ప్రపంచవ్యాప్తంగా కమ్మేసిన కరోనా వైరస్ పెద్ద సంఖ్యలో ప్రజలను పొట్టనపెట్టుకుంది. ఈ వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ఆయా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 శాతం ప్రజలు స్వీయనిర్బంధానికే పరిమితమయ్యారని అంచనా. వారిలో అత్యధిక శాతం భారత్‌లోనే ఉన్నారు. అమెరికాలో 17.2 కోట్లవరకు, ఐరోపా దేశాల్లో 30 కోట్ల మేరకు స్వీయనిర్బంధంలో ఉండగా లాటిన్ అమెరికాలో మాత్రం పోలీస్ పహారాలో నిర్బంధం కొనసాగుతోంది.
పంటలు అందితే..
పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆహార ధాన్యాల కొరత ఎదురుకాకతప్పదు. అందువల్ల పంట ఉత్పత్తుల సేకరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయమిది. ప్రస్తుతం దేశంలోని ఆహార సంస్థల వద్ద మార్చి 9 నాటికి 584.97 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 53శాతం బియ్యం, 47శాతం గోధుమలు.
అత్యధికంగా పంజాబ్‌లో 202.52 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండగా, తెలంగాణలో 27.70, ఆంధ్రప్రదేశ్‌లో 21.21 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలు నిల్వ ఉన్నాయి. ప్రస్తుత రబీ కాలంలో నిరుటికంటే 1.47శాతం వాటి సాగు పెరిగింది. ఆ పంటలు చేతికి అందితే ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కావు. కానీ కరోనా ప్రభావం కారణంగా ఆ పంటలు సకాలంలో చేతికి అందేలా లేవు.
ప్రతి గింజ కొనుగోలు..
అకాల వర్షాల బెడదా పొంచి ఉంటుంది. వీటివల్ల ఇప్పటికే కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రస్తుతం రైతుల నుంచి నేరుగా ధాన్య సేకరణ చేస్తున్న ప్రభుత్వం, తేమ ఉన్న పంటలను కొనుగోలు చేయడంలేదని రైతులు వాపోతున్నారు. కాబట్టి రైతుకు అన్యాయం చేయకుండా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖపై ఉంది.
భారత ఆహార సంస్థ కీలకపాత్ర పోషించాల్సిన సమయమిది. దేశంలో సుమారు 81 కోట్ల మంది సబ్సిడీ ఆహార పదార్థాల మీదే ఆధారపడుతున్నారు. వీరికి అందించే ఆహార పదార్థాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బియ్యం, పంచదార, కిరోసిన్ మాత్రమే అందిస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలు అందించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి.