తెలంగాణ

telangana

ETV Bharat / opinion

అందరికీ టీకాలు అందేలా.. - దేశంలో కరోనా కేసులు

దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్​ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడంలాంటి కనీస జాగ్రత్తల్ని ఏమాత్రం పాటించని నిర్లక్ష్య ధోరణులే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో టీకా పంపిణీని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

vaccine
అందరికీ టీకాలు అందేలా...

By

Published : Mar 10, 2021, 6:43 AM IST

ఏడాది కాలానికి పైగా ప్రపంచదేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి తగ్గుముఖం పట్టినట్లే పట్టి, కొన్నిచోట్ల మళ్ళీ కొత్తకోరలు తొడుక్కుంటోంది. వేగంగా పలు ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్లు) చెంది తీరుతెన్నులు మార్చుకుంటూ మానవాళికి పెనుసవాలు రువ్వుతోంది. వుహాన్‌ వైరస్‌కు భిన్నమైన తరహాలో దక్షిణాఫ్రికా, బ్రిటన్‌, బ్రెజిల్‌తో పాటు న్యూయార్క్‌లో, జపాన్‌లో సైతం కొత్త రకాల ఉనికి నమోదు కావడం ప్రపంచ దేశాలకు అశుభ సమాచారమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

జాగ్రత్తలు కొనసాగించాలి

బ్రిటన్‌లో వెలుగుచూసిన కెంట్‌ వైరస్‌ 70శాతం అధిక మారణశక్తి కలిగి ఉందన్న అధ్యయనాలు, అనూహ్య ఉత్పరివర్తనాల పర్యవసానంగా సూపర్‌ వైరస్‌ ఆవిర్భవిస్తే పరిస్థితి మరింత భీతావహం కావచ్చునన్న అంచనాలు హడలెత్తిస్తున్నాయి. వైరస్‌ రకాలు బలం పెంచుకోకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు, కరోనా ఉత్పరివర్తనాలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్న అఖిల భారత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్‌) సంచాలకుల వ్యాఖ్యలు- దీటైన కార్యాచరణ ఆవశ్యకతను చాటుతున్నాయి.

మరోవైపు, దేశంలో కొన్నాళ్లుగా కొవిడ్‌ కేసుల ఉరవడి ప్రమాదఘంటికలు మోగిస్తోంది. తాజాగా నమోదైన కేసులలో సుమారు 86శాతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడులకు చెందినవే. కొన్ని రాష్ట్రాల్లో ఇంతగా తిరిగి కొవిడ్‌ కేసుల ప్రజ్వలనానికి కొత్త వైరస్‌ కారణం కాదంటున్న సీసీఎంబీ సారథి డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా- మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడంలాంటి కనీస జాగ్రత్తల్ని ఏమాత్రం పాటించని నిర్లక్ష్య ధోరణులు కొనసాగితే తక్కినచోట్లా ఉద్ధృతి అనివార్యమంటున్నారు. కరోనా వ్యాప్తి నివారణ, మాయావి వైరస్‌ కొత్తరూపాల మూలాన ముప్పును తిప్పికొట్టే స్థాయిలో పరిశోధనలకు పదునుపెట్టడం- పాలకశ్రేణి ప్రస్తుతం సమర్థంగా చాకచక్యంగా ఎదుర్కోవాల్సిన జంట సవాళ్లు!

జాప్యం జరిగే కొద్దీ..

ఈ సంవత్సరాంతానికి కరోనా ఆటకట్టు తథ్యమన్నవి అవాస్తవిక అంచనాలుగా కొట్టిపారేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఎప్పటికప్పుడు మారుతున్న మహమ్మారి గతిరీతుల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాల్సిందేనని ఇటీవల పిలుపిచ్చింది. వివిధ రాష్ట్రాల్లో కేసులు జోరెత్తుతున్న భారత్‌ వంటి దేశాలకు ఆ హితబోధ మరింతగా వర్తిస్తుంది. ప్రజలకు టీకాలు వేయడంలో జాప్యం జరిగే కొద్దీ కొత్తరకాల వైరస్‌ల రూపేణా సంక్షోభం తీవ్రతరమవుతుందని, పరీక్షల్లో గుర్తించ శక్యంకాని స్ట్రెయిన్‌ రావచ్చునని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తీకరిస్తున్న నేపథ్యంలో- వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత చురుకందుకోవాల్సి ఉంది.

మరింత చొరవ అవసరం

కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో టీకాలకు స్పందన పెరిగిన దరిమిలా అన్ని జిల్లా ప్రాంతీయ ప్రభుత్వాస్పత్రులు, సామాజిక ఆరోగ్యకేంద్రాల్లో వ్యాక్సిన్ల పంపిణీకి తెలంగాణ సర్కారు పచ్చజెండా ఊపింది. అరవై ఏళ్ల వయసు పైబడినవారు రోజులో ఎప్పుడైనా టీకా వేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు, సమయ పరిమితిని ఎత్తేస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఇటీవల ప్రకటించింది. ప్రభుత్వాల చొరవ అంతవరకే పరిమితం కాకూడదు. ప్రస్తుత వేగంతో టీకాల పంపిణీ కొనసాగితే గ్రామీణుల వ్యాక్సినేషన్‌కు కొన్నేళ్లు పడుతుందన్న విశ్లేషణల వెలుగులో- టీకాల శీఘ్రతర పంపిణీ నిమిత్తం ప్రభుత్వాల వ్యూహాలు, కార్యాచరణ సత్వరం పదును తేలాలి.

దేశీయంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యానికి, వినియోగ స్థాయికి మధ్య నెలకొన్న భారీ అంతరం దృష్ట్యా- ఎవరు కోరితే వారికి టీకాలు సమకూర్చేలా విధివిధానాలను సరళీకరించాలి. కనిష్ఠ వ్యవధిలో గరిష్ఠంగా టీకాల పంపిణీతోనే పౌరసమాజానికి పటిష్ఠ రక్షణ ఛత్రం సమకూర్చినట్లవుతుంది. వ్యాక్సిన్లు వేయించుకున్నవారిలో యాంటీబాడీల శాతాన్ని, రోగనిరోధకతను మదింపు వేస్తూ అవసరానుగుణంగా అటు పరిశోధనల్నీ కొనసాగిస్తేనే- కొవిడ్‌ మహాసంక్షోభం నుంచి జాతి గట్టెక్కగలుగుతుంది!

ఇదీ చదవండి :కరోనా టీకా తీసుకున్న దేశ ప్రథమ ఓటరు

ABOUT THE AUTHOR

...view details