ఇజ్రాయెల్- యూఏఈ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 13న ప్రకటించారు. అనంతరం.. ఇది 'ఈ శతాబ్దపు ఒప్పందం' అని ఇజ్రాయెల్- యూఏఈ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లోని వివాదాస్పద ప్రాంతాల ఆక్రమణను ఇజ్రాయెల్ నిలిపివేస్తుంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడతాయి. కరోనాపై పోరుకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో ఇరు దేశాలు పరస్పరం సహాయం చేసుకుంటాయి. ముస్లిం యాత్రికులను జెరుసలేంకు అనుమతిస్తారు. పశ్చిమాసియా అజెండాగా అమెరికా-యూఏఈ వ్యూహాలు రచిస్తాయి.
రానున్న మూడు వారాల్లో.. పర్యటకం, భద్రత, ఏవియేషన్, విద్యుత్ శక్తి, ఆరోగ్యం, పర్యావరణం, సాంకేతికత రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి.
వ్యూహాత్మకంగా...
మరోవైపు పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు జెరుసలేంలో తమ రాయబార కార్యాలయాన్ని నెలకొల్పమని యూఏఈ తేల్చి చెప్పింది. అయితే వెస్ట్ బ్యాంక్‌పై తన ప్రణాళికలను కేవలం వాయిదా వేస్తున్నట్టు స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. ఈ పరిణామాలను పరిశీలిస్తుంటే.. దేశీయంగా వచ్చే ఇబ్బందులను ఎదుర్కొనేందకు ఇజ్రాయెల్-యూఏఈ ఈ విధంగా ప్రకటనలు చేసినట్టు కనపడుతోంది.
తమ శత్రువు ఇరాన్ అంశంలో రెండు దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌కు నిఘా పరంగా యూఏఈ సహకరించడం, గతేడాది నెతన్యాహు ఒమన్ పర్యటన, విరాళాలు ఇచ్చే దేశాల్లో పాలస్తీనా విషయంపై అసంతృప్తి, ఒక దేశంగా ఇజ్రాయెల్‌కు ఉన్న హక్కును సౌదీ యువరాజు సల్మాన్ గుర్తించడం, సౌదీలోకి ఇజ్రాయెల్ వ్యాపారులను అనుమతించడం, ఇజ్రాయెల్ బహిష్కరణపై ముస్లిం దేశాల్లో భిన్నాభిప్రాయాలు... వంటి కారణల వల్ల ఆ దేశంతో సంబంధాలను పెట్టుకునే విషయంలో గల్ఫ్ దేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
ఇజ్రాయెల్-యూఏఈ మధ్య కుదిరిన ఒప్పందంపై ఇతర దేశాలు కూడా తమ విదేశాంగ విధానాలకు కట్టుబడి స్పందించాయి. ఈ ఒప్పందంపై సౌదీ ఇంకా స్పందించనే లేదు. ఇతర గల్ఫ్ దేశాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా స్పందించినట్టు లేదు. అయితే యూఏఈ, అమెరికాతో ఉన్న బలమైన సంబంధాల వల్ల ఈ ఒప్పందాన్ని సౌదీ ఖండించలేకపోవచ్చు. ఖతార్, బహ్రెయిన్ ఒప్పందాన్ని స్వాగతించాయి. కానీ నెతన్యాహు తమను మోసం చేశారని మండిపడ్డాయి.
పాలస్తీనాకు మద్దతిచ్చే కువైట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలున్న ఈజిప్ట్, జోర్డాన్ దేశాలు ఒప్పందానికి మద్దతుగా నిలిచాయి. దీని బట్టి ముస్లిం దేశాలు చీలిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
ఈ ఒప్పందాన్ని పాలస్తీనా ఖండించింది. ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఒప్పందంపై తీవ్ర విమర్శలు చేస్తూ.. యూఏఈతో తమ సంబంధాలపై పునరాలోచించుకుంటామని హెచ్చరించింది టర్కీ. ఈ ఒప్పందం అగ్నికి ఆజ్యం పోయడం లాంటిదని ఇండోనేషియా అభిప్రాయపడింది. భారత్, చైనా స్వాగతించగా.. ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్టు పాకిస్థాన్ వెల్లడించింది.
దాదాపు అన్ని పాశ్చాత్య దేశాలు కూడా ఈ చారిత్రక ఒప్పందంపై సానుకూల ప్రకటనలు చేశాయి.
ఎవరికి ఏం దక్కుతుంది?
తమ ప్రోద్బలంతోనే ఇజ్రాయెల్-యూఏఈ మధ్య ఒప్పందం కుదిరిందని అమెరికా ఇప్పటికే ప్రపంచానికి తెలిపింది. ఈ ఏడాది తొలినాళ్లలో జరిగిన అఫ్గానిస్థాన్-తాలిబన్ల ఒప్పందంతో పాటు ఈ తాజా ఒప్పందాన్ని అస్త్రాలుగా ఉపయోగించుకుని ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు వెళ్లవచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఇజ్రాయెల్ దేశస్థులు మద్దతు ట్రంప్‌నకు కచ్చితంగా ఉంటుంది.