తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భూరికార్డుల ఆధునికీకరణ కోసం ఒకే దేశం- ఒకే రిజిస్ట్రేషన్‌ - దేశంలో భూ రికార్డులు ఆన్​లైన్​

One Nation, One Registration: డిజిటల్‌ ఇండియా భూరికార్డుల ఆధునికీకరణ పథకం కింద రాబోయే రెండేళ్లలో భూరికార్డుల నిర్వహణలో, రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో పలు కీలక మార్పులు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా కేంద్రం 'ఒకే దేశం - ఒకే రిజిస్ట్రేషన్‌' అనే కొత్త విధానాన్ని రూపొందించనుంది.

One Nation, One Registration
ఒకే దేశం... ఒకే రిజిస్ట్రేషన్‌

By

Published : Feb 16, 2022, 8:52 AM IST

One Nation, One Registration: భూవనరుల సమర్థ వినియోగం నేటి ముఖ్యమైన అవసరమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవలి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించి భూరికార్డులను నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి కమతానికీ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చేలా ప్రోత్సహిస్తామన్నారు. భూరికార్డులను అన్ని భాషల్లో తర్జుమా చేసే వ్యవస్థను తెస్తామన్నారు. 'ఒకే దేశం - ఒకే రిజిస్ట్రేషన్‌' నినాదంతో... ఇప్పటికే అమలులోకి తెచ్చిన 'జాతీయ జనరిక్‌ దస్తావేజుల రిజిస్ట్రేషన్‌' విధానం ద్వారా దేశంలో ఎక్కడి నుంచి అయినా దస్తావేజులు రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు.

ప్రయోజనమెంత?

డిజిటల్‌ ఇండియా భూరికార్డుల ఆధునికీకరణ పథకం కింద రాబోయే రెండేళ్లలో భూరికార్డుల నిర్వహణలో, రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో పలు కీలక మార్పులు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే కేంద్రం రూపొందించనున్న కొత్త రిజిస్ట్రేషన్‌ విధానం. దీని సాధ్యాసాధ్యాలు, లాభనష్టాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వ్యవస్థ వస్తే రాష్ట్రాల ఆదాయానికి, అధికారాలకు కోత పడుతుందని కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు దీనివల్ల పారదర్శకత పెరిగి, ప్రజలకు మేలు జరుగుతుందంటూ సమర్థిస్తున్నారు. వ్యాపార సరళీకరణ కోసం తెస్తున్న ఈ సంస్కరణలు భూమి సాగుచేస్తున్నవారికి ఏ మేరకు మేలు చేస్తాయనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

భూరికార్డులు నేడు అన్నిరకాల అవసరాలకూ కీలకంగా మారాయి. అయితే రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదు. దశాబ్దాలు గడిచినా భూముల రీసర్వే జరగలేదు. భూమి హక్కులకు భరోసా ఇచ్చే చట్టాలు లేవు. ఈ పరిస్థితిని మార్చడానికి 1980వ దశకం నుంచి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. జాతీయ భూరికార్డుల ఆధునికీకరణ పథకానికి కేంద్రం 2008లో అంకురారోపణ చేసింది. ఈ పథకమే కొన్ని మార్పు చేర్పులతో 2016 నుంచి డిజిటల్‌ ఇండియా భూ రికార్డుల ఆధునికీకరణ పథకంగా అమలు జరుగుతోంది. భూమి హక్కుకు పూర్తి భరోసా కల్పించడం ఈ పథకం లక్ష్యం. ఇటీవల సవరించిన అంచనాల ప్రకారం 2024 నాటికి ఈ పథకం ఆశించిన లక్ష్యం చేరాలి. కేంద్రం ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేసింది. మరో వెయ్యి కోట్ల రూపాయలు అవసరమని అంచనా. ఈ పథకం అమలు నత్తనడకన సాగుతోందని గత సంవత్సరం పార్లమెంటు స్థాయీసంఘం అభిప్రాయపడింది. భూరికార్డుల ఆధునికీకరణలో భాగంగా ప్రతి భూకమతానికీ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇచ్చే కార్యక్రమాన్ని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బిహార్‌లో ప్రారంభించింది. 'యునీక్‌ ల్యాండ్‌ పార్సెల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (యూఎల్‌పీఐఎన్‌)' పేరుతో ప్రతి కమతానికీ 14 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇచ్చే కార్యక్రమం పది రాష్ట్రాల్లో కొనసాగుతోంది. వచ్చే ఏడాదికి దేశమంతటా అమలు చేయాలనేది లక్ష్యం. భూదార్‌ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018లోనే ఇలాంటి పథకాన్ని ప్రారంభించింది. భూదార్‌ జారీకోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల చట్టాన్ని సవరించింది. దేశంలోని అన్ని గ్రామాల్లో ఇంటి స్థలాలకు ఆస్తి కార్డులు ఇచ్చే 'స్వామిత్వా' అనే పథకం కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో గత సంవత్సరం ప్రారంభమైంది. ఇప్పటికి లక్ష గ్రామాల్లో సర్వే పూర్తి అయింది. 25 వేల గ్రామీణ కుటుంబాలకు ఆస్తి కార్డులు పంపిణీ చేశారు.

పేదలకు భరోసా అవసరం

భూమికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలి. దీని ఆధారంగా ఎవరైనా భూమి హద్దులు స్పష్టంగా గుర్తించగలిగే వీలుండాలి. అది ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉండాలి. కోర్టు కేసులు, బ్యాంక్‌ రుణాలు, ఆస్తిపన్నులు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు అన్నీ ఈ రికార్డుకు అనుసంధానం కావడం కీలకం. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ సులభంగా, తక్కువ వ్యవధిలో, వీలైతే ఒకే చోట జరిగే వ్యవస్థ అవసరం. భూ హక్కుల మార్పిడి, ఆస్తిపన్ను, రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి 20 ఏళ్ల వివరాలను భద్రపరచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలి. భూమి హక్కుకు పూర్తి భరోసా ఇచ్చే టైటిల్‌ గ్యారంటీ చట్టం ఉండాలి. గడచిన నాలుగు దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధించడానికి ప్రయత్నిస్తున్న అంశాలివి. ఇవే 'సులభతర వాణిజ్యం' కోసం తేవాల్సిన సంస్కరణలు. భూమి రికార్డులు, భూపరిపాలనలో వస్తున్న ఎక్కువ శాతం మార్పులు వీటిని దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నవే. ఈ మార్పులు కొంత మేరకు భూమిని సాగు చేసుకునే వారికి మేలు చేయవచ్చు. కొన్ని నష్టపరచేవీ ఉన్నాయి. రైతులు, భూమిలేని పేదలు, మహిళలు, గిరిజనులు, దళితులు, ఇతర వెనకబడిన వర్గాల దృక్కోణంలో చూస్తే తేవాల్సిన మార్పులు భిన్నంగా ఉన్నాయి. భూ వివాదాలు సత్వరం తక్కువ ఖర్చుతో గ్రామ స్థాయిలో పరిష్కారం కావాలి. భూముల రీసర్వే చేసి కొత్త రికార్డులు తయారు చేయాలి. కొన్నేళ్లుగా సాగులో ఉన్న భూమికి పట్టా కావాలి. వాస్తవ సాగుదారుల పేర్లు రికార్డులో నమోదు కావాలి. భూమిలేని పేదలకు భూములు దక్కాలి. అవసరమైన న్యాయసేవలు ఉచితంగా అందాలి. మొత్తంగా కొద్దోగొప్పో భూమి ఉండాలి. ఆ భూమిపై భద్రమైన హక్కులుండాలి. ఈ లక్ష్యాలు నెరవేర్చడం కూడా ప్రభుత్వ బాధ్యతే. అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావడం, అంతకంటే ముఖ్యంగా రైతుల భూమి ఇక్కట్లు తొలగిపోవడం కీలకమని గుర్తించాలి.

ఎక్కడినుంచైనా...

దేశమంతా ఒకే విధమైన రిజిస్ట్రేషన్‌ విధానం ఉండాలనే ఆశయంతో అయిదేళ్ల క్రితం 'నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ)' జాతీయ జనరిక్‌ దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ విధానాన్ని ప్రస్తుతం 12 రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరిగేలా, కేవలం ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్ళేలా ఈ విధానాన్ని రూపొందించారు. బ్లాక్‌ చైన్‌ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రతి దస్తావేజును భద్రపరచి అందరికీ అందుబాటులో ఉంచుతారు. తెలంగాణలో తెచ్చిన 'ధరణి' కూడా ఇలాంటి విధానమే. ఈ విధానం వల్ల భూముల రిజిస్ట్రేషన్‌ సులభతరమైంది. కేంద్రం ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి దేశంలో ఎక్కడినుంచి అయినా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పిస్తామంటూ ప్రకటించింది. ఈ విధానం వల్ల రాష్ట్రాలకు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభావం పడుతుందని, రాష్ట్రాల అధికారాలను కుదించినట్లు అవుతుందని నిరసన వ్యక్తమవుతోంది.

- ఎం. సునీల్​ కుమార్, భూ చట్టాల నిపుణలు

ఇదీ చూడండి:

డ్రాగన్​ వైపు రష్యా మొగ్గు.. బలపడుతున్న బంధం!

ABOUT THE AUTHOR

...view details