తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రజాస్వామ్యంపై నిఘానేత్రం.. కఠిన ఆంక్షలతోనే అడ్డుకట్ట

భారత్‌లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లను పెగసస్‌తో హ్యాక్‌ చేశారని తీవ్రంగా దుమారం రేగుతోంది. ఈ పరిస్థితి కేవలం భారత్​కే పరిమితం కాలేదు. వివిధ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఉగ్రవాదులు, నేరగాళ్ల ఆట కట్టించడానికి వీలుగా ఉన్న ఈ స్పైవేర్.. దుర్వినియోగం అవుతోంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కఠినమైన నియంత్రణ చట్రాన్ని ఏర్పరచకపోతే ఈ దుష్ట సాఫ్ట్‌వేర్ల వ్యాపారానికి అడ్డూ అదుపూ లేకుండా పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

pegasus spy ware
ప్రజాస్వామ్యంపై నిఘానేత్రం.. కఠిన ఆంక్షలతోనే అడ్డుకట్ట

By

Published : Jul 29, 2021, 6:02 AM IST

దేశదేశాల్లోని పాత్రికేయులు, పౌర ఉద్యమకారుల మొబైల్‌ ఫోన్‌ సంభాషణలు, సందేశాలపై నిఘాకు వివిధ ప్రభుత్వాలు ఎన్‌ఎస్‌ఓ అనే ఇజ్రాయెలీ కంపెనీ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ పెగసస్‌ను ఉపయోగించాయని వెల్లడి కావడం తీవ్ర సంచలనం రేపుతోంది. భారత్‌లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లను కూడా పెగసస్‌తో హ్యాక్‌ చేశారని తీవ్రంగా దుమారం రేగుతోంది. భారత్‌లో వాట్సాప్‌ సందేశాలపై నిఘాకు పెగసస్‌ను ఉపయోగించారంటూ ఫేస్‌బుక్‌ సంస్థ 2019లోనే కేసు పెట్టింది. ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌ను కేవలం ప్రభుత్వాలకే విక్రయించాలని ఇజ్రాయెలీ రక్షణ శాఖ షరతు విధించి ఉన్నందువల్ల, ప్రభుత్వ ప్రమేయం లేకుండా పౌరుల ఫోన్ల హ్యాకింగ్‌ జరగదని అర్థమవుతోంది. ఉగ్రవాదులు, నేరగాళ్ల ఆట కట్టించడానికి వీలుగా తమ స్పైవేర్‌ను 40 దేశాల సైన్యాలు, గూఢచారి సంస్థలు, పోలీసు దళాలకు మాత్రమే విక్రయించామని ఎన్‌ఎస్‌ఓ చెబుతోంది. తమ స్పైవేర్‌ను దుర్వినియోగం చేసినందుకు 10 దేశాల ప్రభుత్వాలను నిషిద్ధ జాబితాలో చేర్చామని, దుర్వినియోగం చేస్తాయనే అనుమానంతో మరో 55 దేశాలకు పెగసస్‌ను విక్రయించడానికి నిరాకరించామని తెలిపింది.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా- మెక్సికోలో పాత్రికేయులను, ప్రభుత్వాధికారులను బెదిరించడానికి మాదకద్రవ్య ముఠాలు పెగసస్‌ను ఉపయోగించినట్లు వెల్లడైంది. మెక్సికన్‌ పాత్రికేయుడు సిసీలియో పైనేడా హత్య వెనకా పెగసస్‌ నిఘా హస్తం ఉందని తేలింది. నేరగాళ్ల క్రూర క్రీడల్ని నిరోధించడానికి రూపొందిన పెగసస్‌, చివరకు ఆ నేరగాళ్ల చేతికే చిక్కిందన్నమాట! అయితే, మెక్సికో ప్రభుత్వం 2011లో పెగసస్‌ను ఉపయోగించి మాదక్రదవ్య ముఠా నాయకుడు ఎల్‌ చాపో హొవాకిన్‌ గుజ్‌ మాన్‌ను అరెస్టు చేయగలిగింది.

ప్రముఖులకు పెగసస్‌ సెగ

పెగసస్‌ను ఉపయోగించి భారత ప్రభుత్వం 142 మంది పౌరులు, పాత్రికేయులు, రాజకీయ నాయకులపై నిఘా పెట్టిందని, దీనిపై విచారణ జరపాలంటూ సీనియర్‌ పాత్రికేయులు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. రాహుల్‌ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్‌ నాయకుల ఫోన్లను పెగసస్‌తో హ్యాక్‌ చేసినట్లు వార్తలు రాగా, భారత ప్రభుత్వం వాటిని ఖండించింది. జులై 18 మొదలుకొని 17 అంతర్జాతీయ వార్తాసంస్థల సంఘం ఈ సామూహిక మొబైల్‌ నిఘా కార్యక్రమం గురించి కథనాలు వెలువరించసాగింది. ఈ సంఘంలో గార్డియన్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌, లే మాండ్‌, భారత్‌కు చెందిన వైర్‌ వంటివి భాగంగా ఉన్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ సంఘానికి సాంకేతిక సహకారం అందించింది. పెగసస్‌తో ఫోన్లు హ్యాక్‌ అయినవారు ప్రపంచవ్యాప్తంగా 50,000 మంది ఉన్నారని ఈ సంఘం తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 600 పైచిలుకు రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, 189 మంది పాత్రికేయులు, 85 మంది మానవ హక్కుల ఉద్యమకారులు, 64 మంది వ్యాపార సంస్థల అధినేతల ఫోన్లను పెగసస్‌తో హ్యాక్‌ చేశారు. ఈ జాబితాలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌ కూడా ఉన్నారని తెలియడం వల్ల ఆయన తన ఫోన్‌ను మార్చేసి వేరే నంబర్‌తో కొత్త ఫోన్‌ కొనుక్కొన్నారు. ఐఫోన్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో కాల్స్‌, సందేశాలు, ఫొటోల గురించి ఆరా తీయడం సహా, ఆ ఫోన్లలోని కెమెరాలను, మైక్రోఫోన్లను వినియోగదారుడికి తెలియకుండా ఆన్‌ చేయడానికి పెగసస్‌ ఉపకరిస్తుంది. మొరాకో దేశం పెగసస్‌ స్పైవేర్‌తో 14 మంది ఫ్రెంచి మంత్రుల ఫోన్లపై నిఘా వేసిందని ఫ్రెంచి దినపత్రిక లే మాండ్‌ వెల్లడించింది. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, ఇరాక్‌, మొరాకో, ఈజిప్ట్‌ నాయకుల ఫోన్‌ నంబర్లు కూడా వార్తాసంస్థల కన్సార్టియం వెల్లడించిన జాబితాలో ఉన్నాయి.

భద్రత లోపిస్తుంది..

సౌదీఅరేబియా ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించి 2018లో హత్యకు గురైన అమెరికన్‌ పాత్రికేయుడు జమాల్‌ ఖషోగీ భార్యతో పాటు ఆయన మిత్రురాలైన ఒక విమాన ఉద్యోగి ఫోన్‌నూ హ్యాక్‌ చేయడానికి పెగసస్‌ను ఉపయోగించారని వెల్లడైంది. దీనితో తమకేమీ సంబంధం లేదని ఎన్‌ఎస్‌ఓతోపాటు సౌదీ ప్రభుత్వమూ ప్రకటించింది. ఈ శక్తిమంతమైన సాఫ్ట్‌వేర్‌ పౌరులు సుఖంగా నిద్రపోవడానికి తోడ్పడుతోందని ఎన్‌ఎస్‌ఓ చెప్పుకొంటున్నా- అది నిరంకుశ ప్రభుత్వాలు, మాఫియా ముఠాల చేతిలో పడితే పౌరులకు భద్రత కొరవడుతుంది. దేశాల్లో ఎన్నో అరాచకాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అందుకే అంతా ముక్తకంఠంతో ఇలాంటి దుష్ట గూఢచర్య నిఘా నేత్రాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

లాభాలే ప్రధానం

ఇంతవరకు చైనా మాత్రమే దుష్ట సాఫ్ట్‌వేర్‌ (మాల్‌వేర్‌)ను ఉపయోగించి, ఇతర దేశాలపై సైబర్‌ గూఢచర్యానికి పాల్పడుతోందనే ఆరోపణ వస్తూ ఉండేది. కానీ, పాశ్చాత్య కంపెనీల స్పైవేర్‌ వ్యాపారం బట్టబయలైన నేపథ్యంలో చైనాపై ఆరోపణ చాలా బోలుగా ధ్వనిస్తోంది. నిఘా సాఫ్ట్‌వేర్‌ వ్యాపారంలో చైనాతో పాశ్చాత్య ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, కంపెనీలు పోటీపడుతున్నాయి. ఉదాహరణకు ఫ్రెంచి కంపెనీ నెక్సా టెక్నాలజీస్‌ ఇంటర్నెట్‌ నిఘా పరికరాలను ఈజిప్ట్‌, లిబియాలకు అమ్మింది. కెనడా సంస్థ శాండ్‌ వైన్‌ సెన్సార్‌ షిప్‌ సాఫ్ట్‌వేర్‌ను బెలారూస్‌, ఈజిప్ట్‌ ప్రభుత్వాలకు అమ్మగా, అమెరికాకు చెందిన ఒరాకిల్‌ నిఘా సాధనాలను చైనా ప్రభుత్వానికి విక్రయించింది. పాశ్చాత్య సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు దుష్ట ప్రభుత్వాలతో వ్యాపారం చేసి లాభాలు దండుకోవడానికి ఎల్లప్పుడూ తయారుగానే ఉంటాయి.

ఇలాంటి ప్రైవేటు నిఘా సాఫ్ట్‌వేర్‌ క్రయవిక్రయాలను తక్షణం నిషేధించి, దుర్వినియోగ నివారణ నిబంధనలను పకడ్బందీగా అమలుచేసిన తరవాతే స్పైవేర్‌ వ్యాపారాన్ని పునరుద్ధరించాలి. క్షిపణుల వంటి ఆధునిక ఆయుధాలు, పౌర-సైనిక అవసరాలు రెండింటికీ ఉపయోగపడే సాంకేతికతల ఎగుమతి నియంత్రణకు 42 అభివృద్ధి చెందిన దేశాలు వాస్సెనార్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అది సక్రమంగా అమలు కావడం లేదు. పెగసస్‌ వెల్లడింపుల దృష్ట్యా ఇకనైనా వాణిజ్య ప్రాతిపదికపై నిఘా సాంకేతికతలను ఎగుమతి చేసే కంపెనీలకు అన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కఠినమైన నియంత్రణ చట్రాన్ని ఏర్పరచాలి. లేదంటే దుష్ట సాఫ్ట్‌వేర్‌ వ్యాపారం అడ్డూఆపూ లేకుండా పెరిగిపోయి, ప్రజాస్వామ్య పునాదులను గుల్లబారుస్తుంది.

నియంత్రణ ఏదీ?

నేడు పెగసస్‌ ఒక్కటే కాదు, వివిధ కంపెనీలు రూపొందించిన అనేకానేక స్పైవేర్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అవి ప్రధానంగా అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, ఇజ్రాయెల్‌ వంటి ప్రజాస్వామ్య దేశాల్లోనే రూపుదిద్దుకొంటున్నాయి. చిలీ నుంచి వియత్నాం వరకు దాదాపు 65 దేశాల ప్రభుత్వాలు వీటిని కొనుగోలు చేశాయి. ఈ స్పైవేర్‌ల వల్ల పలువురు ఉద్యమకారులు జైలుపాలయ్యారు. పాత్రికేయుల ప్రాణాలు పోయాయి. ఇంత జరుగుతున్నా, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు స్పైవేర్‌ల క్రయవిక్రయాలు, అక్రమ వాడకాన్ని నియంత్రించడం లేదు. వీటి ఎగుమతికి ఉదారంగా లైసెన్సులిస్తున్నాయి.

- కైజర్‌ అడపా

ఇదీ చదవండి :'పెగసస్​ను కేంద్రం కొనుగోలు చేసిందా? లేదా?'

ABOUT THE AUTHOR

...view details