే ముప్పు అధికమని నిపుణులు తేల్చారు. అంతే కాకుండా పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నట్లు గుర్తించారు. దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ స్థానిక ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. ఈ-వ్యర్థాల నిర్వహణ, పునర్‌ వినియోగం లాంటివి పకడ్బందీగా చేపట్టాల్సిన అవసరం ఉంది. భూమిలో కలవని వ్యర్థాల కోసం ప్రత్యేక స్థలాల్ని కేటాయించాలని ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు తెలుపుతున్నాయి. ఈ-వ్యర్థాల నియంత్రణకు భస్మీకరణం (కాల్చడం), సాంకేతిక పునశ్శుద్ధి, భూమిలో పూడ్చటం వంటి చర్యలు చేపట్టాలి. అందుకు ఆయా స్థానిక ప్రభుత్వాలకు కావలసిన యంత్ర సామగ్రితో పాటు, తగిన ఆర్థిక సహాయాన్నీ అందజేయాల్సి ఉంటుంది. ఈ-వ్యర్థాల పునశ్శుద్ధి ప్రక్రియ ద్వారా పాత పరికరాల్లోని కొన్ని భాగాలను వేరుచేసి తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్‌ సంబంధిత పరికరాలను పునశ్శుద్ధి చేయడంద్వారా అధికశాతం భాగాలు తిరిగి పొందవచ్చు. కాబట్టి వ్యర్థాల నిర్వహణను అత్యంత ప్రయోజనకరమైన ప్రక్రియగా భావించాలి. ఆధునిక పద్ధతులతో భూమిలో పూడ్చటం ద్వారా పర్యావరణ వినాశనానికి హాని తక్కువగా ఉండేలా చూడొచ్చు. అభివృద్ధి చెందిన జపాన్‌లో ఆధునిక పునర్‌ వినియోగ ప్రక్రియలను అమలు చేయడం ద్వారా పర్యావరణంపై దుష్ప్రభావం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మన దేశంలో వ్యర్థాలను అర్థవంతంగా, ఉపయుక్తంగా మార్చడానికి, నిరుపయోగ వ్యర్థాల నిర్మూలనకు ఆధునిక, సాంకేతిక, శాస్త్రీయ విధానాలను పాటిస్తూ నియంత్రించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం కావాలి. అందుకు ఎలెక్ట్రానిక్‌ పరికరాల ఉత్పత్తి సంస్థలను సైతం భాగస్వాములను చేయాలి.

ఏం చేయాలి?

ఈ-కామర్స్‌ సంస్థలు వినియోగించిన వస్తువులను తప్పనిసరిగా తిరిగి సేకరించేలా విధివిధానాలను రూపొందించాలి. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎలక్ట్రానిక్‌ సంస్థలు అమ్మకంతో పాటు, పాడైన వస్తువులను తిరిగి సేకరించి, వినియోగించేలా సమాయత్తం చేయాలి. దేశంలో ఈ-వ్యర్థాల పట్ల తగినంత అవగాహన లేక ఇష్టారాజ్యంగా పడేయడం పరిపాటిగా మారుతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకంతో వ్యర్థాలు సైతం అధికంగా తయారవుతున్నాయి. కాబట్టి పునర్వినియోగ కార్యకలాపాలపై అధికంగా దృష్టి సారించాలి. ప్రభుత్వాలు ఈ-వ్యర్థాలపై దృష్టి సారించి, తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలి. అందుకు స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేస్తూ, ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ సంస్థలను తప్పనిసరిగా భాగస్వాములను చేసేలా నియమాలు రూపొందించాలి. దేశంలో వ్యర్థాల నిర్వహణ అసంఘటిత రంగంలోనే అధికంగా ఉన్న క్రమంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి. అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థలు కనీసం జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో వ్యర్థాల సేకరణ కేంద్రాలను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలి. వ్యర్థాల వల్ల సంభవించే నష్ట తీవ్రతను తగ్గిస్తూ, అర్థవంతంగా మార్చే చర్యలపై ప్రభుత్వం, ప్రజలు, పారిశ్రామిక సంస్థలు కలిసికట్టుగా ముందుకు సాగితే అనర్థాలు తగ్గించవచ్చు.

- ఎ.శ్యామ్‌కుమార్‌

ఇదీ చూడండి:రెమ్​డెసివిర్​ ఇచ్చేందుకు బైక్​పై 420కి.మీ ప్రయాణం

ABOUT THE AUTHOR

...view details