తెలంగాణ

telangana

ETV Bharat / opinion

క్షీణిస్తున్న నీటిలభ్యత- ప్రమాదకర పరిస్థితుల్లో గంగ, యమున - దేశంలో నదుల పరిస్థితి

దేశంలో నదీజలాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఉపఖండంలోని సింధు, గంగ, యమున వంటి నదులు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తగిన జలవనరులు అందుబాటులో లేకుంటే భవిష్యత్తులో నీటి యుద్ధాలు తప్పవని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

rivers
నదులు

By

Published : Sep 28, 2021, 6:31 AM IST

నదులు మానవ నాగరికతకు మూలాధారాలు. పచ్చని పంటలకు, భూమి మీద జీవించే కోట్ల జీవరాశులకు ప్రాణధారలు. 'నదులంటే కేవలం భౌతిక అంశాలు కాదు, అవి జీవ వాహికలు, మన సంస్కృతిలో వాటికి విశిష్ట స్థానం ఉంది' అని తాజాగా మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశ ప్రజలు ఏడాదిలో ఒకరోజు నదుల పండగ జరుపుకోవాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు. ప్రస్తుతం దేశంలో మానవ, పారిశ్రామిక వ్యర్థాలతో నదీజలాలు కలుషితమవుతున్నాయి. నదీగర్భాల ఆక్రమణ, అక్రమ ఇసుక తవ్వకాలతో నదులు తమ స్వరూపాలను కోల్పోతున్నాయి. భూతాపం, కరవు పరిస్థితులు, పట్టణీకరణ, అడ్డూ అదుపులేని ఆనకట్టల నిర్మాణాలు సైతం నదుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఉపఖండంలోని సింధు, గంగ, యమున వంటి నదులు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని పలు అధ్యయనాలు చాటుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తగిన జలవనరులు అందుబాటులో లేకుంటే భవిష్యత్తులో నీటి యుద్ధాలు తప్పవని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సింధు నదిపై 1930వ దశకంలో సుక్కూర్‌ ఆనకట్టను (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది) నిర్మించారు. 1991తో పోలిస్తే దీనికి వచ్చే నీరు ప్రస్తుతం 35శాతానికి పైగా తగ్గిపోయిందని పాకిస్థాన్‌కు చెందిన సింధూ నదీవ్యవస్థ ప్రాధికార సంస్థ (ఇర్సా) పేర్కొంది. కొన్ని అధ్యయనాల ప్రకారం గంగ, దాని ఉపనదుల్లో వేసవిలో ప్రవాహాలు గతంలో కన్నా 30శాతానికి పైగా పడిపోయాయి. 1970తో పోలిస్తే కాన్పూర్‌ వద్ద గంగానది నీటి లభ్యత 50శాతానికి పైగా తగ్గిపోయింది. రాబోయే మూడు దశాబ్దాల్లో నీటి లభ్యత మరో 25శాతం క్షీణించే ప్రమాదముంది. 2050కల్లా యమునా నదీ పరీవాహక ప్రాంతంలోని 40 జిల్లాల్లో 30, గండక్‌ పరీవాహక ప్రాంతంలోని 33 జిల్లాల్లో 18- తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటాయని భూభౌతిక, జలవనరుల అధ్యయనవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆక్రమణలు సైతం నదీ ప్రవాహాలను మింగేస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు ప్రవాహాలతో అవి కునారిల్లుతున్నాయి.

బెంగళూరు నడిబొడ్డున ప్రవహించే వృషభవతి, పుణే నగరానికి జీవధారలైన ములా, ముఠా నదులు, ఒకప్పుడు చెన్నై మహానగర దాహార్తిని తీర్చిన కూవం నది, భాగ్యనగరానికి భాగ్యదాత అయిన మూసీనది కాలుష్య కాసారాలుగా మారాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసికి ఆ పేరు రావడానికి కారణమైన వరుణ, అసి నదులను సైతం ఇదే దుస్థితి పట్టిపీడిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గోస్తనీ నది నేడు పిల్లకాలువగా మారి దాదాపుగా కనుమరుగవుతోంది. తెలుగు రాష్ట్రాలకు జీవనాడులైన కృష్ణా, గోదావరి నదులు కొన్నేళ్లుగా పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమవుతున్నాయి. నదుల జన్మస్థానాలను సైతం వదలకుండా పర్వత శిఖరాల మధ్యన జలవిద్యుత్తు ప్రాజెక్టుల పేరుతో మనిషి చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు.

'ప్రపంచంలో పెద్ద సంఖ్యలో ఆనకట్టలను నిర్మిస్తున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. భవిష్యత్తులో నదీ ప్రవాహశీలత, నీటిలభ్యత తదితరాలను అంచనా వేయకుండా ఇష్టారీతిగా ఒక రాష్ట్రానికి పోటీగా మరో రాష్ట్రం ఆనకట్టలు నిర్మించుకుంటూ పోతున్నాయి. భారత్‌లో పెద్ద సంఖ్యలో ఆనకట్టలు ఉన్న మహారాష్ట్రలో సైతం నీటి కొరత తీవ్రంగానే వేధిస్తోంది. నదుల మౌలిక గుణం ప్రవహించడం. అవి స్వేచ్ఛగా ప్రవహించడానికి అమెరికా వంటి దేశాలు ప్రత్యేక విధానాలను అవలంబిస్తున్నాయి. భారత్‌లో సైతం అటువంటివి అమలు కావాలి' అని ఆనకట్టలు, నదులు, ప్రజలకు సంబంధించి దక్షిణాసియా నెట్‌వర్క్‌ అనే స్వచ్ఛంద సంస్థకు సహ సమన్వయకర్త అయిన పరిణీతా దండేకర్‌ పేర్కొన్నారు.

నదీమతల్లులంటూ మొక్కుతూనే వాటిని మురికి కూపాలుగా మారుస్తుండటం మన దేశంలో పెద్ద సమస్య. నదులు, ప్రవహించే నీటివనరులు సమస్త జీవుల ఉమ్మడి ఆస్తిగా పరిగణిస్తూ వినియోగించుకోవడం ఉత్తమం. నదులు, జలాశయాల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలదేనని గతేడాది కేరళ హైకోర్టు పేర్కొంది. సాధారణంగా నదీగర్భంలో ఇసుక పరిమాణం మూడు నుంచి ఆరు మీటర్లు ఉంటే- ఒక మీటరు వరకు, ఎనిమిది మీటర్ల కన్నా ఎక్కువ ఉంటే రెండు మీటర్ల వరకు తవ్వుకోవచ్చనే నిబంధనలు ఉన్నాయి. ప్రవాహానికి అడ్డంకులు సృష్టించకూడదని, తవ్వకాల్లో యంత్రాలు వాడకూడదని నియమాలు చెబుతున్నాయి. ఆచరణలో అవి కొల్లబోతున్నాయి. కొందరు తమ స్వార్థం కోసం ఇసుకను అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. వీరికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవు. నదుల పరిరక్షణకు ప్రభుత్వాలు చట్టాలను పదును తేల్చి పటిష్ఠంగా అమలు చేయాలి. అప్పుడే భారత భాగ్య సంపదలుగా నదులు విరాజిల్లే రోజుల్ని చూడగలం!

- గొడవర్తి శ్రీనివాసు

ఇదీ చదవండి:

పట్టణీకరణతో ధరణీతలానికి పెనుముప్పు!

ABOUT THE AUTHOR

...view details