ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైనదిగా పాకిస్థాన్‌ను (Terrorism in Pakistan 2021) అమెరికా మాజీ రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ రెండేళ్ల క్రితం ఈసడించారు. నూటికి నూరుపాళ్లు అది నిజమేనని చాటుతూ- రక్తం రుచిమరిగిన డజను ముష్కర మూకలకు పాక్ పుట్టిల్లు అని అమెరికా కాంగ్రెస్ పరిశోధన కేంద్రం(సీఆర్‌ఎస్) తాజాగా తేల్చిచెప్పింది. వాటిలోని అయిదు ఆటవిక తండాలు- లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హర్కతుల్ జిహాద్ ఇస్లామీ, హర్కతుల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు ఇండియాలో మారణ హోమం సృష్టించడమే ఏకైక లక్ష్యమని అది స్పష్టీకరించింది. ఉగ్రవాద మిన్నాగులను ముద్దుచేసే ఇస్లామాబాద్ దుర్విధానాలను సీఆర్‌ఎస్ నివేదిక సూటిగా ఆక్షేపించింది. అదే సమయంలో అటు కశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో చొరబాటుకు దుస్సాహసం చేసిన లష్కరే ముష్కరులను సమర్థంగా నిలువరించిన భారత సైన్యం- వారిలో ఒకడిని (pakistan terror attack in india) సజీవంగా పట్టుకొంది. పందొమ్మిదేళ్ల ఆ ఉగ్రవాదిని పాక్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన అలీ బాబర్ పాత్రాగా గుర్తించారు.
'మాకు శిక్షణ ఇచ్చింది పాకిస్థాన్ సైన్యమే' అని విలేకరుల ముందు అతగాడు (pakistan terror attack in india) అసలు నిజం కక్కేశాడు. పేద యువకులకు డబ్బుల ఆశచూపి, భారత్‌పై విద్వేషం నూరిపోసి సరిహద్దులను దాటిస్తున్నట్లు వెల్లడించాడు. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులకు ఇండియా శిక్షణ ఇస్తున్నట్లు ఇటీవల కారుకూతలు కూసిన పాకిస్థాన్ నేతాగణం- దీనికి ఏమని జవాబిస్తుంది? అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదులుగా అభివర్ణించే వారందరూ తమకు 'హీరోలు' వంటి వారని పర్వేజ్ ముషారఫ్ లోగడ నిర్లజ్జగా ప్రకటించుకున్నారు. విదేశాలపై విరుచుకుపడటానికి ఉగ్రశిక్షణ పొందిన దాదాపు 40 వేల మంది తమ దేశంలో తిష్ఠ వేశారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం గతంలో ఒప్పుకొన్నారు. ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా అమలు చేస్తున్న ఆ ధూర్తదేశం- ఆర్థికాభివృద్ధిలో పోనుపోను దిగనాసిపోతోంది. విద్వేషశక్తుల అభయారణ్యంగా విరాజిల్లుతూ విశ్వశాంతికే పెనుముప్పుగా పరిణమించింది!