ఇల్లలకగానే పండగ కాదు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే కొవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చినా, వాటిని జనానికి ఎంత త్వరగా వేస్తే అంత వేగంగా ఆర్థిక వ్యవస్థ కోలుకొంటుంది. చితికిపోయిన జనం బతుకులు మళ్ళీ గాడిన పడతాయి. కొవిడ్ టీకాలను అత్యధిక ప్రజానీకానికి అందజేసే రేసులో అందరికన్నా ముందున్న ఇజ్రాయెల్ తన ఆర్థిక రథానికి తిరిగి ఊపు తీసుకురావడానికి నడుంకట్టింది. ఫిబ్రవరి 23నాటికి ఆ దేశం ప్రతి వందమందికిగాను 87 మందికి టీకాలు వేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) 53.60 సగటుతో రెండో స్థానంలో నిలుస్తుంటే, 28.31తో బ్రిటన్, 20మందితో అమెరికా తదుపరి స్థానాలు ఆక్రమిస్తున్నాయి. చైనాలో ప్రతి 100మందిలో సగటున 2.89 మందికి టీకాలు పడగా భారత్‌లో కేవలం 0.90కే ఇప్పటివరకు టీకా వేయగలిగారు.
ప్రస్తుతం ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాల్లో టీకాల సరఫరాలో ఆటంకాల వల్ల కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం నత్తనడకన సాగుతుంటే, 86లక్షల జనాభాగల ఇజ్రాయెల్‌లో అవసరానికి మించి ఫైజర్-బయో ఎన్ టెక్ టీకాల లభ్యత ఉంది. డిసెంబరు 20న టీకాలు వేయనారంభించిన ఆ దేశం ఫిబ్రవరి 15నాటికే 40శాతానికి మొదటి డోసు వేసి, 28 శాతానికి రెండో మోతాదూ అందించింది. ఇంకా విశేషమేమంటే 60 ఏళ్లు పైబడినవారిలో 80 శాతానికి ఫైజర్ టీకా వేయడం! ఆ వయసువారిలో గతంతో పోలిస్తే కొవిడ్ వ్యాప్తి 56 శాతం తగ్గింది. రెండో డోసు తరవాత ఆస్పత్రి చేరికలు 42 శాతం, కొవిడ్ మరణాలు 35 శాతం మేరకు తగ్గిపోయాయి. నేడు ఇజ్రాయెల్‌లో ఫైజర్ టీకా నిల్వలు పొంగిపొరలుతుండటంతో మోడెర్నా టీకా వేయడానికి అవకాశం లేకుండా పోతోంది. మోడెర్నా టీకాకు ఇజ్రాయెల్ జనవరి అయిదునే లైసెన్సు పొందినా దాని వాడకం ఫిబ్రవరి గడిచిపోతున్నా మొదలేకాలేదు!
ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాథమ్యం!
ఫైజర్-బయోఎన్ టెక్ టీకాలను ఇజ్రాయెల్ భారీయెత్తున సేకరించగలిగిందంటే కారణం- ఈయూకన్నా ఎక్కువ ధర పోసి కొనడమే. ఫైజర్ టీకా డోసు ఒక్కింటికి ఈయూ కేవలం 12 యూరోలను చెల్లిస్తుంటే, ఇజ్రాయెల్ 23 యూరోలు చెల్లించి కొనుగోలు చేసింది. ఒకవేళ ఫైజర్ టీకా వికటిస్తే ఆ కంపెనీయే జవాబుదారీ కావాలని ఈయూ షరతు పెట్టగా, ఇజ్రాయెల్‌లో ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకొంటోంది. అన్నింటినీ మించి వ్యాక్సిన్ సమాచారాన్ని వారంవారం ఫైజర్‌కు పంపడానికి అంగీకరించింది. ఇజ్రాయెల్ ఆరోగ్య రక్షణ యంత్రాంగమంతా డిజిటల్ పద్ధతిలోకి మారిపోయినందువల్ల కొవిడ్ టీకాలకు సంబంధించి పక్కా సమాచారం ఫైజర్‌కు అందుతోంది. ఫార్మా కంపెనీలకు ఇటువంటి సమాచారం అమూల్యమైనది. టీకా మొదటి డోసు వేయగానే రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతూ రెండో డోసు వేసిన తరవాత పూర్తి సత్తా చూపితేనే అది అనుకున్న విధంగా పనిచేస్తున్నట్లు లెక్క! ఇజ్రాయెల్‌లో ప్రభుత్వంతోపాటు అతిపెద్ద ఆరోగ్య బీమా కంపెనీల నుంచీ అందుతున్న సమాచారం ఫైజర్ టీకా శక్తిని నిర్ధారిస్తోంది. ఉదాహరణకు ఆరోగ్య బీమా సౌకర్యం ఉండి, రెండో డోసు వేసుకున్న 5,23,000 మందిలో కేవలం 0.1 శాతం అంటే 544మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. వారిలో ఏ ఒక్కరూ కరోనా వల్ల మరణించలేదు. వ్యాక్సిన్ వేసుకోని 6,28,000 మందిలో 18,425మందికి కరోనా సోకినట్లు బీమా సంస్థల సమాచారం వెల్లడించింది.