భారత్‌తో సంబంధాలు బలహీనం చేసుకొని నేపాల్ క్రమంగా దూరమవుతోంది. ఉత్తరాఖండ్ పితోరాగఢ్లోని భారత భూభాగాలను రాజ్యాంగ సవరణ చేసి నేపాల్ మ్యాప్‌లో కలుపుకున్న తర్వాత తనను పదవి నుంచి తప్పించడానికి భారత్ ప్రయత్నిస్తోందని ఆ దేశ ప్రధాని కేపీ ఓలి పరోక్ష విమర్శలు చేశారు.
అయితే ఓలి ఆరోపణలను సీనియర్ సహచరులే తప్పుబట్టారు. భారత్‌పై చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు చూపించాలని, లేదంటే ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం నేపాల్ కమ్యునిస్టు పార్టీలో అంతర్గత పోరాటాలు జరుగుతున్నాయని ఈ విషయం స్పష్టం చేస్తుంది. అంతేగాక భారత్ సహా ఇతర దేశాలతో ఈ పార్టీకి ఉన్న సన్నిహిత సంబంధాలను వ్యక్తపరుస్తోంది.
సీనియర్ సహచరులను పక్కనబెట్టి పూర్తిగా తానే అధికారం చెలాయించడం వల్ల నేపాల్ ప్రధాని ఓలికి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో తనను సంప్రదించడం లేదని పార్టీ కో-ఛైర్మన్ ప్రచండ... ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు.
ఎన్సీపీ విదేశీ వ్యవహారాలకు బాధ్యుడైన మాధవ్ నేపాల్‌ను సంప్రదించకుండానే కమ్యునిస్టు పార్టీ ఆఫ్ చైనాతో గతనెలలో పార్టీ స్థాయి చర్చలు నిర్వహించారు ఓలి. మరోవైపు పార్టీలో రెండు కీలక స్థానాలను తన చేతుల్లో పెట్టుకున్నారు. పాలనాపరమైన విషయాలతో పాటు ఆర్థిక వ్యవహారాలను ప్రత్యక్షంగా లేదా తన అనుచరుల ద్వారా నడిపిస్తున్నారు. ఇది పార్టీ నియమాలకు విరుద్ధం.
భారత్ వ్యతిరేక వ్యూహం
ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ ఓలి విఫలమయ్యారు. కరోనాను నియంత్రించలేకపోయారు. అవినీతిని కట్టడి చేయలేదు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. ఎంసీసీ పథకం కింద అమెరికా ప్రకటించిన 500 మిలియన్ డాలర్ల సహాయాన్ని ఓలి వ్యతిరేకించారు. దీంతో ప్రభుత్వం, పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గిపోయింది.
పార్టీలో ఒంటరిగా మారడం వల్ల ప్రతిపక్షనాయకులను సంప్రదిస్తున్నారు ఓలి. ఓలికి ప్రతిపక్ష 'నేపాలీ కాంగ్రెస్' అధ్యక్షుడు షేర్ బహదూర్ దియోబ నిశబ్దంగా మద్దతు ఇస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రజల దృష్టిని ఇతర సమస్యలవైపు మళ్లిస్తున్నారు. చైనా మద్దతుతో భారత వ్యతిరేక జాతీయవాద భావనను ప్రోత్సహిస్తున్నారు. 2015లో నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నప్పుడు, 2017 పార్లమెంట్ సమయంలోనూ ఓలి ఇదే మార్గాన్ని అనుసరించారు. తాజాగా మ్యాప్ విషయంలోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేశారు.
భారత భూభాగంపై హక్కులు వంటి విషయాలను ప్రస్తావించి నేపాల్‌లో జాతీయవాదాన్ని పెంచి, జాతీయవాద నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలోని వ్యతిరేకులతో పాటు తన విమర్శకులను అణచివేసేందుకు ఈ ప్రయత్నాలన్నీ చేశారు.
తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయవాదాన్ని ప్రోత్సహించడానికి మూడు అంశాలు ఓలికి సహకరించాయి. మొదటిది నేపాల్‌లోని యువత. దేశ జనాభాలో 65 శాతం యువతే ఉంది. భారత దేశంతో రోటీ- బేటీ సంబంధాలు వారిని ఆకట్టుకోలేదు. అభివృద్ధి, సౌకర్యవంతమైన జీవితాలు అందించేందుకు భారత్ తగిన సాయం చేయడంలేదని వారు ఊహించుకున్నారు.
రెండోది
గతకొన్నేళ్లుగా నేపాల్ యువతను ఆకట్టుకునే విధంగా ఆ దేశంలో భారత్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ఉదాసీనత, అహంకారం, బలవంతపు దౌత్య విధానాల ద్వారా నేపాల్ అంతర్గత వ్యవహారాలను నిర్వహించే దేశంగా భారత్‌ను పరిగణిస్తోంది అక్కడి యువత. 2015 సెప్టెంబర్‌లో నేపాల్ రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడం, అదే ఏడాది ఐదు నెలల పాటు నేపాల్‌పై ఆర్థిక నిర్బంధం విధించడం వంటివి భారత వైఖరికి ఉదాహరణలుగా చెప్పుకుంటున్నారు.