తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భారత్​-నేపాల్ మధ్య తరతరాల వివాహ బంధం! - భారత్ నేపాల్ తాజా

భారత్​-నేపాల్ మధ్య బంధాలు ఈనాటివి కాదు. రాజుల కాలం నుంచే రెండు దేశాల మధ్య వియ్యం నడిచింది. నేపాల్ రాజులకు, భారత్​లోని పాలకులకు మధ్య లెక్కలేనన్ని వివాహాలు జరిగాయి. ఇవన్నీ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Nepal-India Bahu-Beti bonds
భారత్​-నేపాల్ మధ్య తరతరాల వివాహ బంధం!

By

Published : Jul 24, 2020, 5:38 PM IST

నేపాల్ రాజులు, భారత్​లోని పాలకులతో వివాహ సంబంధాలు ఏర్పర్చుకున్న కాలంనాటి ఓ పాత ఎలక్ట్రిక్ మీటర్ 1845లో నిర్మించిన డల్హౌసీ లాడ్జిలో కనిపించింది. 1910 మార్చిలో నహాన్ యువరాణి మదాలసా వివాహ జ్ఞాపకార్థం దేవ్ షంషీర్ జంగ్ బహదూర్ రాణా జూనియర్ ఈ విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసినట్లు ఇత్తడి ఫలకంపై రాసి ఉంది.

హెచ్​హెచ్​ దేవ్ షంషీర్ జంగ్ బహదూర్ తన సోదరుడు తిరుగుబాటులో బహిష్కరించడానికి ముందు మూడు నెలల వరకు నేపాల్ ప్రధానిగా ఉన్నారు. నేపాల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఆయన డార్జిలింగ్​లో ఉండేందుకు ఈస్టిండియా కంపెనీ నిరాకరించింది. ఆయనకు రెండు అవకాశాలు అచ్చింది. ఒకటి దిల్లీకి రావడం. లేదా కొండ ప్రాంతాల్లో ఓ ప్రదేశాన్ని ఎంచుకొని ఉండటం.

అద్భుతమైన ప్రాంతంలో స్థావరం!

ఇందులో రెండోదాన్నే ఎంచుకున్నారు దేవ్. ముస్సోరీకి వెళ్లే దారిలో నాలుగు మైళ్ల స్థలాన్ని ఎంచుకున్నారు. అద్భుతమైన దృశ్యాలు, పెద్ద తోట, సమృద్ధిగా నీరు ఉన్న ఓ కొండప్రాంతం అంచున కూర్చున్నారు. అవసరమైన ప్రతిదాన్ని వెంట తీసుకొచ్చుకున్నారు. దీంతోపాటు నౌలఖా హారాన్ని తనతో పాటు తీసుకొచ్చారు. 1857 తర్వాత నేపాల్​లో ఆశ్రయం పొందినప్పుడు నానా సాహెబ్​ నుంచి ఈ హారాన్ని తీసుకున్నారు. ఊరగాయ బాటిల్​లో దాచిపెట్టి దీన్ని తీసుకొచ్చారు.

త్రిభువన్ రాజు ఆశ్రయంతో

హిమాలయ రాజ్యంలో రాణాలు రాజు పదవిలో కాకుండా ప్రధానమంత్రులుగా పరిపాలించసాగారు. 1950 నవంబర్ 6న త్రిభువన్ రాజు భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించిన తర్వాత అందరి పాలకుల్లానే వీరి పరిస్థితీ ముగింపు దశకు చేరిపోయింది.

భారత రాయబార కార్యాలయం గేట్​ వద్దకు రాగానే ఆత్రుతగా రాజు తన ఎడమవైపు చూశాడు. ఆయన ఆశించిందే కంటికి కనిపించింది. అత్యంత ఉపశమనం కలిగే విధంగా కాంపౌండ్ లోపలి నుంచి ఓ సంకేతం వెలువడింది. వెంటనే వాహనాలు ఎడమవైపు తిరిగాయి. ఆ తర్వాత గేట్లు మూసుకున్నాయి. కాపలాదారులు మాత్రం బయటే చిక్కుకున్నారు.

రాజుకు ఆశ్రయం లభించింది. అనంతరం దిల్లీకి పయనమయ్యారు. కొద్ది రోజుల తర్వాత నేపాలీ కాంగ్రెస్ ప్రణాళిక రచించిన నేషనల్ లిబరేషన్ ఉద్యమం ప్రారంభమైంది. 1951 ఫిబ్రవరి 18న త్రిభువన్ రాజు జంగ్ బహదూర్ రాణాతో 1846 ఒప్పందాన్ని రద్దు చేసి, ఒక రాజ్యాంగ అసెంబ్లీ ద్వారా గణతంత్ర రాజ్యాంగాన్ని రూపొందిస్తానని ప్రకటించారు. ఇది రాణాల పాలన ముగింపునకు నాంది పలికింది.

పెళ్లి బంధం

రాణాల పాలనాకాలంలో వీరికీ భారత్​లోని స్వతంత్ర రాజ్యాలకు మధ్య పెళ్లి సంబంధాలు ఉండేవి. కశ్మీర్, బరోడా, జైసల్మేర్, గ్వాలియర్, కథియావాడ్​ రాజ్యాలలోని యువరాజులతో తమ కుమార్తెల వివాహం జరిపించేవారు. ఈ ధోరణి 1947లో భారత్ స్వాతంత్ర్యం సాధించేవరకు కొనసాగింది. రాణా చివరి ప్రధానమంత్రి అయిన మోహన్ షంషీర్ ఎస్​జేబీ రాణా వరకు ఈ ఒరవడి నడిచింది.

మోహన్ షంషీర్ కశ్మీర్​, జైసల్మేర్, జామ్​నగర్​ పాలకులతో తన మునిమనవరాళ్ల పెళ్లిళ్లు చేయించారు. అయితే రాణా పాలకుల్లోని మగవారిలో అతికొద్ది మందికి మాత్రమే భారత్​లోని రాజకుటుంబాలతో వివాహాలు జరిగాయి. వీరు హిమాచల్​ప్రదేశ్​లోని కొండప్రాంతాల్లో మాత్రమే సంబంధాలు చూసుకున్నట్లు తెలుస్తోంది.

పదవి కోల్పోయిన షా కుటుంబాన్ని చిన్న రాచరిక కుటుంబాలతో వివాహం చేసుకోవాలని అధికారంలో ఉన్న రాణాలు ప్రోత్సహించారు. త్రిభువన్ షా రెండో కుమార్తె ఇందుకు ఉదహరణ. అతని మొదటి కుమార్తె కశ్మీర్​లోని పూంచ్​ రాజుని వివాహమాడగా.. రెండో కుమార్తె ఒడిశాలోని మయూర్​భంజ్ పాలకుడిని పెళ్లాడాల్సి వచ్చింది.

దేవయానీ గాథ!

భారత్, నేపాల్ రాజవంశాల మధ్య వివాహ బంధాలు దేవయానీ రాణా ప్రస్తావన లేకుండా ముగుస్తాయా? పశుపతి షంషీర్ జంగ్ బహదూర్ రాణా, రాణి ఉషా రాజే సింధియాల రెండో కుమార్తె దేవయానీ రాణా. గ్వాలియర్ చివరి మహరాజు జివాజీరావ్​ సింధియా కుతురే రాణి ఉషా రాజే సింధియా.

దేవయానీతో నేపాల్ యువరాజు దీపేంద్ర ప్రేమలో పడ్డాడని, ఆమెనే పెళ్లిచేసుకుంటారని కొత్త సహస్రాబ్ది ప్రారంభంలో వదంతులు వేగంగా ప్రచారమయ్యాయి. యునైటెడ్ కింగ్​డమ్​లో చదువుకునే రోజుల్లో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. అయితే దీపేంద్ర తల్లితండ్రులు, దేవయానీ తల్లి ఈ సంబంధానికి అసలు ఒప్పుకోలేదు. వీరి ప్రేమను వ్యతిరేకించిన దీపేంద్ర తల్లి, రాణి ఐశ్వర్య రాజ్య లక్ష్మీదేవీ షా... తన రెండో కుమారుడ్ని సింహాసనానికి వారసుడిగా ప్రకటిస్తానని హెచ్చరించింది. పెళ్లికి రాజు, రాణి అంగీకారం లేకపోతే ఘోరమైన పరిణామాలు తలెత్తుతాయని అప్పట్లో నమ్మేవారు. పరిస్థితులు చేయిదాటిపోయాయి. చివరకు 2007లో సింగ్రౌలీ రాజవంశానికి చెందిన కున్వర్ ఐశ్వర్య సింగ్​ను దేవయానీ వివాహమాడారు. కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ మంత్రి అర్జున్ సింగ్ మనవడే ఈ కున్వర్ ఐశ్వర్య సింగ్.

నేపాల్​-భారత్​ మధ్య బహు-బేటీ సంబంధాలు చారిత్రకంగా చాలా లోతుగా ఉన్నాయి. ఈ విధంగా నేపాల్ రాజవంశీయులు, భారత పాలకులకు మధ్య తరతరాల బంధం ఏర్పడింది.

(రచయిత-గణేష్ సెయిలీ)

ABOUT THE AUTHOR

...view details