సుమారు రెండేళ్ల క్రితం బిహార్‌లోని ముజఫర్పుర్ పేరు దేశమంతటా మార్మోగిపోయింది. అప్పట్లో అక్కడి సంరక్షణ కేంద్రంలోని 34మంది బాలికలపై నెలల తరబడి అమానుష లైంగిక దాడులు జరిగాయన్న కథనాలు దిగ్భ్రాంతపరచాయి. బిహార్‌లోని మరో 15 సంరక్షణ కేంద్రాల్లో అంతకన్నా హృదయ విదారక స్థితిగతులు నెలకొన్నాయన్న టిస్ (టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్) వాంగ్మూలం, ఉత్తర్ ప్రదేశ్‌లోని దేవ్‌రియా శరణాలయంలో వెలుగు చూసిన వ్యభిచార రాకెట్ తీవ్ర ప్రకంపనలు పుట్టించాయి. ఆదుకోవాల్సిన చేతులే అణిచేస్తుంటే సంరక్షణ కేంద్రాల్లో అభాగినులకు భద్రత ఎక్కడుందన్న సర్వోన్నత న్యాయస్థానం సూటిప్రశ్న వ్యవస్థాగత అలసత్వాన్ని నిగ్గదీసింది. ఆ నేపథ్యంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (ఎన్‌సీపీసీఆర్) క్రోడీకరించిన నివేదిక ప్రకారం- రాష్ట్రాలవారీగా శరణాలయాల పరిస్థితి ఏమాత్రం సజావుగా లేదు!
స్వచ్ఛంద సంస్థల్లోనూ..
ఆశ్రయం కోరి వచ్చిన వారిపై భౌతిక, లైంగిక దాడుల్ని నియంత్రించడానికి సరైన ఏర్పాట్లు లేని సంరక్షణ కేంద్రాల సంఖ్య త్రిపుర(86.8శాతం)లో అత్యధికమని ఎన్‌సీపీసీఆర్ నిగ్గుతేల్చింది. కర్ణాటక(74.2), ఒడిశా(68), కేరళ(63.4), అసోం(60.9) తరవాతి నాలుగు స్థానాల్లో నిలిచాయి. విదేశీ విరాళాలతో నడిచే స్వచ్ఛంద సంస్థల్లో అనాథల సంరక్షణ మెరుగ్గా సాగుతుందన్న ఆశా వట్టి అడియాసేనని గణాంక విశ్లేషణ చాటుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని 145 షెల్టర్ హోమ్స్‌లోని దాదాపు 6,200మంది పిల్లలకోసం ఏడాది వ్యవధిలో రూ.400కోట్లకుపైగా విదేశీ విరాళాలు సమకూరాయి. అంటే సగటున తలసరి రూ.6.6.లక్షలు. తెలంగాణ (రూ.3.88లక్షలు), కేరళ కర్ణాటక తమిళనాడులలో (రెండు లక్షల రూపాయలకు పైబడి) వెలుపలినుంచి సాయం అందుతున్నా- తగినంత మంది సిబ్బంది నియామకాలు, మౌలిక వసతుల పరికల్పన దాఖలాలు లేకపోవడం- నిధులు దారి మళ్లుతున్నాయనడానికి ప్రబల సంకేతం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు లేనప్పుడే ముజఫర్పుర్ తరహా బాగోతాలు చోటుచేసుకుంటాయని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ లోగడ అంగీకరించారు. నేడు దేశంలో అటువంటి ముజఫర్పుర్లు మరెన్నో!
సుప్రీంకోర్టు చెప్పినా..