దేశంలో అంతకంతకు అధికమవుతున్న మాదకద్రవ్యాల ఉత్పత్తి, వినియోగం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ దుష్ట సంస్కృతి ఇప్పుడు శరవేగంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. దేశ జనాభాలో దాదాపు అయిదు శాతం మత్తుమందులకు బానిసలయ్యారన్న క్షేత్రస్థాయి సమాచారం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇటువంటి వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ప్రమాదకరమైన ఈ పరిస్థితిని నివారించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగం కంటితుడుపు దాడులతో సరిపెడుతోంది. మాదకద్రవ్యాలపై అగ్రరాజ్యాలు దాదాపు యుద్ధమే చేస్తుంటే మన దగ్గర ఆ దిశగా కనీస సన్నద్ధత సైతం కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మూతపడ్డ పరిశ్రమల్లో ఉత్పత్తి
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్), నేషనల్ డ్రగ్ డిపెన్డెన్స్ ట్రీట్‌మెంట్ సెంటర్ (ఎన్‌డీడీటీసీ) సంయుక్తంగా ‘మేగ్నిట్యూడ్ ఆఫ్ సబ్‌స్టెన్స్ యూజ్ ఇన్ ఇండియా-2019’ పేరిట ఓ నివేదిక రూపొందించాయి. దేశవ్యాప్తంగా 186 జిల్లాల్లో సిబ్బంది రెండు లక్షలకు పైగా ఇళ్లకు వెళ్ళి 4.73 లక్షల మందిని వ్యక్తిగతంగా కలిసి వివరాలు సమీకరించారు. మత్తుమందుల వినియోగంపై క్షేత్రస్థాయిలో ఇంత సూక్ష్మ పరిశీలన మున్నెన్నడూ జరగలేదు. దేశ జనాభాలో 2.8శాతం గంజాయి, 2.1శాతం ఒపిఆయిడ్ అంటే ఒపియం (నల్లమందు), హెరాయిన్ వంటి మత్తుమందులు వాడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇంకా కొద్దిమంది ఇతరత్రా రసాయన మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు వెల్లడైంది. ఓ మోస్తరు పట్టణాల్లోనూ గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంది. ఒకప్పుడు ఊరికి దూరంగా నిర్మానుష్య ప్రాంతాల్లో జరిగే గంజాయి పార్టీలు ఇప్పుడు కాలనీల్లోని పార్కులకు చేరాయి. మధ్యతరగతి యువత గంజాయిని సేవిస్తుంటే- సంపన్నులేమో కొకైన్, హెరాయిన్ వంటివాటికి అలవాటు పడుతున్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలో డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో రూ.97.5 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపట్టేదే! కొకైన్, ఎల్‌ఎస్‌డీ వంటివి పట్టుబడటమూ మామూలైపోయింది. మాదకద్రవ్యాలు వాడేవారు పెరుగుతుండటంతో అక్రమ మార్గాల్లో సరఫరా సైతం ఇంతలంతలవుతోంది.
ఉత్పత్తిలోనూ..
వినియోగంలోనే కాదు, మాదకద్రవ్యాల ఉత్పత్తిలోనూ ఇండియా తరగని అపకీర్తిని మూటగట్టుకుంటోంది. ‘ప్రపంచ మాదకద్రవ్యాల నివేదిక-2020’ ప్రకారం నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్ ఎగుమతుల్లో మనదేశం వరసగా నాలుగు, ఏడు, పన్నెండు స్థానాల్లో నిలిచింది! పరాగ్వే, అమెరికాల తరవాత గంజాయిని అత్యధికంగా భారత్‌లో స్వాధీనం చేసుకున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. యాంఫిటమైన్ టైప్ స్టిమ్యులెంట్స్ (ఏటీఎస్) తరహా రసాయన మత్తుమందుల తయారీ పరిశ్రమలు ఆసియా ఖండం మొత్తమ్మీద మయన్మార్, ఇండియాల్లోనే అత్యధికంగా ఉన్నాయని స్పష్టంచేసింది. ఔషధ తయారీ పరిశ్రమకు చిరునామాగా మారిన హైదరాబాద్‌లో చాపకింద నీరుగా ఏటీఎస్ తరహా మత్తుమందుల ఉత్పత్తి ఊపందుకుంటోంది. మూతపడ్డ ఔషధ పరిశ్రమలను లీజుకు తీసుకుని కొంతమంది మాదకద్రవ్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. నిరుడు సెప్టెంబరులో డీఆర్‌ఐ అధికారులు నగర శివార్లలో మెఫెడ్రోన్ అనే మత్తుమందును తయారుచేస్తున్న ఓ పరిశ్రమ గుట్టును రట్టు చేశారు. దిల్లీతోపాటు ఆస్ట్రేలియా, తూర్పు ఆసియా దేశాలకు ఇక్కడి నుంచి మత్తుమందును ఎగుమతి చేస్తున్నట్లు ఆ సందర్భంగా వెల్లడయింది. రెండేళ్ల క్రితం నాచారం పారిశ్రామికవాడలో రహస్యంగా కేటమైన్ మత్తుమందును ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమపై ఎన్‌సీబీ అధికారులు దాడి చేశారు. ఏకంగా 17 మంది సిబ్బందిని పెట్టుకొని మరీ ఇక్కడ మత్తుమందులు తయారు చేస్తున్నారు. ఇవి కొన్ని ఉదాహణలు మాత్రమే. ముడి సరకు సులభంగా లభిస్తుండటం, రవాణా అవకాశాలు ఎక్కువ కావడం, అన్నింటికి మించి రసాయన మాదకద్రవ్యాల తయారీకి అవసరమైన (మూతపడ్డ) ఔషధ పరిశ్రమలు అందుబాటులో ఉండటంతో అక్రమార్కులు హైదరాబాద్‌లో తిష్ఠవేస్తున్నారు.