ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ నార్టన్ పది దేశాల్లో నిర్వహించిన ఆన్‌లైన్ సర్వే ప్రకారం- 2019 సంవత్సరంలో భారత్‌లో సైబర్ నేరాల కారణంగా జరిగిన నష్టం రూ.1.24 లక్షల కోట్లు. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాల బాధితులు 35 కోట్ల మంది; ఇందులో భారతీయులు 13 కోట్ల మంది. ప్రపంచంలో 67శాతం, భారత్‌లో 81శాతం చొప్పున నెటిజన్లు తమ వ్యక్తిగత సమాచారం చౌర్యం అవుతుందని ఆందోళన చెందుతున్నారు. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 2018లో కంటే 2019లో దేశంలో సైబర్ నేరాలు 63.5శాతం పెరిగాయి.
అప్రమత్తత అవసరం
అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ)లోని సైబర్ నేరాలు చూసే అంతర్జాల నేర ఫిర్యాదు కేంద్రం లెక్కల ప్రకారం- 2019లో సైబర్ నేరాల బారినపడిన ప్రపంచంలోని మొదటి 20 దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. సంప్రదాయ నేరాలు అదుపులోనే ఉంటున్నప్పటికీ, సైబర్ నేరాలు మాత్రం కళ్లెంలేని గుర్రాల్లా పరిగెడుతున్నాయి. సాంకేతిక అంశాలతో ముడివడిన ఈ నేరాల దర్యాప్తే కాదు.. న్యాయ విచారణా సవాలుగా మారింది. భవిష్యత్తులో సాంకేతిక నేరాలు మరింత పెచ్చరిల్లుతాయని పోలీసులు అంచనా వేస్తున్నా- అందుకు తగ్గట్లు వ్యవస్థలను తీర్చిదిద్దడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
నేరాలను నివారించాలంటే అవి జరక్కుండా చూడాలి. నేరగాళ్లను గుర్తించి చట్టపరంగా శిక్షించాలి. సంప్రదాయ నేరాలు నివారించేందుకు పోలీసులు నిర్దుష్ట విధివిధానాలు అమలు చేస్తుంటారు. పాత నేరస్థులపై నిఘా పెట్టడం; పగలూ రాత్రీ గస్తీ నిర్వహించడం, సీసీ కెమెరాలను అన్ని ప్రాంతాలకూ విస్తరించడం వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఇంటికి కన్నంవేసి నగలు, నగదు చోరీ చేసే రోజులు పోయి- ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉంటూ అంతర్జాలం ద్వారా ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘరానా నేరగాళ్లు పెరిగారు. సాంకేతిక పరిజ్ఞానంపై సమాజంలో కొరవడిన అవగాహనే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం దేశంలో 2019లో అన్ని రకాల నేరాలు అంతకు ముందు ఏడాది కంటే 1.6శాతం పెరిగాయి. ఇదే సమయంలో ఆర్థిక నేరాల సంఖ్య 1,56,268 నుంచి 1,65,782కు (6.1శాతం) పెరిగింది. సైబర్ నేరాలు మాత్రం 27,248 నుంచి 44,546కు (63.5శాతం) పెరిగాయి. దీన్నిబట్టి సైబర్ నేరాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
సాంకేతిక పరిజ్ఞాన వాడకం సగటు మనిషికీ అత్యావశ్యకం కావడం సైబర్ నేరగాళ్ల పంట పండిస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో అత్యధిక భాగం ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. భారతీయ రిజర్వుబ్యాంక్ లెక్కల ప్రకారం దేశంలో ప్రతిరోజూ అయిదు లక్షల కోట్ల రూపాయలలోపు డిజిటల్ లావాదేవీలు పది కోట్ల వరకు జరుగుతున్నాయి. 2025 నాటికి ఇవి రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా. దీంతో నేరాలు మరింత పేట్రేగే ప్రమాదమూ పొంచి ఉంది. ఖాతాదారుడి సమాచారాన్ని చౌర్యం చేయడంద్వారా బ్యాంకుల్లో డబ్బును తమ ఖాతాల్లోకి మళ్ళించుకోవడం సర్వసాధారణమైంది. ఇందుకోసం కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఖాతాదారుల వివరాలను వారిద్వారానే తెలుసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాల నిర్వహణ గురించి పలువురిలో సరైన అవగాహన లేకపోవడమే ఈ తరహా నేరాలకు ప్రధాన కారణం. జనంలోని అత్యాశను ఆసరాగా చేసుకుంటూ రకరకాల పథకాల పేరుతోనూ మోసం చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం 2019లో దేశవ్యాప్తంగా రూ.4719.2 కోట్ల సొమ్ము సైబర్ చోరులు కొల్లగొట్టగా అందులో 30.8శాతం అంటే రూ.1451.6శాతం మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు.