పర్యావరణాన్ని సంరక్షిస్తే, అది మానవాళి ప్రయోజనాలను కాపాడుతుంది. యథేచ్ఛగా విధ్వంసకర దుశ్చర్యలకు తెగబడితే, అనూహ్య స్థాయిలో విపత్కర పరిస్థితులే దాపురిస్తాయి. ఇది, కొన్నేళ్లుగా పదేపదే నిరూపితమవుతున్న సార్వత్రిక సత్యం. ప్రకృతి పట్ల మనిషిలో మేటవేసిన అలసత్వం నిర్లక్ష్యం, అడ్డూఆపూ లేని పారిశ్రామికీకరణల దారుణ పర్యవసానమే విపత్తుల పరంపర. దేశీయంగా వాటి దుష్ప్రభావ తీవ్రతకు తాజా అధ్యయనమొకటి అద్దం పడుతోంది. భయానక ఉత్పాతాల కారణంగా నిలువనీడ కోల్పోయి వేరేచోటుకు తరలుతున్నవారిపై సీఎస్‌ఈ (వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం) నివేదిక దిగ్భ్రాంతకర వాస్తవాలను గుదిగుచ్చింది. నిరుడు వరదలు, తుపానులు, కరవుకాటకాల మూలాన విశ్వవ్యాప్తంగా నమోదైన ప్రతి అయిదు నిర్వాసిత ఘటనల్లో ఒకటి భారత్‌లో చోటుచేసుకున్నదే. ఇండియాలోనే అటువంటి 50 లక్షల ఉదంతాలు వెలుగుచూశాయి.
గత సంవత్సరం 19 ప్రకృతి విపత్తులు 1,357 నిండుప్రాణాల్ని కబళించాయి. మొన్నటి నిసర్గ తుపాను మహారాష్ట్ర, గుజరాత్‌లను అమితంగా భయపెట్టి కడకు పరిమిత నష్టంతో ఉపశమించినా- ఇటీవలి అంపన్ సైక్లోన్ పశ్చిమ్‌బంగ, ఒడిశాలలో లక్షలాది జీవితాలను కడగండ్లపాలు చేసింది. 1990-2016 సంవత్సరాలమధ్య 235 చదరపు కిలోమీటర్ల మేర తీరప్రాంతం కోతకు గురైన ఇండియాలో నేటికీ ప్రతి ఉత్పాతమూ తనదైన విషాదముద్ర వేస్తూనే ఉంది. పర్యావరణ విధ్వంసం, భూతాపాలే ఇందుకు మూలకారణాలంటున్న సీఎస్‌ఈ అధ్యయనం- దేశంలో అటవీ ఛాయ హరించుకుపోతుండటాన్నీ ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా సుమారు 280 జిల్లాల్లో అడవుల విస్తీర్ణంలో క్షీణత, అయిదు నదీ పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర నీటిఎద్దడి- ప్రకృతి సమతూకం ఛిద్రమవుతోందనడానికి ప్రబల దృష్టాంతాలు. అంతకుమించి, తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను ఎలుగెత్తుతున్న ప్రమాద సంకేతాలు.