తెలంగాణ

telangana

ETV Bharat / opinion

దేశంలో నేరస్వామ్య దుర్రాజకీయం! - నేర కేసులపై ఈనాడు కథనం

నేరచరితులైన నేతలపై గల కేసుల సత్వర విచారణకు 2018 మార్చినాటికల్లా 12 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్ని సిద్ధం చేసినా- ఏడాదిలోగా తుది తీర్పులు వెలువడాలన్న లక్ష్యానికి రాజకీయ గ్రహణం పట్టింది. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న నేతల సంఖ్య పెరిగిపోవడం, విచారణలో ఉన్న కేసులను బలసంపన్నులైన ప్రజాప్రతినిధులు ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వాటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న న్యాయపాలిక వ్యాఖ్య పూర్తిగా అర్థవంతం. నిలుపుదల (స్టే) ఉన్న కేసులనూ రోజువారీ విచారణ జరిపి రెండు నెలల్లో తేల్చేయాలన్న ఉత్తర్వులు- అవినీతి, నేరమయ రాజకీయాలనుంచి ప్రజాస్వామ్య పవిత్రతను కాపాడాలన్న ‘సుప్రీం’ చిత్తశుద్ధికి తార్కాణం!

'Leaders' Of Our Country Who Have Heinous Cases
దేశంలో నేరస్వామ్య దుర్రాజకీయం!

By

Published : Sep 19, 2020, 8:26 AM IST

నేరగ్రస్త రాజకీయాల విష పరిష్వంగం నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న తపన న్యాయపాలిక ఆదేశాల్లో ఎప్పటికప్పుడు ప్రస్ఫుటమవుతున్నా- రెండు దశాబ్దాలకుపైగా ఆ చొరవ ఒంటిచేతి చప్పట్లనే తలపిస్తోంది. నేరచరితులైన నేతలపై గల కేసుల సత్వర విచారణకు 2018 మార్చినాటికల్లా 12 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్ని సిద్ధం చేసినా- ఏడాదిలోగా తుది తీర్పులు వెలువడాలన్న లక్ష్యానికి రాజకీయ గ్రహణం పట్టింది. ఆ దురవస్థను మరేమాత్రం ఉపేక్షించరాదన్న సంకల్పంతో- నేతాగణాలపై పెండింగులో ఉన్న క్రిమినల్‌ కేసుల విచారణను వేగవంతం చేసేలా వారం రోజుల్లో కార్యాచరణ రూపొందించి పంపాలని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని సుప్రీం ధర్మాసనం తాజాగా ఆదేశించింది. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న నేతల సంఖ్య పెరిగిపోవడం, విచారణలో ఉన్న కేసులను బలసంపన్నులైన ప్రజాప్రతినిధులు ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వాటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న న్యాయపాలిక వ్యాఖ్య పూర్తిగా అర్థవంతం. నిలుపుదల (స్టే) ఉన్న కేసులనూ రోజువారీ విచారణ జరిపి రెండు నెలల్లో తేల్చేయాలన్న ఉత్తర్వులు- అవినీతి, నేరమయ రాజకీయాలనుంచి ప్రజాస్వామ్య పవిత్రతను కాపాడాలన్న ‘సుప్రీం’ చిత్తశుద్ధికి తార్కాణం! 2014నాటికి 1581మంది ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ నేరాభియోగాలున్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం నిగ్గుతేల్చింది. అదే నేడు మాజీ, తాజా ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం 4442 మందిపై క్రిమినల్‌ కేసులుండగా, వారిలో 2556 మంది ప్రస్తుత ప్రతినిధులే కావడం- నేర రాజకీయం ఎంతగా కోరసాచిందో కళ్లకు కడుతోంది. కంచే చేను మేస్తున్న దౌర్భాగ్యం భారత భారతిని కురుపులా సలుపుతోంది!

పార్లమెంటే మూగసాక్షి...

గత పదేళ్లలో దోషిగా తేలిన, నేరాభియోగాలు ఎదుర్కొన్న, ఏ క్రిమినల్‌ కేసులోనైనా ఇరుక్కున్న వ్యక్తులకు, సంఘ వ్యతిరేక శక్తులకు ఎలాంటి ఎన్నికల్లోనూ టికెట్లు ఇవ్వబోమని స్వాతంత్య్ర స్వర్ణోత్సవ (1997)వేళ పార్టీలన్నీ ముక్తకంఠంతో చేసిన తీర్మానానికి పార్లమెంటే మూగసాక్షి. జైలుపక్షులు ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ ‘సుప్రీం’ ఇచ్చిన తీర్పును వమ్ముచెయ్యడానికి పార్టీలన్నీ ఒక్కతాటి మీదకొచ్చిన వైపరీత్యానికీ అత్యున్నత శాసన నిర్మాణ వేదికే మౌనసాక్షిగా మిగిలింది. నేరచరితులైన శాసనకర్తల్ని అనర్హుల్ని చేసినంత మాత్రానే నేర రాజకీయాల దూకుడును అరికట్టలేమని, దానికి తోడు రాజకీయ పక్షాల ప్రక్షాళనా మొదలుకావాలని మొన్న ఫిబ్రవరినాటి ఆదేశాల్లో సుప్రీంకోర్టే ప్రస్తావించింది. నేరచరితుల్నే అభ్యర్ధులుగా ఎందుకు నిలబెట్టాల్సి వచ్చిందో పార్టీలు స్పష్టం చేయాల్సిందేనంటూ ఆరు ఆదేశాలు వెలువరించింది.

నేరగాళ్లను చేరదీస్తున్న పార్టీలు

నేర చరితులకే విజయావకాశాలు మెండు అని, అక్రమార్జనపరులు సులభంగా నెగ్గుకొస్తున్నారనీ లోగడ ‘సుప్రీం’ వ్యక్తీకరించిన ఆవేదన- పార్టీల దివాలాకోరు రాజకీయాల పట్ల తీవ్రాభిశంసన! నేరగాళ్లను పార్టీలు చేరదీయకుంటే చాలావరకు సంక్షోభం సమసిపోగల వీలున్నా- అవినీతి సమ్రాట్టులే సొంతగా పార్టీలు పెట్టే స్థాయిలో రాజకీయ చెదరంగం చిలవలు పలవలు వేసుకుపోయింది. చిన్నప్పుడెప్పుడో చేసిన తప్పులు రచ్చకెక్కి అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వాలకు ఎందరో నీళ్లొదులుకొంటున్న వైనం అమెరికాలో పరిణత ప్రజాస్వామ్యాన్ని ప్రస్ఫుటీకరిస్తోంది. అమెరికా సైనిక స్థావరాన్ని మూసివేస్తానన్న ఎన్నికల హామీ నిలబెట్టుకోనందుకు జపాన్‌ ప్రధాని పదవీ పీఠాన్ని హతొయమా వదులుకోవాల్సి వచ్చింది. ప్రజల పట్ల, ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల నేతల జవాబుదారీతనానికి నిదర్శనాలవి. అవినీతికి పాల్పడి జైలులో ఉన్న లాలూ పార్టీ టికెట్లూ కూటములపై చక్రం తిప్పుతున్న తీరు- నేరస్వామ్య రాజకీయమెంతగా ఊడలు దిగిందో చాటుతోంది. అన్ని రకాల అవినీతికి తల్లివేరు రాజకీయ అవినీతి. సమస్త పాలన వ్యవస్థల్నీ అవినీతికూపంలా మార్చేసిన ఆ దురవస్థకు జాగృత జనచేతనే విరుగుడు కాగలిగేది!

ABOUT THE AUTHOR

...view details