ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్ చేస్తే ఇంటి (Q commerce india) ముందుకే వచ్చి వాలే ఈ-కామర్స్ యుగం ఇది. క్రయవిక్రయాల తీరుతెన్నులనే మార్చేసిన ఈ-కామర్స్ ఇప్పుడు చిన్నపట్టణాలకు, పల్లెలకు సైతం విస్తరించింది. ఈ ఊపును కొనసాగించేందుకు సరకులను వాయువేగంతో వినియోగదారుడి చెంతకు చేర్చే క్విక్ కామర్స్ (క్యూ-కామర్స్)కు కంపెనీలు శ్రీకారం చుట్టాయి. ఈ-కామర్స్‌లో ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే అది వినియోగదారుడికి చేరేసరికి సగటున మూడు నుంచి అయిదు రోజులు పడుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌వంటి సంస్థలు ప్రత్యేక సభ్యత్వాలు తీసుకున్నవారికి మాత్రం ఆర్డర్ చేసిన మర్నాడే వస్తువులను చేరవేస్తున్నాయి. కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలను అందజేసే బిగ్‌బాస్కెట్, సూపర్ వంటి వాటిలోనూ వస్తువులను అందించడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అప్పటికప్పుడు ఏదైనా కావాలంటే వినియోగదారుడు నేరుగా దుకాణానికి వెళ్లి కొనుక్కోవాల్సిందే. ఈ లోటునూ పూడ్చగలిగితే వ్యాపారంలో తిరుగు ఉండదని భావించిన ఈ-కామర్స్ కంపెనీలు కొత్తగా క్యూ-కామర్స్‌ను రంగంలోకి తెచ్చాయి. ఆర్డర్ ఇచ్చిన 45 నిమిషాల్లోనే వినియోగదారుడి చెంతకు వస్తువును చేర్చడమే క్యూ-కామర్స్ ప్రత్యేకత. పచారీ సరకుల నుంచి కూరగాయల వరకు; పాలు పెరుగు నుంచి చేపలు మాంసం వరకు; వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల నుంచి ఔషధాల వరకు (Qucik commerce market size) ఏదైనా కోరుకున్న వెంటనే వినియోగదారుడికి అందించడమే దీని ఉద్దేశం.
ఏ రోజు వస్తువులు ఆ రోజే..
జర్మనీలోని బెర్లిన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే (Qucik commerce market) డెలివరీ హీరో కంపెనీ (delivery hero company) ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికాలోని 50కి పైగా దేశాల్లో ఆహార సరఫరా సేవలందిస్తోంది. అయిదు లక్షలకు పైగా రెస్టారెంట్ల నుంచి ఆహారాన్ని వినియోగదారుల చెంతకు చేరుస్తోంది. 2011లో ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టిన డెలివరీ హీరో గతేడాది క్విక్ కామర్స్ సేవలకూ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి రోజుకు ఎనిమిది లక్షల డెలివరీలతో క్యూ-కామర్స్‌లో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. భారత్‌లో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ- ఇన్‌స్టామార్ట్ పేరిట క్యూ-కామర్స్ సేవలకు శ్రీకారం చుట్టింది. ఆర్డర్ చేసిన 15 నుంచి 30 నిమిషాల్లోగా సరకులను చేరవేస్తోంది. దేశ రాజధాని సమీపంలోని గుడ్‌గావ్‌లో మొదలుపెట్టి ఇప్పుడు హైదరాబాద్ వరకు ప్రధాన నగరాలన్నింటా ఈ సేవలను విస్తరించింది. జొమాటో అనుబంధ సంస్థ గ్రోఫర్స్ సైతం గుడ్‌గావ్‌లో 15 నిమిషాల్లోనే సరకులు అందించే ఎక్స్‌ప్రెస్ డెలివరీని ప్రారంభించి 12 నగరాలకు విస్తరించింది. ఆహార సరఫరా సంస్థల సిబ్బందికి వేగంగా సరకును చేరవేయడంలో ఉన్న అనుభవం క్యూ-కామర్స్‌లోనూ ఈ కంపెనీలకు ఉపయోగపడుతోంది. మరోవైపు బిగ్‌బాస్కెట్ బీబీనౌ పేరిట క్యూ-కామర్స్‌లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సూపర్ గంటన్నరలో సరకులు అందిస్తామంటోంది.
గరిష్ఠంగా గంటలోపే సరకులు అందుతుండటంతో క్యూ-కామర్స్ (Qucik commerce unit economics) సర్వీసులకు గిరాకీ పెరుగుతోంది. పెద్ద మొత్తంలో కాకుండా ఏ రోజు వస్తువులు ఆ రోజు కొనుక్కునేవారికి క్యూ-కామర్స్ ఎక్కువగా ఉపయోగపడుతోంది. వాయువేగంతో సరకులను చేరవేయాలి కాబట్టి క్యూ-కామర్స్ కంపెనీలు ఎక్కడికక్కడ గోదాములు ఏర్పాటు చేసుకుని సరకులను సిద్ధంగా ఉంచుతున్నాయి. మరికొన్ని సమీపంలోని చిరువ్యాపారుల దగ్గర నుంచి వాటిని కొని వినియోగదారులకు అందజేస్తున్నాయి. దానివల్ల చిన్న వ్యాపారాలూ పుంజుకొంటాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జర్మనీలో డెలివరీ హీరో ఇలా స్థానిక వ్యాపారుల దగ్గర నుంచి కొనడంలో ముందుంది.
లాభాల్లో మేటి..