మానవ మనుగడ నీటి లభ్యతపై ఆధారపడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా నీటి వనరులు నానాటికీ క్షీణిస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో తలసరి వార్షిక నీటి లభ్యత 1951లో 5,177 ఘనపు మీటర్లు; నేడది 1,486 ఘనపు మీటర్లకు పడిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిమితంగా ఉన్న జలవనరుల నుంచి నీటిని అపరిమితంగా వాడటం, జల సంరక్షణను నిర్లక్ష్యం చేయడం వల్లే నీటి కొరత ఏర్పడింది. కేంద్ర భూగర్భ జల మండలి నివేదిక ప్రకారం- భారత్‌లో భూగర్భ నీటిమట్టాలు వేగంగా తగ్గిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం భూగర్భ జలాల్లో 24శాతం ఇండియాలోనే వినియోగిస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది. నీతి ఆయోగ్ సర్వే ప్రకారం దేశంలో నీటి డిమాండు 2030 నాటికి రెండింతలు కానుంది.
వాన నీటిని ఒడిసి పట్టండి అనే నినాదంతో...
దేశవ్యాప్తంగా తీవ్ర నీటి కొరత ఉన్న 256 జిల్లాల్లోని 1,592 సమితులపై దృష్టి సారించి, జలసంరక్షణకు నడుం కట్టడం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రధానోద్దేశం. దేశంలో ఏటా కురిసే వాన నీటిలో సగ భాగమైనా శాస్త్రీయంగా ఒడిసిపట్టగలిగితే ప్రజానీకానికి ప్రయోజనం కలుగుతుంది. జలసంరక్షణకు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 22 నుంచి నవంబరు 30 వరకు 'వాన నీటిని ఒడిసి పట్టండి' అనే నినాదంతో జల సంరక్షణ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రుతుపవనాలు రాకముందే చెరువులను, బావులను పూడికతీసి, నీటిని సంరక్షించే సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దురదృష్టవశాత్తు తగిన ప్రచారం లేకపోవడం, కరోనా విజృంభణ వంటి కారణాలతో ఆ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఫలితాలను అందించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశీయంగా వార్షిక సగటు వర్షపాతం 1,170 మిల్లీమీటర్లు. అందులో అయిదు శాతం నీటిని సైతం సంరక్షించుకోలేకపోతున్నాం. అందుకే దేశంలో కోట్లాది ప్రజలను నీటి కొరత వేధిస్తోంది.
ఇతర దేశాల్లో ఇలా..
సింగపూర్‌లో నాలుగంచెల జలశుద్ధి, సరఫరా వ్యవస్థల్ని కొలువుతీర్చి, ప్రతి నీటి బొట్టు నుంచి గరిష్ఠ ప్రయోజనం పొందుతున్నారు. జల సంరక్షణలో ఇజ్రాయెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. సుమారు 94శాతం వ్యర్థ జలాలను శుద్ధిచేసి, 85 శాతం నీటిని పునర్వినియోగిస్తోంది. ఆస్ట్రేలియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో భూగర్భ జలమట్టాలు తగ్గకుండా ప్రజలు నీటిని పొదుపుగా వాడుతున్నారు. మన దేశంలోనూ ఈ తరహా కార్యక్రమాల ద్వారా జల సంరక్షణ చేపట్టాలి. ఇళ్లపై కప్పు నుంచి వచ్చే నీటిని ఒడిసిపట్టి, శుద్ధి చేసుకుని వాడుకునేలా ప్రజలను ప్రోత్సహించాలి. అందుకు సులభమైన సాంకేతిక పద్ధతులను అభివృద్ధి చేయాలి. సుస్థిర, దీర్ఘకాలిక నీటి భద్రతను ప్రజలకు అందించడానికి సంప్రదాయ నీటివనరులైన చెరువులు, కుంటలను పునరుద్ధరించాలి. వాన నీటిని భూమిలోకి ఇంకించాలి. పరిశోధన, అభివృద్ధి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామసంఘాల మహిళలు, కార్పొరేట్ యాజమాన్యాలను నిర్వహణలో భాగస్వాములుగా చేయాలి. పారిశ్రామిక అవసరాలకు అధికంగా నీటిని ఉపయోగించేవారు అంతే మొత్తంలో నీటిని సంరక్షించేలా చర్యలు చేపట్టాలి. గ్రామాల్లోని గృహాల్లో, ప్రభుత్వ బంజరు భూముల్లో ఇంకుడు గుంతలను విరివిగా తవ్వాలి.
సామర్థ్యం పెంచేలా చర్యలు..
రైతులు వారి కమతాల విస్తీర్ణాన్ని బట్టి తప్పనిసరిగా పొలాల్లో నీటి గుంతలు నిర్మించుకునేలా చేయాలి. సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలి. చెరువులు, కుంటల్లో పూడికతీసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. వరద నీరు చెరువులు, కుంటల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. కొండలు, గుట్టల చుట్టూ కందకాలు తవ్వించాలి. ఎక్కడికక్కడే నీరు ఇంకేలా ఏర్పాట్లు చేయాలి. ఈ పనులన్నీ ఉపాధి హామీ పథకంలో చేపట్టవచ్చు. చెరువులు, కుంటలు వంటివి కబ్జాలకు గురికాకుండా సాంకేతికత సాయంతో హద్దులను నిర్ణయించి, సంరక్షించాల్సిన అవసరం ఉంది. జల నిర్వహణ సక్రమంగా లేకనే తీవ్ర కష్టాలపాలవుతున్నాం. ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన పెంచాలి. ప్రధానమంత్రి మొదలుకొని పంచాయతీ సర్పంచి వరకు చురుకైన భాగస్వామ్యంతో ముందడుగేస్తేనే, ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకురావడం సులభతరమవుతుంది. జల సంరక్షణ ప్రజల జీవన విధానంగా మారి, అలవాట్లలో మార్పు కలిగితే జలభాగ్యం కలుగుతుంది. ప్రజల క్రియాశీలకమైన భాగస్వామ్యంతో, జల సంరక్షణ యజ్ఞంలా సాగితేనే గ్రామాల్లో జల కళ సిద్ధిస్తుంది
- ఎ.శ్యామ్ కుమార్
ఇదీ చూడండి:'శివసేన ఎప్పడూ మా శత్రువు కాదు'