భారత్‌లో పట్టణీకరణ శరవేగంతో సాగుతోంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 31 శాతం పట్టణ వాసులే. 2030 నాటికి ఈ జనాభా 40 శాతానికి చేరి, 75 శాతం జీడీపీ పట్టణాల నుంచే లభిస్తుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మెరుగైన జీవన ప్రమాణాలు, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. ఇలాంటి వారందరికీ గృహవసతి, విద్య, ఉపాధి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వాలకు పెనుసవాలుగా మారుతోంది. జీవన యోగ్యతకు గృహవసతి కల్పన కీలకమైన ప్రాధాన్యాంశం. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గూడు లేని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల కోసం రకరకాల గృహనిర్మాణ పథకాలు ప్రకటించి అమలు చేస్తున్నాయి.
2015లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించింది. 2022 నాటికి పట్టణాలు, నగరాలలో ఇళ్లు లేని వారందరికీ గృహవసతి కల్పించడం ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్) లక్ష్యం. అందుకోసం 2022 నాటికి కోటి ఇళ్లు నిర్మించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇప్పటి వరకు 15 లక్షల గృహాలు నిర్మించి లబ్ధిదారులకు అందచేశారు. 37 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉండగా 12.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి నవ్య సాంకేతికతలను ఉపయోగించాలని ఉద్దేశించారు. విపత్తులను తట్టుకునేలా, తక్కువ వ్యయంతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణానికి ఉపయోగపడే నవ్య సాంకేతికత పరికల్పనలను అన్వేషించడానికి సాంకేతిక ఉపమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వంలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంక్షేమాభివృద్ధిలో భాగంగా వివిధ గృహనిర్మాణ పథకాలను అమలు చేస్తుండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం అల్పాదాయ వర్గాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వై.ఎస్.ఆర్. గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తున్నాయి.
విపరీత జాప్యం
అంతా బాగానే ఉన్నా- ప్రభుత్వ గృహనిర్మాణ పథకాల్లో విపరీత జాప్యం జరుగుతుండటమే సమస్యగా మారుతోంది. సంఖ్యాపరమైన లక్ష్యాలను ఘనంగా నిర్దేశించుకున్నా, ఆ లక్ష్యాలను చేరుకోవడంలో భిన్న కారణాలతో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇటుక, సిమెంటు వినియోగించే సంప్రదాయ పద్ధతులతో నిర్మాణాలకు చాలా సమయం పడుతోంది. ఖర్చు అంచనాలను మించుతోంది. పర్యావరణానికీ హితకరంగా ఉండటం లేదు. పెరుగుతున్న పట్టణీకరణకు దీటుగా ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. ఇళ్ల కొరత 2019 నాటికి రెండు కోట్లకుపైగానే ఉంది.
ఈ క్రమంలో గృహనిర్మాణంలో నూతన ఆవిష్కరణలు, నవ్యసాంకేతికతల అన్వేషణకు ప్రాధాన్యం ఏర్పడింది. తక్కువ వ్యయంతో, శరవేగంగా, నాణ్యమైన గృహాల నిర్మాణానికి తోడ్పడేలా కొత్త ఆవిష్కరణలు ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా గృహ నిర్మాణ రంగంలో కనిపెడుతున్న నవీన ఆవిష్కరణలు, సాంకేతికతలను గుర్తించి, దేశంలోని భిన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మలచడం కోసం కేంద్రం 'గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్(జీహెచ్‌టీసీ)'ను ఏర్పాటు చేసింది. తక్కువ ఖర్చుతో, ఉన్నత నాణ్యతతో, పర్యావరణ హితంగా, చిరకాలం మనగలిగే గృహనిర్మాణ సాంకేతికతల అభివృద్ధితో పాటు భవిష్యత్తులో చోటుచేసుకునే మార్పులకు అనుగుణమైన సాంకేతికతలను కూడా జీహెచ్‌టీసీ ప్రోత్సహిస్తుంది. ఇది గృహనిర్మాణ రంగంలో భిన్న వర్గాలతో సదస్సులు, సమావేశాలు నిర్వహించింది. వివిధ దేశాల నుంచి కొత్త ఆవిష్కరణల కోసం ప్రదర్శనలు ఏర్పాటు చేసింది.
లైట్ హౌస్ ప్రాజెక్టులు..
దేశంలోని భిన్న వాతావరణ పరిస్థితులు, జీవన యోగ్యత, నిర్వహణానుకూలత మొదలైన అంశాల ఆధారంగా 54 నవకల్పన గృహనిర్మాణ సాంకేతికతలను ఎంపిక చేసి, అందులోని ఆరు భిన్న పరిజ్ఞానాలతో దేశంలోని ఆరు నగరాల్లో లైట్‌హౌస్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. జనవరి 1న ప్రధానమంత్రి వీటి నిర్మాణానికి ఆన్‌లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఇందులో దేశంలోని ఇండోర్, రాజ్‌కోట్, చెన్నై, రాంచీ, అగర్తలా, లఖ్‌నవూ వంటి ఆరు నగరాల్లో వెయ్యి ఇళ్ల చొప్పున నిర్మిస్తారు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఫిన్లాండ్ వంటి దేశాల్లో అవలంబిస్తున్న ఆధునిక నిర్మాణ విధానాలను అమలు చేస్తారు.