'ప్రజలు మనల్ని చేరుకోలేకపోతే మనమే వారికి చేరువ కావాలి' అంటూ ఉచిత న్యాయసేవల కోసం సరిగ్గా నెల రోజుల క్రితం ఎలుగెత్తిన తెలుగు బిడ్డ జస్టిస్ ఎన్‌వి రమణ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ తరుణమిది. అయిదున్నర దశాబ్దాల క్రితం జస్టిస్ కోకా సుబ్బారావు అలంకరించిన ఆ సమున్నత న్యాయపీఠాన్ని ఇంతకాలానికి తన మరో తనయుడు అధిష్ఠించడం చూసి తెలుగుతల్లి పులకిస్తోంది. నూతన సాధనాలను అందిపుచ్చుకొని సరికొత్త విధానాలు, నవకల్పనలు, నూతన వ్యూహాలు అనుసరిస్తూ రాజ్యాంగ పరిధిలో న్యాయబద్ధమైన నిర్ణయాలు, తగిన ఉపశమనాలు కల్పించే సరికొత్త న్యాయవ్యవస్థకు రూపకల్పన చేయాలని 2019 నాటి రాజ్యాంగ దినోత్సవ వేదికపై జస్టిస్ రమణ అభిలషించారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా తదనుగుణ కార్యాచరణకు వచ్చే 16 నెలల పదవీకాలంలో జస్టిస్ రమణ చిత్తశుద్ధితో కృషి చేయగలరన్న నమ్మకం అన్ని వైపుల నుంచీ వ్యక్తమవుతోందిప్పుడు! న్యాయపాలిక విశ్వసనీయతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రధాన న్యాయమూర్తిగా అయిదేళ్ల క్రితం టీఎస్ ఠాకుర్ బహిరంగంగా వాపోయిన దరిమిలా, పరిస్థితి అంతకంతకూ దిగజారడమే గాని మెరుగుపడింది లేదు.
'మాస్టర్ ఆఫ్ ది రోస్టర్'గా..
చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే హయాములో- సుప్రీంకోర్టులో అయిదు ఖాళీలు ఏర్పడ్డా ఏ ఒక్క నియామకమూ కాలేదు. ఈ ఏడాది మరో అయిదు ఖాళీలు వాటికి జత కలుస్తాయంటున్న నేపథ్యంలో కొలీజియాన్ని ఒక్క తాటి మీద నడపడం ద్వారా- కేసులతో పాటు న్యాయ నియామకాల పెండింగ్ సమస్యనూ జస్టిస్ రమణ పరిష్కరించాల్సి ఉంది. దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల సంఖ్య 4.4 కోట్లకు చేరిన తరుణంలో దశాబ్దాలుగా మరుగున పడిన 224 ఎ అధికరణ దుమ్ముదులిపి తాత్కాలిక న్యాయమూర్తుల నియామకాలకు సుప్రీం ధర్మాసనం పచ్చజెండా ఊపడంతో- దాన్ని సక్రమంగా పట్టాలెక్కించే బాధ్యతా కొత్త చీఫ్ జస్టిస్ భుజస్కంధాలపైనే పడింది. ఇలా ఇంటిని చక్కదిద్దుకుంటూ 'మాస్టర్ ఆఫ్ ది రోస్టర్'గా న్యాయపాలన రథాన్ని సజావుగా నడిపించే ఒడుపుతో జస్టిస్ రమణ నెగ్గుకురావాలి!