ONDC Food Delivery App : ఓఎన్డీసీ.. కొద్దిరోజులుగా నెట్టింట బాగా వినిపిస్తున్న పేరు. కారణం.. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్‌పై స్విగ్గీ, జొమాటోను మించి రాయితీలు ఇవ్వడమే. విషయం తెలియగానే అందరూ ఓఎన్డీసీని వాడడం ప్రారంభించారు. ఇతర యాప్‌లతో పోల్చితే ఓఎన్డీసీలో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎంత డబ్బు ఆదా అయిందో చెబుతూ సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్స్ పోస్ట్ చేశారు. ఈ బంపర్ ఆఫర్స్ వెనుక కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీతోపాటు గ్రోసరీ షాపింగ్, మొబిలిటీ(క్యాబ్, బైక్ రైడ్ బుకింగ్) సేవలు కూడా అందించే ఓఎన్డీసీని వాడడం అలవాటు చేసుకుంటున్నారు.
ONDC Full Form : ఓఎన్డీసీ అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఈ-కామర్స్‌ను సమ్మిళితంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన వేదిక ఇది. కేంద్ర ప్రభుత్వ విభాగమైన 'డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్-డీపీఐఐటీ' పరిధిలో లాభాపేక్ష లేని ప్రైవేటు సంస్థగా ప్రారంభమైంది ఓఎన్డీసీ. 2021లో దీనిపై కసరత్తు ప్రారంభించగా.. 2022 సెప్టెంబర్‌లో బెంగళూరులో బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఓఎన్డీసీ సేవల్ని ప్రస్తుతం దేశంలోని 236 నగరాల ప్రజలు పొందొచ్చు. ఇప్పటివరకు 36వేల విక్రయదారులు ఈ ప్లాట్‌ఫాంలో చేరారు.
ఓఎన్డీసీ ప్రత్యేకతలు ఇవే..
ONDC Features : ప్రముఖ మార్కెట్ రీసెర్చ్, బ్రోకరేజి సంస్థ 'బెర్న్‌స్టీన్ రీసెర్చ్' నివేదిక ప్రకారం భారత దేశ ఈ-కామర్స్ మార్కెట్ విలువ 2025 నాటికి 150 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఇంతటి భారీ వ్యాపారంలో సత్తా చాటేందుకు పోటీ పడుతున్న దిగ్గజ సంస్థలతో పోల్చితే ఓఎన్డీసీ ఎంతో ప్రత్యేకం. ఈ విశిష్టతల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది.. ఓపెన్ నెట్వర్క్. వస్తు, సేవల బదిలీకి సంబంధించిన సమాచారం మార్పిడికి ఓపెన్ ప్రొటోకాల్స్ రూపొందించారు. దీని వల్ల కొనుగోలుదారు, విక్రయదారు మధ్య సమాచార మార్పిడి.. ఈమెయిల్ పంపినట్టుగా, యూపీఐ పేమెంట్ చేసినట్టుగా.. అత్యంత సింపుల్‌గా, పారదర్శకంగా ఉంటుందనేది నిపుణుల మాట.
ప్రస్తుతం ఈ-కామర్స్ రంగంలో ప్రతి సంస్థకు తమ సొంత యాప్ ఉంది. ఏదైనా ఉత్పత్తి అమ్మాలనుకునే వారు ఆ యాప్‌లో ముందు సెల్లర్‌గా రిజిస్టర్ కావాలి. కొనుగోలుదారులు కూడా అదే యాప్ ఇన్స్టాల్ చేసుకుని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ యాప్ ద్వారానే లావాదేవీలన్నీ సాగించాలి. ఓఎన్డీసీ ఇందుకు భిన్నం. ఇది ఒక ప్రత్యేక యాప్ ఆధారంగా పని చేయదు. ప్రభుత్వం నిర్దేశించిన ఓపెన్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ పాటించే ఏ యాప్ ద్వారానైనా ఈ సేవలు పొందొచ్చు. ఈ జాబితాలో ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ముందుంది. పేటీఎం యాప్ ద్వారా ఓఎన్డీసీ ప్లాట్‌ఫాంను యాక్సెస్ చేసి, ఆర్డర్ చేసే వీలు కల్పించింది ఆ సంస్థ. పేటీఎం యాప్ సెర్చ్ బార్లో ఓఎన్డీసీ/ఓఎన్డీసీ ఫుడ్/ఓఎన్డీసీ గ్రోసరీ అని టైప్ చేస్తే చాలు. మీకు కావాల్సిన ఫుడ్, కిరాణా సామగ్రి ఆర్డర్ చేయొచ్చు. క్యాబ్ లేదా బైక్ రైడ్ బుక్ చేసుకోవచ్చు.
ONDC How To Use : పిన్‌కోడ్(ఫోన్‌ఫే అనుబంధ సంస్థ), మీషో, మేజిక్పిన్, మైస్టోర్ కూడా ఓఎన్డీసీ ప్లాట్‌ఫాంను తమ యాప్‌లలో చేర్చాయి. విక్రయదారుల కోసం అల్పైనో, బిట్ల్సిలా, బిజోమ్, బోట్, డెలివరీ, డిజిట్ వంటి యాప్స్ ఓఎన్డీసీ నెట్‌వర్క్‌లో భాగస్వాములు అయ్యాయి. వినియోగదారులు ఏ యాప్ ఓపెన్ చేసినా.. ఓఎన్డీసీలో రిజిస్టర్ అయిన ప్రతి విక్రయందారుడి ఉత్పత్తులు కనిపిస్తాయి. అక్కడి నుంచే ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రత్యేక ఆఫర్ల కోసం అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, జొమాటో గోల్డ్, స్విగ్గీ వన్ తరహాలో ప్రతి యాప్‌లోనూ అదనంగా డబ్బులు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పనిలేదు.
ఇద్దరికీ అలా లాభం..
ONDC How It Works : ఆన్లైన్ ఫుడ్ డెలివరీలో స్విగ్గీ-జొమాటోదే ద్విధాధిపత్యం. హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 54% మార్కెట్ వాటా జొమాటోదే. మిగిలినది 46% స్విగ్గీది. ఇంతలా స్విగ్గీ-జొమాటో జోరు కొనసాగుతున్నా.. ఆ సంస్థలు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. నష్టాల ఊబి నుంచి గట్టెక్కేందుకు రెస్టారెంట్ల కమీషన్ పెంపు, కష్టమర్లపై ప్లాట్‌ఫాం ఫీజు వడ్డన వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఫలితంగా అటు రెస్టారెంట్ల యజమానులు, ఇటు వినియోగదారుల్లో అసంతృప్తికి కారణమయ్యాయి. ఇలాంటి సమయంలోనే ఇరు వర్గాలను ఆకట్టుకునే వ్యూహంతో వచ్చింది ఓఎన్డీసీ. స్విగ్గీ-జొమాటో పోల్చితే రెస్టారెంట్ల నుంచి అతి తక్కువ కమీషన్ తీసుకుంటోంది.