తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'డ్రాగన్​'తో సహకారం.. భారత్​కు ఇబ్బందికరం - క్వాడ్

రష్యా భారత్​ల మధ్య బంధం ప్రత్యేకమైనదని అని అనడంతో అతిశయోక్తి లేదు. ఎన్నో సందర్భాల్లో రష్యా భారత్​కు అండగా నిలిచింది. కానీ ఎన్ని సత్సంబంధాలు ఉన్నా బెడిసికొట్టే అవకాశాలు లేకపోలేదు. ఇందుకు ప్రస్తుత పరిస్థితులే ఉదాహరణ. ఆర్థికంగా డ్రాగన్ అండదండలు పొందుతున్న రష్యా చైనాకే మొగ్గుచూపుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి మనస్తత్వంతో నడుచుకుంటున్న రష్యా తన వైఖరిని మార్చుకుని భారత్​తో బంధాన్ని బలపరుచుకుంటుందా? ​

india russia relations, opinion
తరాజు ఎటు మొగ్గినా తంటాయే!

By

Published : Dec 18, 2020, 8:00 AM IST

రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభంలో రష్యా, జర్మనీ మిత్రదేశాలుగా బరిలోకి దిగాయి. ముగిసే సమయానికి రెండూ బద్ధశత్రువులుగా మారిపోయాయి. రష్యా సేనలు జర్మనీని ఓడించాయి. విదేశాంగ విధానాలు ఎంత వేగంగా మారిపోతాయో తెలియజేయడానికి ఇంతకు మించిన ఉదాహరణ అక్కరలేదు. విదేశాంగ విధానంలో కేవలం ఆయా దేశాల జాతీయ ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకుంటారు. భావోద్వేగాలకు, బంధాలకు తావులేదు. రష్యాకు ఈ విషయం బాగా తెలుసు. భారత్‌, జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియాలతో కూడిన ‘క్వాడ్‌’పై చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ అక్టోబరు రెండోవారంలో స్పందిస్తూ- ‘క్వాడ్‌ను ఆసియా నాటో తరహాలో అమెరికా వాడుకోవాలనుకుంటోంది’ అని ఆరోపించారు. ఇటీవల రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీలావ్రోవ్‌ ‘రష్యన్‌ ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌’ సమావేశంలో మాట్లాడుతూ- ‘భారత్‌ను పశ్చిమ దేశాలు, అమెరికా పావుగా వాడుకొంటున్నాయి. అవి చైనాను, ఆ వంకతో రష్యాను అణచివేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి’ అని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరిలో జరిగిన ‘రైసినా డైలాగ్‌’లోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. చైనా కోసం రష్యా మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఆ వాఖ్యలు భారత్‌ను కొంత ఆశ్చర్యానికి గురిచేశాయి.

సమష్టి లక్ష్యాల కోసం

సోవియట్‌ యూనియన్‌- భారత్‌ల మధ్య మంచి అవగాహన ఉంది. యూఎస్‌ఎస్‌ఆర్‌ వారసత్వాన్ని రష్యా అందిపుచ్చుకొన్నాక కూడా అది కొనసాగింది. ఐరాస తీర్మానాలు, శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌కు రష్యా మద్దతు పలికింది. బ్రిక్స్‌, ఆర్‌ఐసీ వంటి సంస్థల్లో ఇరు దేశాలు సమష్టి లక్ష్యాల కోసం కలిసి పని చేస్తున్నాయి. ఇప్పటికీ భారత ఆయుధాగారంలో రష్యాకు చెందిన పరికరాలు 50 శాతానికి పైగా ఉన్నాయి. వైమానికదళంలో సింహభాగం విమానాలు, నౌకాదళంలో జలాంతర్గాములు, విమాన వాహక నౌకలు, ప్రధాన యుద్ధట్యాంకులు ఆ దేశం నుంచి సమకూర్చుకొన్నవే. ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలు ఒప్పందం కూడా చోటుచేసుకొంది. ఆంక్షలను సైతం లెక్కచేయకుండా భారత్‌ వీటిని కొనుగోలు చేసింది. ‘భారత, రష్యా అంతర ప్రభుత్వ కమిషన్‌’తో ఇరు దేశాలు లబ్ధి పొందాయి. రష్యా ఉత్పాదక రంగంలో ఆయుధ తయారీది కీలక భాగం. దాదాపు 30 లక్షల ఉద్యోగాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి. ఆ దేశానికి ఉన్న అతి పెద్ద ఆయుధ వినియోగదారుల్లో భారత్‌ ఒకటి.

నాణేనికి రెండో వైపు చూస్తే, రష్యా-భారత్‌ బంధాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. భారత్‌కు ప్రధాన శత్రువులు చైనా, పాక్‌ అన్న విషయంలో సందేహం లేదు. మరోపక్క ఆంక్షలతో కునారిల్లుతున్న రష్యాకు ఆర్థికంగా అండదండలు చైనా నుంచే లభిస్తున్నాయి. చైనా-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ సుమారు పదివేల కోట్లకుపైగా డాలర్లు; అదే సమయంలో భారత్‌ 2025 నాటికి రష్యాతో తన వాణిజ్య బంధాన్ని మూడువేల కోట్ల డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొంది.

‘ఇండో-పసిఫిక్‌’ అనే పదం వాడటాన్ని రష్యా మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఆసియా-పసిఫిక్‌ అనే పదం మరింత విస్తృతంగా ఉంటుందని చెబుతోంది. ఇక ఇండో-పసిఫిక్‌లోకి రష్యాలోని కీలక ఓడరేవులు వస్తాయి. భవిష్యత్తులో ఇక్కడ అమెరికా ప్రాబల్యం పెరిగిపోతే ఇబ్బందులు తప్పవని రష్యా భావిస్తోంది. ఈ కారణంతోనే ఆ దేశం భారత్‌ కోణం నుంచి చైనాను ఓ సమస్యగా అర్థం చేసుకోకుండా క్వాడ్‌ను వ్యతిరేకిస్తోంది.

స్వతంత్ర విధానం

వాస్తవానికి జపాన్‌తో కలిసి త్రైపాక్షిక కూటమిని ప్రత్యేకంగా ఏర్పాటు చేద్దామని ఆగస్టులో భారత విదేశాంగ శాఖ రష్యాను కోరింది. ఆ రకంగా రష్యాను ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో భాగస్వామిని చేసి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని భావించింది. కానీ, రష్యా దీన్ని తిరస్కరించింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో ఒక్క రష్యా తప్ప దాదాపు ప్రతి దేశం చైనాను ముప్పుగా పరిగణిస్తున్నాయి. దీనికి తోడు భారత ఆయుధ మార్కెట్‌ కూడా మెల్లగా అమెరికా వైపు మొగ్గుతోంది. ఎఫ్‌18 యుద్ధవిమానాల కొనుగోలుపై చర్చలు వేగవంతమయ్యాయి. ఈ కాంట్రాక్టు అమెరికాకు దక్కితే రష్యా మిగ్‌-29 మార్కెట్‌కు భారీ దెబ్బే. ఇవన్నీ రష్యా దృష్టిలో లేని అంశాలేమీ కాదు. సెర్గీలావ్రోవ్‌ ప్రకటన దరిమిలా భారత విదేశాంగశాఖ స్పందిస్తూ- తమ విధానం పూర్తిగా స్వతంత్రంగానే ఉంటుందని ప్రకటించింది. ఒకరి ఒత్తిడితో మరొకరిని వదులుకొనే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది.

ఇది ఒక రకంగా వాస్తవమే. 2007లో క్వాడ్‌లో చేరేందుకు సుముఖంగా లేని భారత్‌ 2017 నాటికి వైఖరి మార్చుకోవడానికి కారణం- చైనా ముప్పుగా మారడమే. ఆ విషయం రష్యాకు తెలియదనుకోలేం. చైనాతో భారత్‌ సంబంధాలు గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఇబ్బందుల్లో ఉన్నాయని ఫిక్కీ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ అంగీకరించారంటే- పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో చైనాను ఎదుర్కొనేందుకు మనకు బలమైన మిత్రులు అవసరం. రష్యా మంత్రి అసలు ఇవేవీ పట్టించుకోకుండా, భారత్‌ ఇంకా తమ అనుచరగణంలోనే ఉండాలని కోరుకుంటున్నారు. భారత విదేశాంగ విధానానికి మార్గదర్శకత్వం చేయాలనుకున్నారు. ఇది ప్రచ్ఛన్నయుద్ధం నాటి మనస్తత్వానికి అద్దం పడుతోంది. ఈ ఆలోచనా విధానం నుంచి బయటకు వస్తేనే ఇరు దేశాల సంబంధాలు కాలానుగుణంగా మరింత బలపడే అవకాశం ఉంది. అమెరికా నుంచి ముప్పు పెరుగుతోందని రష్యా భయపడి చైనా వైపు మళ్లుతోంది. చైనా వైపు నుంచి ముప్పు ఉందని తేలడంతో భారత్‌ మెల్లగా అమెరికాకు దగ్గరవుతోంది. అంతేగానీ, రష్యాను దూరం చేసుకోవాలనుకోవడం లేదు.

‘డ్రాగన్‌’తో సహకారం

రక్షణ రంగంలో రష్యా-చైనా సహకారం మరింతగా పెనవేసుకుపోయింది. చైనాతో సైనిక బంధం ఏర్పడే అవకాశాన్ని కొట్టి పారేయలేమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించడం భారత్‌ ఆందోళనను పెంచింది. రష్యా నుంచి డ్రాగన్‌కు చేరే ఆయుధాలకు సంబంధించిన సమాచారం- అనుభవం ఆ తరవాత పాక్‌కు చేరిపోయే ముప్పు అధికంగా ఉంది. అంతెందుకు- గత ఏడాది ఉత్తర చైనాలో పాక్‌తో కలిసి చేపట్టిన యుద్ధవిన్యాసాల్లో సుఖోయ్‌-30లను వాడినట్లు ‘గ్లోబల్‌ టైమ్స్‌’ పేర్కొంది. ఇదే రకం విమానాలను భారత్‌ వాడుతోంది. వీటి ఎలెక్ట్రానిక్స్‌ సమాచారం, రాడార్‌ వివరాలు పాక్‌కు చేరితే భారత్‌కు చాలా ఇబ్బందికరం. ఇక ఎస్‌-400లో కొన్ని ఎలెక్ట్రానిక్‌ పరికరాలు చైనాలో తయారవుతున్నాయని భాజపా నేత సుబ్రమణ్యస్వామి ఇటీవల బాంబు పేల్చారు. ఇది పూర్తిగా కొట్టిపారేయలేని అంశమే. ఎందుకంటే ఎలెక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీలో డ్రాగన్‌ రష్యాను ఎప్పుడో దాటేసింది.

- పెద్దింటి ఫణికిరణ్‌

ఇదీ చదవండి :'మరో దఫా చర్చలతోనే చైనాతో వివాదం పరిష్కారం'

ABOUT THE AUTHOR

...view details