గత మూడు దశాబ్దాల్లో వ్యవసాయ రంగంలో యువతకు ఆసక్తి తగ్గిందని అనేక సర్వేల్లో వెల్లడైంది. ఈ రంగంలో లాభాలు ఎక్కువ లేకపోవడం, రైతు ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారడం, పొలం పనుల్లో శారీరక శ్రమ అధికంగా ఉండటం- రైతు కుటుంబాలకు చెందిన యువత సేద్యానికి దూరం కావడానికి కారణాలని వ్యవసాయవేత్తలు వాపోతున్నారు. అందువల్లే నేటి యువత ఏ చిన్న ఇంజినీరింగ్ కళాశాలలోనో బీటెక్ పట్టా తీసుకుని ఐటీ కంపెనీల్లో నెలకు వేల రూపాయల్లో జీతం తెచ్చేసుకోవాలని భావిస్తున్నారు. జీవితంలో డబ్బుతో ముడివడిన సౌఖ్యాలకు ప్రాముఖ్యం పెరిగిన మాట నిర్వివాదం. అదే క్రమంలో సమాజంలో రైతులకు విలువ తగ్గింది. ఇటీవలి కాలంలో మహిళలు వ్యవసాయం చేయడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నారన్న ప్రభుత్వ పరిశీలనలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సేద్యంలో 14 శాతం మహిళలు ఉన్నారు. దేశ జనాభాలో 65 శాతం 35 ఏళ్లకన్నా తక్కువ వయసువారని గణాంకాలు చెబుతున్నాయి. అంటే రైతు కుటుంబాల్లోనూ యువత శాతం బాగా పెరిగిందనే అనుకోవచ్ఛు వ్యవసాయ రంగాన్ని యువత, మహిళలకు అనువుగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉంది. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులు వారందరికి అనేక అవకాశాలు కల్పించనున్నాయి. ఉత్సాహంగా అందిపుచ్చుకోవడమే ఇప్పుడు యువత ముందున్న కర్తవ్యం!
లాభసాటి మార్పులు
వ్యవసాయంలో శారీరిక శ్రమ తగ్గించాలి. వ్యవసాయ కూలీల సంఖ్య తగ్గిపోతోంది. కూలీల రేట్లూ బాగా పెరిగాయి. అనేక పంటల సేద్య వ్యయంలో 40 నుంచి 60 శాతం ఈ ఖర్చులే అవుతున్నాయని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. అందువల్లే యంత్రాల వినియోగం ఎక్కువవుతోంది. కనుక యంత్ర సేద్యం యువతకు అనుకూల పరిణామమే. ట్రాక్టర్లు, యంత్రాలు అందరూ కొనలేని మాట నిజమే. ఇవి కొనడానికి పల్లె యువతకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. యంత్రాల వాడకంలో శిక్షణ తీసుకుని, సర్వీసు సెంటర్లు పెడితే ఉపాధి మార్గాలు ఏర్పడతాయి. శ్రమ, ఖర్చు కలిసివచ్చి సేద్యం యువతకు లాభసాటి అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ సంస్కరణలను యువత అధ్యయనం చేయాలి. అందులో అనేక అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ కొనుగోళ్లు, చెల్లింపులు అన్నీ ఆన్‌లైన్‌లో శ్రమ లేకుండా చేయవచ్ఛు పంటను ఎవరికైనా అమ్ముకోవచ్ఛు నేరుగా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్ఛు ఆన్‌లైన్ లావాదేవీల అవగాహన లేని సామాన్య రైతులు వీటిని చేయడం సులభం కాదు. అందువల్ల ఒక్కో ఊరిలో డిజిటల్ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పంట అమ్మకానికి అనువైన మార్కెట్లు అనేకం వస్తున్నాయి. ఊళ్లో పండిన పంటను సొంతంగా లేక ఉమ్మడిగా విక్రయించడానికి ఈ కేంద్రాలు ఉపయోగపడతాయి. ఈ తరహా ఏర్పాట్లకోసం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలతో ఓ నిధిని సైతం సృష్టించింది. దీని నుంచి తక్కువ వడ్డీకి యువత రుణాలు తీసుకుని పల్లెల్లో గోదాములు, శీతల గిడ్డంగులు సైతం కట్టించవచ్ఛు వీటిని ప్రైవేటు మండీలుగా మార్చి రైతుల పంటలు నిల్వ చేసి మంచి ధర సమయానికి అమ్మేలా చేయవచ్ఛు కొంత చొరవ చూపగలిగితే ఆహారశుద్ధి సదుపాయాలను గ్రామయువత పెట్టుకోవచ్ఛు ఉదాహరణకు పండ్లు, కూరగాయలు గ్రేడింగ్ చేసి, శుభ్రపరచి, చక్కగా ప్యాక్ చేసి అధిక ధరకు విక్రయించవచ్ఛు మహిళలు సైతం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.
రైతు ఉత్పాదక సంస్థలు (ఎఫ్‌పీఓ) దేశంలో బాగా విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ సంస్థల్ని స్థాపించి, ముందుకు నడిపించి, రైతులకు లాభసాటిగా వాణిజ్యం జరిగేలా చేయడం కోసం విపుల ప్రణాళిక అవసరం. రైతులకు శిక్షణ, క్రమశిక్షణ, సామర్థ్యం కావాలి. పల్లెల్లో యువత రైతులను సంఘటితపరచి, సంస్థలు స్థాపింపజేసి, సక్రమంగా నడిపించగలగాలి. అవసరమైన నిధులు, యాజమాన్య శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సేద్య పంటలతోపాటు, పాడి, మత్స్య విభాగాలకు సంబంధించి లఘుపరిశ్రమల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రణాళికలు ప్రకటించింది. పశువులకు టీకా వంటివాటికీ నిధులు ప్రత్యేకించింది. గ్రామీణాభివృద్ధికి దోహదపడేలా యువకులు, మహిళలు గ్రామాల్లో వీటిని చేపట్టవచ్ఛు వారికిది జీవనోపాధినీ కల్పిస్తుంది. మన దేశంలో ఆరు శాతం పశువులకు మాత్రమే బీమా సౌకర్యం ఉంది. పశువుల విలువ వేలు, లక్షల రూపాయలకు చేరుకున్న ఈ రోజుల్లో పశువు చనిపోతే యజమానులు ఎంతో నష్టపోతారు. మనుషులకు జీవిత బీమా మాదిరిగానే పశు బీమానూ యువత కంపెనీలనుంచి ఏజెన్సీ తీసుకుని ఉపాధిగా మలచుకోగల వీలుంది.