Pradhan Mantri Jan Aushadhi : భారత్‌లో వైద్య చికిత్సల వ్యయంలో డెబ్భై శాతాన్ని ప్రజలు తమ జేబుల నుంచే వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా, వైద్యులు బ్రాండెడ్ ఔషధాలనే రాస్తున్నారు. వాటి కొనుగోళ్లకు రోగులు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్, మూత్రపిండ వ్యాధులతో పాటు వృద్ధాప్య సమస్యలు అధికమవుతున్నాయి. జీవన శైలి సంబంధిత వ్యాధులైన ఊబకాయం, మానసిక రుగ్మతలు పెచ్చుమీరుతున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో వైద్య వ్యయం, ఔషధ వినియోగం మరింత పెరగనున్నాయి.
భారత్‌లో అత్యవసర వినియోగ జాబితాలో ఉన్న 25శాతం ఔషధాల ధరలు మాత్రమే కేంద్రం నియంత్రణలో ఉన్నాయి. మిగిలిన 75శాతం మందుల ధరలను ఆయా సంస్థలే నిర్ణయిస్తున్నాయి. దాంతో ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం తప్పడం లేదు. ఒక సర్వే మేరకు రాబోయే దశాబ్ద కాలంలో దేశీయంగా మందుల కొనుగోళ్లు మూడింతలు పెరగనున్నాయి. ఔషధాల ధరలు సైతం రాబోయే అయిదేళ్లలో తొమ్మిది నుంచి పన్నెండు శాతం మేర ఎగబాకవచ్చని అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో చౌకగా రోగులకు నాణ్యమైన జనరిక్ మందులను అందించే లక్ష్యంతో ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్రాలను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 10,500 జనరిక్ మందుల దుకాణాలను కొలువు తీర్చాలని లక్షించింది.
చాలా చవకగా..
Generic Medicine Central Government : బ్రాండెడ్ మందుల కంటే 50శాతం నుంచి 90శాతం దాకా తక్కువ ధరలోనే జనరిక్ మందులు లభిస్తాయి. వాటి వినియోగాన్ని దేశీయంగా మరింతగా పెంచాలని కేంద్రం ఆశిస్తోంది. అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ తదితర దేశాలు దశాబ్దాలుగా ఇదే బాటలో పయనిస్తూ మంచి ఫలితాలు సాధించాయి. ఈ క్రమంలో దేశీయంగా రోగులకు వైద్యులు జనరిక్ మందులనే రాయాలని ఇటీవల జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను అతిక్రమించే వైద్యులకు జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులను సైతం నిర్ణీత కాలం పాటు రద్దుచేస్తామని ప్రకటించింది. మరోవైపు ఇండియాలో బ్రాండెడ్ మందుల కారణంగా రోగుల మీద పడుతున్న ఆర్థిక భారంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దానిపై విచారణ సందర్భంగా అత్యంత చవకగా లభించే జనరిక్ ఔషధాలను కాదని, ఖరీదైన మందులు రాసే వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ఇటీవల కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రపంచ దేశాలకు కారుచౌకగా నాణ్యమైన జనరిక్ మందులను సరఫరా చేసే భారతీయ ఔషధ సంస్థలు కొన్ని, దేశీయంగా మాత్రం నాసిరకమైనవి విక్రయిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. భారత్ నుంచి ఎగుమతి అయిన దగ్గు మందులు వికటించి గాంబియాలో చిన్నారులు మరణించారు. ఇలాంటి ఘటనలు పలు ఔషధ సంస్థల నాణ్యతా ప్రమాణాలపై భయాందోళనలు లేవనెత్తుతున్నాయి. ప్రతి బ్యాచ్ మందుల నాణ్యతను తనిఖీ చేశాకే వాటిని విపణిలోకి అనుమతించాలి. భారత్‌లో 10శాతం లోపే నాణ్యతా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ లొసుగులను ఆసరాగా చేసుకొని పలు కంపెనీలు నాసిరకం మందులు యథేచ్ఛగా తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో నాణ్యమైన జనరిక్ మందులు దేశీయ విపణిలో విరివిగా లభించే దాకా భారత వైద్య మండలి తన నిర్ణయాన్ని వాయిదా వేయాలని భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) కోరింది. ఐఎంఏ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్ర వైద్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఎన్‌ఎంసీకి సూచించినట్లు కథనాలు వెలువడ్డాయి. దాంతో తన ఆదేశాలను ఎన్‌ఎంసీ ప్రస్తుతానికి నిలిపివేసింది.