తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భయపెడుతున్న థర్డ్​ వేవ్​.. సుడిగాలిలా ఒమిక్రాన్‌ విజృంభణ - భారత్​లో ఒమిక్రాన్​ కేసులు

omicron cases in india: భారత్​లో రోజు వారి కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కూడా అంతకంతకూ విస్తరిస్తోంది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఏకంగా 3.5 లక్షల కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికా తరవాత ప్రపంచంలోనే అత్యధికంగా కొవిడ్‌ బారిన పడిన దేశాల జాబితాలోకి భారత్‌ చేరిపోయింది. ఈ నేపథ్యంలో వైరస్​ పట్ల అలక్ష్యం వహించకూడదని నిపుణులు చెప్తున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందిపడాల్సి వస్తుందని చెప్తున్నారు.

omicron cases in india
ఒమిక్రాన్ కేసులు

By

Published : Jan 22, 2022, 6:54 AM IST

omicron cases in india: దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కొవిడ్‌ ఉద్ధృతి కనిపిస్తోంది. జాతీయస్థాయిలో పాజిటివిటీ రేటు దాదాపు 18శాతానికి చేరింది. ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఏకంగా 3.5 లక్షల కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికా తరవాత ప్రపంచంలోనే అత్యధికంగా కొవిడ్‌ బారిన పడిన దేశాల జాబితాలోకి భారత్‌ చేరిపోయింది. అగ్రరాజ్యంలో రోజుకు దాదాపు 8.5 లక్షలకుపైగా కొత్త పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. మన దేశంలో ఆర్‌నాట్‌ విలువ జనవరి రెండోవారానికే నాలుగు దాటిపోయింది. అంటే ఒకరి నుంచి నలుగురికి పైగా కొవిడ్‌ వ్యాపిస్తోందని అర్థం. ఈ విలువ ఒకటి కంటే తక్కువ ఉంటే మహమ్మారి దశ ముగిసిపోయిందని అర్థం. డిసెంబరు చివరివారంలో 2.9గా ఉన్న ఈ విలువ ఇప్పుడు నాలుగుకు చేరిపోయిందని ఐఐటీ మద్రాస్‌ పరిశీలనలో తేలింది. కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతంగా ఉన్నప్పుడు సైతం ఆర్‌నాట్‌ విలువ 1.69 దాటలేదు. ఇప్పుడు నాలుగుకు చేరిందంటే పరిస్థితి తీవ్రతను గుర్తించాలి. మూడోదశ ఫిబ్రవరి ఒకటి నుంచి 15 మధ్య తీవ్ర స్థాయికి చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతో సాఫ్ట్‌వేర్‌ సంస్థలు సహా పలు కార్యాలయాలకు 'ఇంటినుంచే పని' విధానాన్ని మార్చి-ఏప్రిల్‌ వరకు పొడిగించారు.

సాంకేతిక సిబ్బంది కొరత

రెండోదశ కరోనా సమయంలో భారత్‌లో మౌలిక సదుపాయాల సమస్య తీవ్రంగా తలెత్తింది. ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు కొంతమేర బయటపడినట్లే కనిపిస్తోంది. 2021 నాటి గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ (జీహెచ్‌ఎస్‌) సూచీ ప్రకారం భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను తట్టుకోవడానికి భారత్‌ సహా ధనిక దేశాలు సైతం ఏమాత్రం సంసిద్ధంగా లేవని తెలుస్తోంది. నిరోధం, పరీక్షలతో నిర్ధారణ, తక్షణ స్పందన, ఆరోగ్యవ్యవస్థ, అంతర్జాతీయ విధానాలకు కట్టుబడటం, ముప్పు... ఈ ఆరు విభాగాల్లో వివిధ దేశాలను జీహెచ్‌ఎస్‌ సూచీ అంచనా వేస్తుంది. 2019 నుంచి ఈ విషయంలో ఇండియా స్కోరు పడిపోయింది. కొవిడ్‌ రెండోదశలో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉండటంతో లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ)ను దాని ఉత్పత్తి కేంద్రాల నుంచి క్రయోజెనిక్‌ ట్యాంకర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు రవాణా చేయాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో అదనపు ట్యాంకర్లను విదేశాల నుంచి ఆకాశమార్గంలోనూ తెప్పించారు. ప్రత్యేక ఆక్సిజన్‌ రైళ్లను నడిపించారు. ఉక్కుకర్మాగారాల్లో ఉన్న పారిశ్రామిక ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచీ ఆసుపత్రులకు ఆక్సిజన్‌ పంపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యవసర స్పందన, ఆరోగ్యవ్యవస్థ సంసిద్ధత ప్యాకేజీ రెండోదశ కింద కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.1,828 కోట్లు కేటాయించింది. దానికితోడు పీఎంకేర్స్‌ నిధులతోను, దాతలనుంచి వచ్చిన సహాయంతోను దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. 2020 అక్టోబరు నుంచి 2021 నవంబరు నాటికి వైద్యపరమైన ఆక్సిజన్‌ సామర్థ్యం 28శాతం పెరిగింది. గాలిలోని ఆక్సిజన్‌ను వేరుచేసే సాంకేతికత (పీఎస్‌ఏ)తో కూడిన 2,494 ప్లాంట్లు కేవలం 112 రోజుల రికార్డు వ్యవధిలో ఏర్పాటయ్యాయి. వాటిలో చాలావరకు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అవన్నీ కలిసి ఒక రోజులో లక్షకు పైగా పడకలకు ఆక్సిజన్‌ అందించగలవు. ప్రస్తుత మహమ్మారి తీవ్రతను, వివిధ దేశాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్యను చూస్తే అవి ఎంతవరకు సరిపోతాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలు సైతం ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ వార్డులను పునరుద్ధరించడం, ఆక్సిజన్‌ ప్లాంట్ల పనితీరును మరోసారి గమనించడం, గ్రామాల్లో ప్రత్యేకంగా ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటుచేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నాయి. వంద పడకల సామర్థ్యం దాటిన ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ తప్పనిసరిగా ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటుచేయాలనే నిబంధన విధించాయి. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులతో పాటు ప్రధాన నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు సిద్ధంగానే ఉన్నాయి. అయితే, వాటిని నిర్వహించే సాంకేతిక సిబ్బంది కొరత పలు రాష్ట్రాలను వేధిస్తోంది. ప్లాంట్లు సక్రమంగా నడిచినంత కాలం ఫర్వాలేదు గానీ, వాటిలో ఏ చిన్న సమస్య తలెత్తినా, తక్షణం పరిష్కరించే సాధారణ నిపుణులూ చాలావరకూ అందుబాటులో లేరన్నది చేదు వాస్తవం. పైపెచ్చు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ రోజుకు కేవలం లక్ష మందికి మాత్రమే సరిపోతుంది. కొత్తగా వస్తున్న ఒమిక్రాన్‌ కేసుల్లో పది శాతం బాధితులు ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చినా రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందిపడాల్సి వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలను అధిగమిస్తేనే...

కొవిడ్‌ చికిత్సకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన తాత్కాలిక ఆసుపత్రులను మూసివేయకూడదని ఆరోగ్యరంగ నిపుణులు ముందే హెచ్చరించారు. అయితే, కొవిడ్‌ తొలి, మలిదశల్లో యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేసిన తాత్కాలిక సదుపాయాలను ఆ తరవాతి కాలంలో నిర్లక్ష్యం చేశారు, కొన్నిచోట్ల మూసేశారు. వివిధ రాష్ట్రాల్లో కొవిడ్‌ కారణంగా ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. దాంతో కొవిడ్‌ చికిత్సల కోసం తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న సిబ్బందిని ఆ తరవాత కొనసాగించకపోవడం, అప్పటిదాకా పనిచేసిన వారికి జీతాలుసైతం పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోవడం వంటివి చూశాం. కొవిడ్‌ విధుల్లో ఉన్న సిబ్బందికి అందించిన భోజనాల బిల్లులూ కొన్నిచోట్ల గుత్తేదారులకు అందక ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు మళ్ళీ కేసుల ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆ సమస్యలన్నింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా అధిగమిస్తాయన్నదానిపైనే ప్రజల ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవడంతో పాటు గతంలో కొంత ముందుకొచ్చిన కార్పొరేట్‌ ప్రపంచం ఈసారి మరింత చొరవ తీసుకుంటేనే విపత్కర పరిస్థితుల నుంచి దేశం బయటపడగలదు.

అలక్ష్యం వద్దు

ఒమిక్రాన్‌ వచ్చినా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆసుపత్రుల్లో చేరికలు తక్కువగానే ఉన్నాయని, మరణాలూ దాదాపుగా నమోదు కావడంలేదని మొదట్లో ప్రచారాలు జరిగాయి. అయితే దాన్ని తేలిగ్గా తీసుకోవడం సరికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరించింది. పలు దేశాల్లో ఆసుపత్రి చేరికలతో పాటు మరణాలూ ఎక్కువగానే ఉన్నాయని పేర్కొంది. రెండు డోసుల టీకా తీసుకున్నవారిలో డెల్టా కంటే ఒమిక్రాన్‌ ప్రభావం తక్కువగానే ఉన్నంత మాత్రాన దాన్ని తేలికపాటి విభాగంలో చేర్చకూడదని డబ్ల్యుహెచ్‌ఓ అధిపతి టెడ్రోస్‌ వ్యాఖ్యానించారు. అమెరికా, యూకే, ఇతర ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా వంటివి దాని బారినపడి అల్లాడుతున్నాయి. ప్రతిచోటా లక్షల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి దేశానికీ ఒమిక్రాన్‌ నుంచి ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌ సైతం డిసెంబరు నెలాఖరులోనే తీవ్రంగా హెచ్చరించారు.

- రఘురామ కామేశ్వరరావు పువ్వాడ

ఇదీ చూడండి:కర్ణాటకలో కరోనా విలయం- ఒక్కరోజే 48వేల కేసులు

ABOUT THE AUTHOR

...view details