దేశంలో ప్రజారవాణా వ్యవస్థకు జీవనాడి భారతీయ రైల్వే. పన్నెండు లక్షల మందికిపైగా శాశ్వత ఉద్యోగులతో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా, నిత్యం రెండు కోట్లమంది పైచిలుకు ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే రైల్వేశాఖ కొంతకాలంగా ఒడుదొడుకుల్ని ఎదుర్కొంటోంది. పైకి లేదులేదంటూనే ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. దేశవ్యాప్తంగా రైల్వేనెట్‌వర్క్‌ని 12 క్లస్టర్లుగా విభజించి, ప్రైవేటు రైళ్లను పట్టాలకు ఎక్కించే ప్రక్రియకు భారతీయ రైల్వే నాంది పలకడం- ఉద్యోగుల్లో తీవ్ర కలకలాన్ని రేపుతోంది. మరోవైపు ప్రయాణికులపై ఆర్థికభారంతో పాటు దీర్ఘకాలంలో రైల్వే ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. లాభదాయక మార్గాలు తద్వారా వచ్చే లాభాలు ప్రైవేటు సంస్థలు సొంతం చేసుకుంటే రైల్వే పరిస్థితి ఏమిటి? ప్రమాదాలకు బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 109 జతల (అటు ఇటు) మార్గాల్లో 151 ప్రైవేటు రైళ్లను 2023 ఏప్రిల్ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీనిపై కార్మికసంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు దేశంలో మొత్తం 2,800 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇవి కేవలం అయిదు శాతమేనని, దీనివల్ల రూ.30వేల కోట్ల పెట్టుబడులు సమకూరి స్థిరమైన, మెరుగైన ఆదాయం వస్తుందని రైల్వేశాఖ చెబుతోంది.
అధిక రుసుముల వడ్డన
ప్రైవేటు రైళ్లు వస్తే సదుపాయాలు మెరుగుపడటం, ప్రయాణ సమయం తగ్గడం, కొత్త కోచ్‌ల తయారీకి రైల్వేశాఖపై ఆర్థిక భారం తగ్గడం వంటి సానుకూల అంశాలున్నా, ప్రతికూల అంశాలు అధికంగానే ఉన్నాయి. ప్రస్తుతం రైళ్లలో జనరల్, స్లీపర్, ఏసీ తరగతి వరకు వివిధ రకాల బోగీలున్నాయి. ప్రైవేటు రైళ్లలో జనరల్ బోగీలుండవు. మిగిలిన బోగీల్లో ఛార్జీలు అందుబాటులో ఉండకపోవచ్ఛు. ఛార్జీల నిర్ణయాధికారం ప్రైవేటు ఆపరేటర్ల పరిధిలో ఉంటుంది. గిరాకీని బట్టి ఇష్టారాజ్యంగా పెంచుకునే పరిస్థితులూ ఉంటాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల మాటేమిటి? ప్రైవేటు రైళ్లు సకాలంలో గమ్యం చేరేందుకు వీలుగా ఆయా రూట్లలో ఇతర రైళ్లను కొంతసేపు నిలిపేస్తే సాధారణ రైళ్లలో వెళ్లే వారి ప్రయాణం ఆలస్యం కావడం వంటి మరికొన్ని ఇబ్బందులూ ఎదురుకావచ్ఛు. వయోవృద్ధులు, వికలాంగులు వంటి పలు విభాగాల వారికిస్తున్న ప్రయాణ రాయితీలకు ప్రైవేటు రైళ్లలో మంగళం పాడటం ద్వారా వారిపై ఆర్థికభారం పడుతుంది. టికెట్ల జారీ, తనిఖీ, వాటి ధరల నిర్ణయం, ఆహారం ధరల నిర్ణయం, రైళ్లలో పరిశుభ్రత... వంటివి ప్రైవేటు సంస్థల సిబ్బంది చేతుల్లోనే ఉంటాయి. డ్రైవర్లు, గార్డులే రైల్వేసిబ్బంది. తద్వారా భవిష్యత్తులో యువతకు ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయన్నది కార్మికసంఘాల ఆందోళన. భద్రత(సేఫ్టీ)కు సంబంధించినవి మినహా మిగిలిన విభాగాల్లో ఇప్పటికే మంజూరై భర్తీ ప్రక్రియ చేపట్టనివాటిలో 50శాతం పోస్టులను సరెండర్ చేయాలని రైల్వేబోర్డు ఇచ్చిన ఆదేశాలు భవిష్యత్తు అవకాశాలను మరింత సన్నగిల్లేలా చేస్తున్నాయని అంటున్నాయి. మరోవైపు ప్రయాణికుల సంఖ్య తగ్గుదల, సరకురవాణా ఆదాయం ఆశించిన మేర పెరగకపోవడం, జీతభత్యాలు, పింఛన్లు, ప్రయాణ రాయితీలు వంటి కారణాలతో రైల్వేశాఖ ఆపరేటింగ్ రేషియో (నిర్వహణ ఖర్చు) నానాటికి అధికమవుతోంది. వంద రూపాయల ఆదాయానికి రూ.98.44 (ఓఆర్ 98.44 శాతం)ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇక కొవిడ్ మహమ్మారి రైల్వేఆదాయానికి భారీగా గండిపెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మే నెలాఖరు వరకు ట్రాఫిక్ ఆదాయం 58శాతం పడిపోయినట్లు రైల్వేవర్గాలు చెబుతున్నాయి. ప్రయాణికుల టికెట్లతో 57శాతం ఆదాయమే వస్తోందని, రూపాయికి 43 పైసల నష్టం వస్తున్నట్లు రైల్వే అధికారులు పలు సందర్భాల్లో స్పష్టీకరించారు.