తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆరోగ్యానికి డిజిటల్‌ గుర్తింపు సాధ్యమేనా?

పేద, మధ్య తరగతి ప్రజల వైద్య చికిత్సల్లో ఎదురయ్యే సమస్యల్ని తొలగించడానికి డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశంలో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే ఎన్​డీహెచ్​ఎంను అమలు చేయడంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు భావిస్తున్నారు.

Digital Health Mission
డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌

By

Published : Sep 28, 2021, 7:07 AM IST

దేశంలో వైద్యసేవల్ని కొత్త పుంతలు తొక్కించే క్రమంలో కీలక మైలురాయిగా అభివర్ణిస్తూ, నిరుటి స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రధాని మోదీ ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రయోగాత్మక ప్రాతిపదికన ఆరు కేంద్రపాలిత ప్రాంతాలకు పరిమితమైన పథకాన్ని నిన్న దేశమంతటికీ విస్తరింపజేశారు. పేద, మధ్య తరగతి ప్రజల వైద్య చికిత్సల్లో ఎదురయ్యే సమస్యల్ని తొలగించడంలో ఇది ముఖ్య భూమిక పోషిస్తుందన్నది జాతికి ప్రధానమంత్రి ఇచ్చిన హామీ! వాస్తవానికి, సాంకేతిక పరిజ్ఞానమే వెన్నుదన్నుగా యావత్‌ ఆరోగ్య రంగ వ్యవస్థను డిజిటలీకరించాలని 2017నాటి జాతీయ స్వాస్థ్య విధానం నిర్దేశించింది. ఆ స్వప్నం సాకారమైతే, వ్యక్తుల సంపూర్ణ ఆరోగ్య సమాచారం రోగుల సమ్మతి మేరకు వైద్య సిబ్బందికి అందుబాటులోకి వస్తుంది. తద్వారా పదేపదే పాత రికార్డుల్ని వెంటపెట్టుకుని వెళ్ళాల్సిన దురవస్థ, మళ్ళీ మళ్ళీ ఆరోగ్య పరీక్షలు చేయించుకునే యాతన తప్పిపోతాయి.

అందుకోసం ప్రతి భారతీయుడికీ ఆరోగ్య ఐడీ కేటాయిస్తామంటున్నారు. ఆధార్‌ కార్డు లేదా చరవాణి సంఖ్యతో రూపొందించే ఆరోగ్య ఐడీయే వ్యక్తి స్వస్థ ఖాతాగానూ పనిచేయనుంది. దానికి వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు జోడించి వాటిని మొబైల్‌ యాప్‌ ద్వారా వైద్యులు పరిశీలించే వీలు కల్పిస్తారు. దాంతోపాటు ఔషధ దుకాణాలు, ప్రయోగశాలలు, రేడియాలజీ కేంద్రాలు, ఆసుపత్రులు, బీమా సంస్థలు తదితరాలన్నింటినీ అనుసంధానించడమన్నది అత్యంత జాగరూకతతో పట్టాలకు ఎక్కాల్సిన సంక్లిష్ట ప్రక్రియ. ప్రతి అంచెలోనూ సమాచార నమోదుకు సంబంధించి సిబ్బందికి ఇవ్వాల్సిన పకడ్బందీ శిక్షణ, వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. మౌలిక సేవల మెరుగుదలా అత్యంత ప్రాధాన్య అంశం!

ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు అన్న రాజ్యాంగ స్ఫూర్తికి దేశంలో దశాబ్దాలుగా తూట్లు పడుతున్నాయి. అందరికీ వైద్య చికిత్సల వ్యయం అందుబాటులో ఉండటం ఆ హక్కులో అంతర్భాగమన్న సర్వోన్నత న్యాయస్థానం తీర్పులకూ వాస్తవిక కార్యాచరణలో మన్నన కొరవడుతోంది. ఏ రోగం పాలబడినా అప్పో సొప్పో చేసి ప్రైవేటు ఆస్పత్రుల్ని ఆశ్రయించాల్సి రావడం, ఖరీదైన పరీక్షలకు ఔషధాలకు అయ్యే ఖర్చును సొంతంగానే భరించాల్సిన దుస్థితి- కోట్లాది కుటుంబాల్ని ఆర్థికంగా చిదిమేసి దుర్భర దారిద్య్రంలోకి ఈడ్చుకుపోతున్నాయి. ఈ దుర్దశను చెదరగొట్టడంలో- బిడ్డ పుట్టింది లగాయతు వివిధ దశల్లో వాడిన మందులు, వచ్చిన రుగ్మతలు, పొందిన చికిత్సలు తదితర వివరాలన్నింటినీ ఆరోగ్య ఖాతాలో భద్రపరచడమన్నది నిస్సంశయంగా పెద్ద ముందడుగు కాగలదు.

130 కోట్ల ఆధార్‌ ఐడీలు, 118 కోట్ల చరవాణి ఖాతాదారులు, సుమారు 80 కోట్ల దాకా అంతర్జాల వినియోగదారులు, 43 కోట్ల జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాల సమాచారం పోగుపడ్డచోట డిజిటల్‌ సేవలు సునాయాసంగా ఊపందుకుంటాయన్న ప్రధాని ఆశాభావం నిజమవుతుందా? అంతర్జాల సేవలకు సన్నద్ధం కాని గ్రామ పంచాయతీల సంఖ్య ఇంకా భారీగానే ఉందని కేంద్రమే నిరుడు గణాంకాలు వెల్లడించింది. నెట్‌ వసతి ప్రాతిపదికన పట్టణ ప్రాంతాలు, గ్రామాల మధ్య తీవ్ర అంతరం, బ్రాడ్‌బ్యాండ్‌ వేగంలో నేటికీ భారత్‌ మందకొడితనం- కొవిడ్‌ వేళ ఆన్‌లైన్‌ విద్యాబోధనను కుంగదీయడం తెలిసిందే. చురుగ్గా దిద్దుబాటు చర్యలు చేపట్టని పక్షంలో వైద్య సేవల విస్తరణ పరంగానూ వైఫల్యాలు తప్పవు. ‘డిజిటల్‌ ఇండియా’ పథకం అమలును వేగవంతం చేయడంలో, అంతర్జాల వేగాన్ని ఇనుమడింపజేయడంలో, స్వస్థ నిధుల కేటాయింపుల్ని పెంపొందింపజేయడంలో ప్రభుత్వాల ప్రాథమ్యాలు మారాలి. అప్పుడే డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ జనశ్రేయస్సాధకమై మన్ననలందుకుంటుంది!

ఇదీ చూడండి:'నేతలతో కుమ్మక్కైన పోలీసులు మూల్యం చెల్లించక తప్పదు'

ABOUT THE AUTHOR

...view details