సుదీర్ఘకాలంగా చర్చలకు పరిమితమైన గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రక్రియలో ఒకడుగు ముందుకు పడింది. కానీ ఈ ముందడుగు కాగితాలకే పరిమితమవుతుందా లేక కార్యరూపం దాలుస్తుందా అన్నది ప్రధానమైన ప్రశ్న. భాగస్వామ్య రాష్ట్రాల అంగీకారం లభించడం, భారీ నిధులు అవసరం కావడం రెండూ ప్రధాన సమస్యలే. ఈ రెండింటినీ అధిగమించడం అంత సులభంగా జరిగే పని కాదు. దేశంలో చేపట్టిన నదుల అనుసంధానంలో మహానది-గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి ఒకటి. మహానదిలో మిగులు లేదని ఒడిశా, గోదావరి నీరు తమ అవసరాలకు మాత్రమే సరిపోతాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెబుతూ వచ్చాయి. అయితే పై నుంచి నీటిని మళ్లిస్తే అనుసంధానంపై తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నాయి. దీనిపై చర్చలు తప్ప ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
కొత్త ఆయకట్టుకు నీరు
గత లోక్‌సభ ఎన్నికలకు ముందు దేవాదుల-దుమ్ముగూడెం మధ్యలో అకినేపల్లి నుంచి నాగార్జునసాగర్-సోమశిల ద్వారా కావేరిపై ఉన్న గ్రాండ్ ఆనకట్ట వరకు నీటిని మళ్లించేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రాజెక్టు నివేదికను తయారు చేసింది. రాష్ట్రాలు సానుకూలంగా లేకపోయినా- ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించినా వినియోగించుకోని నీటిని మళ్లిస్తామని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ పేర్కొంది. అకినేపల్లి నుంచి చేపడితే నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతం భూసేకరణలో పోతుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేయడం తదితర కారణాల వల్ల అది పెండింగ్‌లో పడింది. దీన్ని మార్పు చేసి, ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ ద్వారా చేపట్టేలా నిర్ణయం జరిగింది. దీని ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కూడా ప్రయోజనం ఉంది. కొత్త ఆయకట్టుకు నీరందడంతోపాటు, పాత ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాలు వ్యతిరేకించకపోవచ్చని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మించి రోజుకు 2.2 టీఎంసీల చొప్పున 143 రోజుల్లో 247 టీఎంసీల వరద నీటిని మళ్లించి 9.44 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగుకు, తాగేందుకు, పారిశ్రామిక అవసరాలకు ఇవ్వాలన్నది లక్ష్యం. చెన్నై తాగు, పారిశ్రామిక అవసరాలకు ప్రత్యేక కేటాయింపు ఉంది. జూన్ నుంచి అక్టోబరు వరకు నీటిని మళ్లిస్తారు. ఇందుకోసం 1,211 కి.మీ. దూరం కాలువ తవ్వాల్సి ఉంటుంది. జూన్‌లో, అక్టోబరులో మళ్లించే నీటివల్ల దిగువన ఉన్న ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉంది. జూన్‌లో వచ్చే నీటిని వరద నీటిగా భావించలేం కాబట్టి, ఎంత వరద ప్రవాహం ఉన్నప్పుడు నీటిని మళ్లించాలన్నదానిపై ముందుగానే స్పష్టతకు రావాల్సి ఉంది.
ముందుకు కదలని ప్రాజెక్టులు..
అనుసంధానానికి రాష్ట్రాలు అంగీకరిస్తాయా అన్నది ప్రధాన సందేహం. ప్రాజెక్టు నివేదిక ప్రకారమే... ఛత్తీస్‌గఢ్ అంగీకరించలేదు. మహారాష్ట్ర కొన్ని అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తం చేసింది. ఈ పథకం ద్వారా మళ్లించే 247 టీఎంసీలలో, 176.5 టీఎంసీలు శ్రీరామసాగర్-ఇచ్చంపల్లి మధ్య లభించే మిగులు కాగా, మిగిలినవి ఇంద్రావతిలో ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించి ఇంకా వాడుకోనివి. వాస్తవానికి ఒడిశాలోని మహానది నుంచి గోదావరి-కృష్ణా-పెన్నా మీదుగా కావేరివరకు నీటిని తీసుకెళ్లాలన్నది నదుల అనుసంధానం ప్రణాళిక. కేంద్రం ఒడిశాతో చర్చించినా ఫలితం లేకపోవడంతో, బ్రహ్మపుత్ర-గంగ-సువర్ణరేఖ-మహానది-గోదావరి అనుసంధానం చేపట్టాలని, ఈలోగా మొదటి దశగా గోదావరిలో మిగులు, ఛత్తీస్‌గఢ్ వాడుకోలేని నీటిని మళ్లించాలన్నది నిర్ణయం. అయితే బ్రహ్మపుత్ర- గోదావరి అనుసంధానానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. ఎందుకంటే నదుల అనుసంధానం గురించి మాట్లాడటం ప్రారంభించి ఇప్పటికి రెండు దశాబ్దాలైనా పెద్దగా ముందడుగు పడలేదు.
కేంద్రం అకినేపల్లి నుంచి కావేరి వరకు నీటిని మళ్లించేలా డీపీఆర్‌ను తయారు చేయించినా, రాష్ట్రాల నుంచి సానుకూలత లేకపోవడంతో తాజాగా ఇచ్చంపల్లి నుంచి నీటిని మళ్లించేలా మార్పు చేసింది. తెలంగాణ సూచన మేరకు ఈ మార్పు చేసినట్లు పేర్కొన్నా, మహానది నుంచి తేకుండా గోదావరిలో ఉన్న మిగులును మళ్లించే ప్రతిపాదనకు తెలంగాణ ఏ మేరకు అంగీకరిస్తుందో చూడాల్సి ఉంది. తమ అవసరాలు పోనూ మిగులు ఉంటే మళ్లించడానికి అభ్యంతరం లేదంటున్న తెలంగాణ- శ్రీరామసాగర్-ఇచ్చంపల్లి మధ్య మిగులు ఉందంటున్న జాతీయ జల అభివృద్ధి సంస్థతో ఏకీభవించే అవకాశం లేదు. మొదట ఈ ప్రతిపాదన చేసినపుడు ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయకపోయినా- వ్యతిరేకత తెలపలేదు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే వ్యతిరేకించింది. తమ వాటాను మళ్లించడానికి వీల్లేదని, పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రణాళిక రూపొందించామని పేర్కొంది. ఇంద్రావతిపై బోథ్‌ఘాట్ వద్ద 169 టీఎంసీలతో బహుళార్థక సాధక ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు వెల్లడించింది. ఇంద్రావతిలో తమకు 40 టీఎంసీల కేటాయింపు ఉందని, దట్టమైన అటవీ ప్రాంతం కారణంగా ఇక్కడ వాడుకోలేని నీటిని పక్క బేసిన్‌లో వాడుకోవడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామని మహారాష్ట్ర పేర్కొంది.