తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వ్యర్థాలతో తీవ్ర అనర్థం- తప్పదు భారీ మూల్యం!

మహమ్మారి నేపథ్యంలో దేశంలో జీవవ్యర్థాల సమస్య పెరుగుతోంది. దురదృష్టవశాత్తు, దేశవ్యాప్తంగా ఎన్నోచోట్ల వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్మూలన ఏదీ సజావుగా సాగని ఉదంతాలెన్నో వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వాలు పకడ్బందీగా చర్యలు చేపట్టకపోతే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

solid waste management
వ్యర్థాలతో ప్రజారోగ్యానికి తీవ్ర అనర్థం

By

Published : Jul 29, 2021, 7:45 AM IST

దేశంలో 3.15కోట్ల మేర కొవిడ్‌ కేసులకు 4.22లక్షలకు పైగా మరణాలకు కారణభూతమైన మహమ్మారి వైరస్‌ విజృంభణకు అనుగుణంగా జీవవ్యర్థాల సమస్యా ఇంతలంతలైంది. భారీగా పోగుపడుతున్న బయోమెడికల్‌ వ్యర్థాల గుట్టల్ని వీలైనంత త్వరగా కరిగించకపోతే మరో సంక్షోభాన్ని చేజేతులా కొనితెచ్చుకున్నట్లవుతుంది. ఆస్పత్రులనుంచి ఆయా వ్యర్థాల్ని 48 గంటల్లోగా తరలించనట్లయితే- వైరస్‌, బ్యాక్టీరియా గాలిలోకి చేరి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఏడాదిక్రితమే హెచ్చరించింది. దురదృష్టవశాత్తు, దేశవ్యాప్తంగా ఎన్నోచోట్ల వ్యర్థాల సేకరణ, తరలింపు, నిర్మూలన ఏదీ సజావుగా సాగని ఉదంతాలెన్నో వెలుగు చూస్తున్నాయి.

కొవిడ్‌ కేసులు ప్రజ్వరిల్లక మునుపు దేశంలో రోజూ సగటున సుమారు 600 టన్నుల జీవవ్యర్థాలు విడుదలయ్యేవని, ఆపై వాటి పరిమాణం మరో వంద టన్నులదాకా పెరిగిందన్నది ఏడాదిక్రితం సీపీసీబీ చెప్పిన లెక్క. ఏడు నెలల వ్యవధిలోనే దేశంలో రమారమి 33వేల టన్నుల వరకు బయోమెడికల్‌ వ్యర్థాలు పోగుపడ్డాయన్న విశ్లేషణలు ఈ ఏడాది మొదట్లో వెలువడ్డాయి. పోనుపోను కేసులు ముమ్మరించి ప్రతిరోజూ సగటున తెలంగాణలో దాదాపు అయిదు టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో అంతకు రెట్టింపు పరిమాణంలో జీవవ్యర్థాలు పేరుకుంటున్నాయన్న లెక్కలు రెండునెలలక్రితం కలకలం సృష్టించాయి. దేశవ్యాప్తంగా ఒక్క సంవత్సర కాలంలోనే అవి 87 రెట్లు పెరిగాయని, ఒక్క తెలంగాణలోనే యాభైఏళ్లలో మేటవేసే బయోమెడికల్‌ వ్యర్థాలు పన్నెండు నెలల్లోనే ఉత్పత్తయ్యాయన్న కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తాజా గణాంక వివరాలు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. వాటి సేకరణ, శుద్ధీకరణలకు సంబంధించి భిన్న అంచెల్లో సమన్వయ లోపాలు, మానవ వనరుల కొరత పెచ్చరిల్లుతున్నాయి.

నిబంధనలు గాలికి..

ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనావళిని అనుసరించి, సాధారణ ఆస్పత్రి వ్యర్థాల్లో 10-25 శాతాన్నే ప్రమాదకరంగా పరిగణిస్తారు. కొవిడ్‌ కేసుల విషయంలో అటువంటి లెక్కలు ఎంతమాత్రం పనికిరావు. హానికరమైన వ్యర్థాలన్నింటినీ ఇన్సినిరేటర్‌ ద్వారా రూపుమాపాలని, సాధ్యంకాని పక్షంలో లోతైన గొయ్యితీసి భూమిలో పాతిపెట్టాలని కొవిడ్‌ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అక్షరాలా పాటిస్తున్నదెక్కడ? ఆస్పత్రుల్లో వినియోగించిన సిరంజీలు, దూది, చేతి తొడుగులు, శస్త్రచికిత్సలో తొలగించిన శరీరభాగాలు తదితరాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జనసంచార ప్రాంతాల్లో పారేయరాదన్న జీవవ్యర్థాల చట్ట నిబంధనలు దేశంలో ఏళ్లతరబడి నీరోడుతున్నాయి. ఏనాడూ వాటి అమలు తీరుతెన్నుల సంగతి పెద్దగా పట్టించుకోని సీపీసీబీ నిరుడు జారీచేసిన కరోనా మార్గదర్శకాలకూ అదే గతి పట్టింది!

ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణలో ఎప్పటినుంచో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న అమెరికా, స్పెయిన్‌, ఇటలీ ప్రభృత దేశాలు కొవిడ్‌ నేపథ్యంలో విధినిషేధాలకు పదునుపెట్టాయి. కేసుల ఉరవడి తీరు ప్రస్ఫుటమయ్యాక వారాల వ్యవధిలోనే చైనా బయోవ్యర్థాలను సేకరించి నిర్మూలన కేంద్రాలకు తరలించే యంత్రాంగాన్ని, సాధన సంపత్తిని పరిపుష్టీకరించుకుంది. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హితకరంగా జీవవ్యర్థాల్ని విచ్ఛిన్నం చేసే ఇన్సినిరేషన్‌ విభాగాల్ని అదనంగా సమకూర్చుకుంది. తనవంతుగా అటువంటి చర్యల్ని పకడ్బందీగా చేపట్టడంలో భారత్‌ ఇక ఎంతమాత్రం అలసత్వం వహించే వీల్లేదు! పీపీఈ కిట్లను, మాస్కులను ఉపయోగించి ఇటుకల తయారీకి సంకల్పించిన డాక్టర్‌ బినీష్‌ దేశాయ్‌ విశిష్ట ప్రయోగానికి ఆస్ట్రేలియా, అమెరికా, బ్రెజిల్‌, ఫిలిప్పీన్స్‌నుంచీ చక్కటి స్పందన లభిస్తోంది. ఆ తరహా సృజనాత్మక పరిష్కారాలను ప్రోత్సహించడం సహా ప్రజారోగ్యాన్ని సంరక్షించే సమర్థ కార్యాచరణను ప్రభుత్వాలు చురుగ్గా పట్టాలకు ఎక్కించాలి!

ఇదీ చదవండి :ప్రకృతిని విస్మరిస్తే భారీ మూల్యం తప్పదు

ABOUT THE AUTHOR

...view details