తెలంగాణ

telangana

ETV Bharat / opinion

లాక్​డౌన్​ భయాలు- వలస శ్రామికుల అష్టకష్టాలు

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోన్న క్రమంలో పలు రాష్ట్రాల్లో మళ్లీ లాక్​డౌన్​ విధిస్తారనే భయాలు వెంటాడుతున్నాయి. గతేడాది విధించిన లాక్​డౌన్​లో ప్రజలు ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. నిరుపేదలకు అలాంటి చేదు అనుభవాలు మరోసారి ఎదురుకాకుండా సంక్షేమ పథకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇవ్వగలగాలి.

MAIN FEATURE ON WELFARE SCHEMS FOR MIGRANT WORKERS DURING LOCKDOWN
లాక్​డౌన్​లో.. వలస శ్రామికులకు భరోసా

By

Published : Apr 14, 2021, 7:31 AM IST

కొవిడ్‌ మహమ్మారి రెండోసారి విజృంభిస్తూ.. దేశాన్ని శరవేగంగా చుట్టుముడుతోంది. దాని తీవ్రతకు పలు రాష్ట్రాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే భయాలు పెరుగుతున్నాయి. నిరుడు లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. నిరుపేదలకు అలాంటి చేదు అనుభవాలు మరోసారి ఎదురుకాకుండా సంక్షేమ పథకాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇవ్వగలగాలి. వలస కార్మికులకు సంబంధించిన ఆధార్‌, రేషన్‌ వంటి పత్రాలన్నీ వారి సొంత ఊరి చిరునామాలతో ఉంటాయి. వారు మాత్రం మరెక్కడో ఉపాధి పనుల్లో నిమగ్నమై ఉంటారు. లాక్‌డౌన్‌ వంటి సమయాల్లో వారికిది అతిపెద్ద సమస్యగా మారుతుంది. ప్రభుత్వ పథకాలు పొందడంలో వారికి గతంలో ఇదే విషయమై సమస్యలు తలెత్తి, అష్టకష్టాలు పడ్డారు.

తాజాగా కొవిడ్‌ కేసులు దేశంలో రోజుకు లక్షా 60వేలకుపైగా నమోదవుతుండటంతో- మహమ్మారి రెండోదశ విజృంభణ మొదటి దశకంటే తీవ్రంగా, ఎక్కువ కాలం ఉండవచ్చనే భయాందోళనలు రేకెత్తుతున్నాయి. చాలా రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తారనే భయం మొదలు కావడంతో పరిశ్రమల్లో పని చేసే వలస కార్మికుల్లో కొంతమంది తమ పారిశ్రామిక కేంద్రాలు లేదా తాము నివాసం ఉంటున్న నగరాల నుంచి సొంతూళ్లకు పయనమవుతున్నారు. నిరుడు లాక్‌డౌన్‌వల్ల సరఫరా గొలుసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆర్థిక వృద్ధిలో మందగమనం నెలకొంది. నిరుద్యోగిత పెరిగింది. ముఖ్యంగా వలస కార్మికులపై పడిన దెబ్బ వారి జీవనాన్ని అతలాకుతలం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుటి లాక్‌డౌన్‌ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

ఉపాధి కల్పన కీలకం

ముందస్తు సర్వే, గణాంక, పరిశోధక సంస్థ (ఐఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌)తో కలిసి అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలపై పరిశోధనలు చేస్తున్న జాతీయ మండలి (ఐసీఆర్‌ఐఈఆర్‌) నిర్వహించిన ఒక అధ్యయనంలో లాక్‌డౌన్‌ సమయంలో సొంతూళ్లకు చేరుకున్న వలస కార్మికుల్లో 38.6శాతం తమకు మళ్లీ పని దొరకలేదని చెప్పినట్లు తెలిపింది. ఆ అధ్యయనం ఆరు (బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ) రాష్ట్రాల్లో, 2917 మంది వలస కార్మికులపై నిర్వహించారు. లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్‌ సమయంలో, ఆ తరవాతా వలస కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు తెలుసుకునేందుకు- ఈ అధ్యయనాన్ని మూడు దశల్లో చేశారు. మొదటి దశ 2020 జూన్‌-ఆగస్టుల మధ్య, రెండో దశ 2020 నవంబర్‌-డిసెంబర్‌లలో, మూడోదశ 2021 ఫిబ్రవరి చివరివారంలో జరిగింది. హఠాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో సంపాదన లేక తమ జీవితాలు కకావికలమైనట్లు వారు పేర్కొన్నారు. వారి కుటుంబ ఆదాయాలు 85శాతం మేర పడిపోయాయి.

ఆరు రాష్ట్రాల్లో సగటున 63.5శాతం వలస కార్మికులు 2021 ఫిబ్రవరి నాటికి సొంతూళ్ల నుంచి తిరిగి తమ పని ప్రదేశాలకు చేరుకున్నారు. 36.5శాతం మాత్రం ఇప్పటికీ తమ ఊళ్లలోనే ఉండిపోయారు. రాష్ట్రాల వారీగా చూస్తే బిహార్‌లో అత్యధికంగా 92.5శాతం; ఉత్తర్‌ ప్రదేశ్‌, ఒడిశాలలో 65శాతం చొప్పున పని ప్రదేశాలకు తిరిగి చేరారు. పశ్చిమ్‌ బంగలో 40.3శాతం, ఝార్ఖండ్‌లో 31.2శాతం చొప్పున కార్మికులు తిరిగి పని ప్రదేశాలకు చేరకుండా సొంతూళ్లకే పరిమితమయ్యారు. మళ్లీ పని ప్రదేశాలకు చేరినవారి కుటుంబాదాయాలు పుంజుకున్నా, లాక్‌డౌన్‌కు ముందున్న ఆదాయాలతో పోలిస్తే- ఇంకా 7.7శాతం తక్కువగానే ఉండటం గమనార్హం. లాక్‌డౌన్‌ భయంతో కొందరు స్వస్థలాలకు పయనం కావడంవల్ల మళ్లీ ఆదాయాల్లో 80శాతం మేర కోత పడే ప్రమాదం ఉంది. సంక్షేమ పథకాలకు సంబంధించి వలస కార్మికుల్లో 74శాతానికి ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ బియ్యం లేదా గోధుమలు పొందే అర్హత ఉన్నా- కేవలం 12శాతానికే అవి అందాయి.

పని ప్రదేశాలను వదలి ఊళ్లకు చేరుకున్న కార్మికుల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా ఇతర పథకాల కింద పని దొరికినవారు కేవలం 7.7శాతమే. నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ యోజన కార్యక్రమాలు చాలామంది కార్మికులకు అందలేదు. ఉదాహరణకు సొంత ఊళ్లకు చేరిన కార్మికుల్లో 1.4శాతం మాత్రమే ఈ శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. ఈ పథకాలు వలస కార్మికులకు ఉపయోగపడేలా చేయడంలో యంత్రాంగం నిర్లక్ష్యం వహించైనా ఉండాలి- లేదా కార్మికులు వాటికింద పని చేయడానికి విముఖత చూపైనా ఉండాలని అధ్యయనం వెల్లడించింది.

కేరళ విధానాలు అనుసరణీయం

ఈ సందర్భంగా కేరళలో వలస కార్మికులకోసం చేపట్టిన కార్యక్రమాలు ప్రస్తావనార్హం. కేరళ ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న 32లక్షలమంది వలస కార్మికులకు ఆహార పదార్థాలను సరఫరా చేస్తోంది. వారి ఇతర అవసరాలను తీర్చేందుకు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కొంతకాలంపాటు అక్కడే నివసిస్తూ పనులు చేసే ఈ అతిథి కార్మికులు ఎక్కువగా నిర్మాణం, ఆతిథ్యం, వ్యవసాయం, టెక్స్‌టైల్స్‌, సముద్ర ఆహారం, పాదరక్షల రంగాల్లో ఉన్నారు. ఈ అతిథి కార్మికులకోసం 2010లో కేరళ- దేశంలోనే తొలిసారిగా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, ప్రభుత్వాసుపత్రుల్లో కుటుంబ సభ్యులకు ఉచిత చికిత్స వంటివి అందజేస్తున్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అతిథి కార్మికులకోసం ఈ తరహా కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలి. కొరత రాకుండా చూడాలి. కొవిడ్‌ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలోనూ మన రాజకీయ నేతలు, మత గురువులు కరోనా నిబంధనలను ఉల్లంఘించి- భారీయెత్తున ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తుంటే ఇక సామాన్య జనానికి క్రమశిక్షణ నేర్పేదెవరు? వైరస్‌ వ్యాప్తికి కారణమవుతున్న నేతలకు లాక్‌డౌన్‌లు విధించే నైతిక హక్కు ఉంటుందా? నాయకులు ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించకపోతే కొవిడ్‌ కేసుల్లో బ్రెజిల్‌, అమెరికాలనూ అధిగమించి- భారత్‌ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది!

ముఖ్యమైన మూడు జాగ్రత్తలు

మరోసారి సంక్షోభం తీవ్రరూపం దాలిస్తే కార్యాచరణ ప్రణాళిక అమలుకు వీలుగా- కార్మికుల సమాచారాన్ని తొలుత డిజిటల్‌ రూపంలో పొందుపరచడం చాలా కీలకమైన అంశం. దాన్ని అయిదేళ్లకోసారి సవరించడమూ అంతే ముఖ్యం. రెండోది- పౌరులకు ముఖ్యంగా పేదవారికి భరోసా కల్పించేందుకు 'ఒకే దేశం, ఒకే రేషన్‌ కార్డు' వంటి పథకాలను విస్తృతంగా అమలు చేయాలి. లబ్ధిదారులకు సరకుల రూపంలోనైనా, నగదు రూపంలోనైనా ప్రయోజనం కల్పించవచ్చు.

దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వలస కార్మికులకు వైద్య చికిత్స, బీమా సదుపాయాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలి. మహమ్మారులు విజృంభించినప్పుడు దేశవ్యాప్తంగా ఒకే తరహా సామాజిక భద్రత కార్యక్రమాల అమలుకు తగిన కార్యక్షేత్రాన్ని సిద్ధం చేయాలి. నైపుణ్యం ఉన్న, లేని వలస కార్మికులందరికీ ప్రయోజనం కల్పించే దిశగా ఉపాధి హామీ పథకంలో పని దినాలను పెంచడం మూడో పరిష్కారం.

- పరిటాల పురుషోత్తం

రచయిత- సామాజిక, ఆర్థిక విశ్లేషకులు

ఇదీ చదవండి :'స్పుత్నిక్‌-వి' టీకా విదేశాల్లో రూ. 750- మరి భారత్​లో?

కరోనాతో కఠిన ఆంక్షల దిశగా పలు రాష్ట్రాలు

ABOUT THE AUTHOR

...view details