తెలంగాణ

telangana

ETV Bharat / opinion

సర్కారీ ఉపసంహరణ సరైనదేనా?

కరోనా కష్టకాలంలోనూ దేశీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు 11శాతం పెరిగి 150 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ప్రజలకు బ్యాంకులపట్ల అంతకంతకూ పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమిది. బ్యాంకింగ్‌ రేట్లు గడచిన కొంతకాలంగా బాగా తగ్గినా డిపాజిట్లపై ప్రజలు వెనకడుగు వేయకపోవడం విశేషం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా చేస్తున్న ప్రయత్నాలు కలవరం కలిగిస్తున్నాయి. బడుగులకు చేరువగా ఉండి, వారి డిపాజిట్లకు చెరిగిపోని పూచీగా నిలిచిన పీఎస్‌బీలను ప్రైవేటు బాట పట్టేస్తే... సామాన్యుడికి భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థపట్ల విశ్వాసం సన్నగిల్లుతుందని, కాబట్టి ప్రైవేటీకరణ విషయంలో హేతుబద్ధంగా వ్యవహరించాలని చెబుతున్న వ్యాసమిది...

privatisation of public banks is right
ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడి ఉపసంహరణ

By

Published : Apr 13, 2021, 8:21 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీల)ను ప్రైవేటుపరం చేయబోతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. దీంతో భారతదేశంలో బ్యాంకింగ్‌ రంగ స్వరూప స్వభావాలను మార్చివేయడానికి కేంద్రం కంకణం కట్టుకుందని స్పష్టమవుతోంది. అర్ధ శతాబ్ది క్రితం బ్యాంకులను జాతీయీకరించిన ప్రభుత్వం, ఇప్పుడు తన విధానానికి తానే నీళ్లు వదులుతోంది. పది ప్రభుత్వ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా విలీనం చేయడంతో , దేశంలోని మొత్తం పీఎస్‌బీల సంఖ్య 27 నుంచి 12కు తగ్గింది. బ్యాంకింగ్‌, బీమా, ఫైనాన్షియల్‌ సర్వీసులు చాలా కీలకమైన రంగాలని, వీటిలో తాను కనీస ఉనికిని కొనసాగిస్తానని కేంద్రం ప్రకటించింది. ప్రైవేటీకరణ ప్రక్రియ నుంచి ఆరు బ్యాంకులను మినహాయించాలని ప్రభుత్వాన్ని నీతి ఆయోగ్‌ కోరింది. అవి- పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. ప్రభుత్వం ఇప్పుడప్పుడే యూకో బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకులను ప్రైవేటీకరించకపోవచ్చు. అవి రిజర్వు బ్యాంక్‌ సూచించిన దిద్దుబాటు చర్యలను చేపట్టడమే దీనికి కారణం. తక్షణం ప్రైవేటీకరించడానికి అనువుగా ఉన్నవి- పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు మాత్రమే. మరి వీటిలో ఏ రెండింటిని ప్రైవేటీకరించేదీ కేంద్రం స్పష్టం చేయకపోవడం, ఆ బ్యాంకుల సిబ్బందిని తీవ్ర అయోమయంలో పడేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మెగా ప్రైవేటీకరణ కింద రూ.1.75 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను విక్రయించడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నందువల్ల, ఏవో రెండు పీఎస్‌బీలను ప్రైవేటీకరించడమైతే ఖాయం.

నిరర్థక ఆస్తులతో సమస్య:

నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) పీఎస్‌బీలకు మరణ శాసనం రాస్తున్నాయి. కొవిడ్‌ లాక్‌డౌన్‌ వల్ల వ్యాపారాలు దెబ్బతిని ఎన్‌పీఏలు మరింత పెరిగాయి. 2020 సెప్టెంబరునాటికి 7.5 శాతంగా ఉన్న ఎన్‌పీఏలు 2021 సెప్టెంబరు నాటికి 13.5 శాతానికి పెరుగుతాయని రిజర్వు బ్యాంకు అంచనా. వీటి బారి నుంచి పీఎస్‌బీలను కాపాడటానికి ప్రభుత్వం మరింత మూలధనాన్ని అందించి భారం తలకెత్తుకోక తప్పదు. ప్రభుత్వం మూలధన పునఃపూరక బాండ్లు, కొత్త పెట్టుబడుల రూపంలో పీఎస్‌బీలకు 2019లో రూ.70,000 కోట్లు, 2018లో రూ.80,000 కోట్లు, 2020లో రూ.1.06లక్షల కోట్లు కేటాయించి ఉంది. 2014 నుంచి 2019 వరకు పీఎస్‌బీల బండి నడిపించడానికి కేంద్రం రూ.3.19లక్షల కోట్ల ప్రజాధనాన్ని ధారపోసింది. ఈ రకంగా ఏ ఏటికాయేడు ప్రజాధనాన్ని గుమ్మరించి బ్యాంకులను గట్టెక్కించడానికి ప్రభుత్వం ఇక ఏమాత్రం సుముఖంగా లేదు. ఆ మాట ఒప్పుకోకుండా బ్యాంకుల లాభదాయకతను, ఉత్పాదకతను కాపాడటానికి, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి బ్యాంకుల విలీనాన్ని, ప్రైవేటీకరణను చేపడుతున్నామని అది పైకి చెబుతోంది. దీనికి బదులు బ్యాంకుల వద్ద భారీగా అప్పులు చేసి ఎగ్గొట్టిన బడా కార్పొరేట్‌ అధిపతుల ముక్కుపిండి డబ్బు వసూలు చేయవచ్చు.

ప్రభుత్వ రంగ బ్యాంకులు సమాజంలో అన్ని వర్గాలకూ సేవలు అందిస్తూ సామాజిక సంక్షేమానికి, బడుగు వర్గాల మేలుకు తోడ్పడుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన వంటి అనేకానేక కార్యక్రమాలను పీఎస్‌బీల ద్వారానే అమలు చేస్తోంది. ఈ వాస్తవాన్ని విస్మరించి కేవలం లాభాలు ఆర్జించడం లేదనే కారణంపై పీఎస్‌బీలను ప్రైవేటుపరం చేయడం సరికాదని నిపుణులు అభ్యంతరపెడుతున్నారు. నిజానికి జాతీయీకరణ తరవాతే భారతీయ బ్యాంకులు ప్రపంచంలోనే అత్యధిక వేగంతో విస్తరించాయి. దీనివల్ల చిన్న రైతులకు, వ్యాపారులకు, గ్రామాల్లో వ్యవసాయేతర వృత్తుల్లో ఉన్నవారికి, ఇతర బలహీన వర్గాలకు రుణ సదుపాయం కల్పించడం వీలైంది. పేదరికం తగ్గడానికి, ఉపాధి అవకాశాలు పెరగడానికి పీఎస్‌బీలు ఈ విధంగా తమ వంతు పాత్ర పోషించాయి. ప్రజలకు రుణ సదుపాయం కల్పించడం దేశ ఆర్థికాభివృద్ధి రేటును పెంచుతుంది. బ్యాంకులు ఎక్కువగా మహా నగరాలు, పట్టణాల్లో కేంద్రీకృతం కావడం పెద్ద లోపమే. 2018లో మొత్తం డిపాజిట్లలో 50 శాతం మహానగర బ్యాంకు శాఖల్లో ఉన్నాయి. అవి 64 శాతం రుణాలు ఇచ్చాయి. పట్టణ శాఖల్లో 21.5 శాతం డిపాజిట్లు ఉంటే, అవి కేవలం 15 శాతం రుణాలనే ఇచ్చాయి. మహానగర శాఖలు తమకు డిపాజిట్ల రూపంలో వచ్చిన ప్రతి 100 రూపాయలలో 97 రూపాయలను రుణాలుగా ఇస్తున్నాయి. పట్టణ శాఖలు 55 రూపాయలను మాత్రమే రుణాలుగా ఇవ్వగలుగుతున్నాయి. గ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు బాగా తక్కువ కాబట్టి అక్కడ డిపాజిట్లు, రుణాలూ చాలా తక్కువ. ఇక్కడ ప్రైవేటు బ్యాంకులు తమ శాఖలను తెరవవు.

సామాన్యుడికి పీఎస్‌బీలే దిక్కు:

జపాన్‌, జర్మనీలు బ్యాంకు రుణాలతో రోడ్లు, రేవులు, విద్యుత్‌ ప్లాంట్లు తదితర మౌలిక వసతులను భారీయెత్తున నిర్మించాయి. భారత ప్రభుత్వం స్వయంగా మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టాల్సింది పోయి కార్పొరేట్లకు ఆ బాధ్యతను బదలాయించింది. మౌలిక వసతుల పేరిట కంపెనీలు బ్యాంకుల నుంచి పెద్దయెత్తున రుణాలు తీసుకుని సకాలంలో తీర్చలేకపోవడం బ్యాంకులను దెబ్బతీసింది. ఈ కారణం వల్లనే ప్రైవేటు బ్యాంకుల్లోకన్నా పీఎస్‌బీలలో ఎన్‌పీఏలు ఎక్కువయ్యాయి. 1980ల నుంచి బ్యాంకుల్లో రాజకీయ జోక్యం పెరగడమూ ఈ దుస్థితికి ఒక ముఖ్య కారణం. ఈ పరిస్థితిని నివారించడానికి రిజర్వు బ్యాంకు తన నియంత్రణాధికారాలను సక్రమంగా వినియోగించకపోవడం పీఎస్‌బీలను నష్టాల ఊబిలోకి నెట్టింది. గడచిన అయిదేళ్లలో బ్యాంకుల ప్రైవేటీకరణ ఊపందుకోవడంతో రుణ వితరణలో పీఎస్‌బీల వాటా తగ్గిపోసాగింది. 2010 మార్చిలో మొత్తం బ్యాంకు రుణాల్లో 75 శాతానికిపైనే ఉన్న పీఎస్‌బీల వాటా 2020 సెప్టెంబరునాటికి 57 శాతానికి పడిపోయింది. ఈ పదేళ్లలో ప్రైవేటు బ్యాంకుల రుణ వితరణ 17శాతం నుంచి 35 శాతానికి పెరిగింది. డిపాజిట్లలో మాత్రం పీఎస్‌బీల వాటా మరీ ఎక్కువగా ఏమీ తగ్గలేదు. 2012లో బ్యాంకు డిపాజిట్లలో 74శాతం పీఎస్‌బీల వద్ద ఉండగా, 2020 సెప్టెంబరుకల్లా అవి 62శాతానికి తగ్గాయి. దీన్ని బట్టి తమ ధనం ప్రైవేటు బ్యాంకుల్లో కన్నా పీఎస్‌బీలలోనే ఎక్కువ సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రైవేటు బ్యాంకుల్లోనూ మోసాలు జరగడం, కొన్ని దివాలా తీయడం... వారూ చూస్తూనే ఉన్నారు. అసలు పీఎస్‌బీల వల్లనే భారతదేశం 2008నాటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడగలిగింది. భారత్‌లో ఇప్పటికీ బ్యాంకు ఖాతాలేని వయోజనులు 19 కోట్లమంది వరకు ఉంటారు. వీరిని బ్యాంకింగ్‌ ఛత్రం కిందకు తీసుకురావడానికి ప్రైవేటు బ్యాంకులు అంతగా ఆసక్తి చూపవు. పీఎస్‌బీల వల్లే ఆ పని అవుతుంది. సమ్మిళిత అభివృద్ధికి పీఎస్‌బీలే ప్రధాన సాధనాలు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండే బ్యాంకింగ్‌ వ్యవస్థ మనకు అవసరం. పీఎస్‌బీల పనితీరును, లాభదాయకతను పెంచడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రాజకీయ జోక్యాన్ని పూర్తిగా పరిహరించాలి. మార్కెట్లో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు సమాన అవకాశాలు ఉండే విధంగా రిజర్వు బ్యాంకు జాగ్రత్త వహించాలి.

- డాక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌.జ్యోతి కుమార్‌ (మిజోరం కేంద్ర విశ్వవిద్యాలయ వాణిజ్య విభాగాధిపతి)

ఇదీ చదవండి:రఫేల్ రగడపై సుప్రీంలో విచారణ

ABOUT THE AUTHOR

...view details