తెలంగాణ

telangana

ETV Bharat / opinion

మధుమేహం.. నివారణే నిజమైన పరిష్కారం - ప్రపంచ మధుమేహ దినం

మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తున్నాయి. రానున్న దశాబ్దకాలంలో ప్రపంచంలో అరవై కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహం బారిన పడతారని ఒక ప్రాథమిక అంచనా. వీరిలో మూడొంతుల మంది అల్పాదాయ దేశాలకు చెందినవారే ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. అనేకమంది గర్భిణులు డయాబెటిస్‌కు గురవుతూ ఉండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం.

diabetes
మధుమేహం

By

Published : Nov 13, 2021, 6:58 AM IST

దీర్ఘకాలిక వ్యాధులు కేవలం ప్రాణనష్టం కలిగించడమే కాదు.. సాంఘిక ఆర్థిక వ్యవస్థలను సైతం ఛిన్నాభిన్నం చేయగలవు. గడచిన శతాబ్దకాలంగా మధుమేహం మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ అతిపెద్ద సమస్యగా పరిణమించింది. మధుమేహ బాధితుల్లో 80శాతానికి పైగా ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా దాన్ని నియంత్రించుకోగలరు. అయినా దాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించారు. మధుమేహం కలగజేసే అనర్థాలను ప్రచారం చేసేందుకు, వ్యాధిగ్రస్తులందరికీ సరైన చికిత్సను అందుబాటులోకి తెచ్చేందుకు ఏటా నవంబర్‌ 14న ప్రపంచ మధుమేహ దినాన్ని నిర్వహిస్తున్నారు. అనేక దేశాల్లో ఈ వ్యాధిగ్రస్తులకు కావలసిన కనీస చికిత్స విధానాలు అందుబాటులోలేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సకాలంలో చికిత్స అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో ధనిక దేశాలు సైతం ప్రాథమిక స్థాయిలో ఈ వ్యాధికి చికిత్స అందించడంలో విఫలమవుతున్నాయి. పేద దేశాల్లో మధుమేహం ఎక్కువగా ప్రబలడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. అంధత్వం, మూత్రపిండ వైఫల్యం, గుండెపోటు, పక్షవాతం వంటి అనేక ప్రధాన దీర్ఘకాలిక వ్యాధులకు మధుమేహం ఆజ్యం పోస్తోంది.

వరదాయినిలా ఇన్సులిన్‌!

జన్యుపరమైన కారణాలవల్ల అనేక కుటుంబాల్లో అందరికీ మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. పొగాకు వాడకం, అతిగా మద్యం సేవించడం వంటివీ ఈ వ్యాధిని ఆహ్వానించే అంశాలే. శరీర బరువును అదుపులో ఉంచడం, పొగాకు వాడకాన్ని నిలిపివేయడం టైప్‌-2 డయాబెటిస్‌ రాకుండా నిరోధించడానికి మార్గాలు. అమెరికా వంటి దేశాల్లో 50శాతం చిన్నపిల్లలు టైప్‌-2 డయాబెటిస్‌ బారిన పడటం ఆందోళన కలిగించే అంశం. దీనికి ప్రధాన కారణం స్థూలకాయం. పిల్లల్లోనే కాదు- పెద్దల్లో సైతం శారీరక శ్రమ తగ్గడంతోపాటు అధిక కెలొరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మధుమేహం బారిన పడటానికి దారితీస్తోంది.

సరైన చికిత్సా విధానాలు అందుబాటులో లేనికాలంలో బాధితులకు మరణశాసనంలా ఉన్న మధుమేహ వ్యాధి.. 1921లో ఇన్సులిన్‌ అందుబాటులోకి వచ్చాక పూర్తిగా చికిత్సకు లొంగే దీర్ఘకాలిక రోగంగా మారింది. వందేళ్లుగా ఎన్నో కోట్ల మంది వ్యాధిగ్రస్తులు అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ఇన్సులిన్‌ దోహదపడింది. మధుమేహంవల్ల అవయవాలు దెబ్బతిని మనిషి జీవచ్ఛవంలా మారకుండా నివారించగలిగింది. ఇన్సులిన్‌ మాత్రమే అవసరమయ్యే టైప్‌-1 డయాబెటిస్‌ ఉన్న చిన్న పిల్లలకు ఫలవంతమైన సుదీర్ఘ జీవితాన్ని ఇవ్వడం ఈ ఔషధం ఆవిష్కరణతోనే సాధ్యమైంది. నిజానికి ఇన్సులిన్‌ద్వారా చికిత్స ఎంతో సులభమైంది. చాలామంది బాధితుల్లో ఇది క్లిష్టతరమైనదనే అపోహ ఉంది. దానివల్ల మధుమేహ వ్యాధి తీవ్రత మరింత పెరుగుతోంది.

మధుమేహం ఉన్న గర్భిణులకు సుఖ ప్రసవమయ్యే అవకాశం కల్పించడానికే కాకుండా.. పుట్టబోయే బిడ్డ ఆరోగ్య సంరక్షణకూ ఇన్సులిన్‌ చికిత్స దోహదపడుతోంది. ఈ ఔషధం మధుమేహంతో జీవిస్తున్న 46 కోట్ల మందికి పైగా వ్యాధిగ్రస్తులకు వరదాయినిగా మారినా- ఇప్పటికీ అనేకమంది ఎటువంటి చికిత్సా అందుబాటులో లేక మరణిస్తున్నారు. ఖరీదైన కొన్ని మందులను మధ్యతరగతి వర్గాలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగడం లేదు. రక్తంలో గ్లూకోజ్‌ విలువలను ఎప్పటికప్పుడు పరీక్షించి చూసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తుల సంరక్షణలో ప్రాథమిక భాగం. మధుమేహంతో జీవిస్తున్న వ్యక్తులు సరైన అవగాహన లేక అనేక ఇతరత్రా ప్రాణాంతక వ్యాధులకూ గురవుతున్నారు. ప్రజలను చైతన్యపరచే అనేక నిరంతర వైద్య విద్య కార్యక్రమాలను సాధారణ ప్రజలనూ దృష్టిలో ఉంచుకొని నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. పనిచేసే ప్రదేశాల్లో ప్రాథమిక వ్యాయామం చేయడానికి కావలసిన సదుపాయాలు కల్పించడం తమ బాధ్యతగా ఆయా సంస్థలు గుర్తించాలి.

దేశార్థికంపై పెనుభారం

మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సైతం ప్రభావితం చేస్తున్నాయి. రానున్న దశాబ్దకాలంలో ప్రపంచంలో అరవై కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహం బారిన పడతారని ఒక ప్రాథమిక అంచనా. వీరిలో మూడొంతుల మంది అల్పాదాయ దేశాలకు చెందినవారే ఉంటారని భావిస్తున్నారు. అనేకమంది గర్భిణులు డయాబెటిస్‌కు గురవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. డయాబెటిస్‌ చికిత్సకు- ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ఖర్చు చేసిన మొత్తంలో పదిశాతం మేర వ్యయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే మధుమేహం అధికంగా ఉన్న భారతదేశంలో ఇది ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపుతుంది. వ్యాధి నిర్ధారణ, చికిత్స, నివారణలకు చెందిన విధివిధానాలను ప్రతి దేశం రూపొందించుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలనుంచి పెద్దాసుపత్రులదాకా చికిత్స అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఉపయుక్తమైన శాస్త్రీయ పరిశోధనల ద్వారా ప్రజలకు చికిత్సను అందుబాటులోకి తేవలసిన అవసరం ఎంతైనా ఉంది. 'నివారణ ఒక్కటే నిజమైన పరిష్కారం' అనే మాట మధుమేహ వ్యాధికి అన్ని దశల్లోనూ సరిపోతుంది. నిశ్శబ్ద తుపాను వంటి ఈ తరహా దీర్ఘకాలిక వ్యాధులపై ప్రపంచం అప్రమత్తం కావలసిన సమయం ఆసన్నమైంది!

--డాక్టర్ శ్రీభూషణ్ రాజు

ఇదీ చదవండి:

దట్టంగా అవినీతి కాలుష్యం- నిర్మూలనకు అదే మార్గం!

ABOUT THE AUTHOR

...view details