తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం- సమగ్ర క్షాళనతోనే స్వస్థత! - భారత్​లో ఆరోగ్య సేవలు

నాణ్యమైన వైద్యసేవల అందుబాటులో భూటాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకల కంటే వెనకబడిన ఇండియాలో ప్రజారోగ్యంపై ప్రభుత్వాల వ్యయం నానాటికీ తగ్గిపోతుండటమే ఆందోళనకరమని అధ్యయనాలు చెబుతున్నాయి. మౌలిక వసతుల లేమితో మూలుగుతున్న సర్కారీ దవాఖానాల వల్ల గ్రామీణుల్లో 72 శాతం, పట్టణాల్లో 79 శాతం ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రులే దిక్కవుతున్నాయని పేర్కొన్నాయి.

hospitals
ఆసుపత్రి, ఆరోగ్యం

By

Published : Jun 3, 2021, 8:45 AM IST

ఆరోగ్య సేవల అందుబాటులో నగరాలకు గ్రామాలకు, సంపన్నులకు ఆపన్నులకు మధ్య అంతరాలకు దశాబ్దాలుగా అంటుకట్టి పెంచిపోషించిన ప్రభుత్వాల పాపమే నేడు కొవిడ్‌ కల్లోలంలో కోట్లాది సామాన్యులతో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు అన్న రాజ్యాంగ స్ఫూర్తితో పాటు వైద్యచికిత్సల వ్యయం అందరికీ అందుబాటులో ఉండటం ఆ హక్కులో అంతర్భాగమన్న సుప్రీంకోర్టు తీర్పులకూ మన్నన దక్కని దుస్థితిలో- ఆరోగ్య అసమానతా సూచీలో 158 దేశాల్లో ఇండియా 129వ స్థానంలో కునారిల్లుతోంది!

మౌలిక వసతుల లేమితో మూలుగుతున్న సర్కారీ దవాఖానాల వల్ల గ్రామీణుల్లో 72 శాతం, పట్టణాల్లో 79 శాతం ప్రజలకు ప్రైవేటు ఆసుపత్రులే దిక్కవుతున్నాయి. గడచిన దశాబ్ద కాలంలో ప్రైవేటు వైద్యభారం 175 శాతానికి పైగా పెరిగిందంటున్న అధ్యయనాలు- తలకు మించుతున్న వ్యయంతో సెకనుకు ఇద్దరు పేదరికం పడగనీడలోకి ఒరిగిపోతున్నారనే చేదువాస్తవాన్నీ చాటుతున్నాయి.

నాణ్యమైన వైద్యసేవల అందుబాటులో భూటాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకల కంటే వెనకబడిన ఇండియాలో ప్రజారోగ్యంపై ప్రభుత్వాల వ్యయం నానాటికీ తగ్గిపోతుండటమే ఆందోళనకరం! రెండు దశాబ్దాల క్రితమే దేశ జీడీపీలో 1.01 శాతాన్ని వైద్యారోగ్య రంగానికి ప్రత్యేకించిన కేంద్రం- ఈ ఏడాదిలో ఆ మొత్తాన్ని మరీ 0.34 శాతానికే పరిమితం చేసింది! 2017 జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం బడ్జెట్‌లో కనీసం ఎనిమిది శాతాన్ని ప్రజారోగ్యంపై వెచ్చించాల్సిన రాష్ట్రాలూ సగటున 5.18 శాతం కేటాయింపులతోనే సరిపుచ్చుతున్నాయి. ప్రజల సగటు ఆయుర్దాయం ఒక సంవత్సరం పెరిగితే స్థూలదేశీయోత్పత్తి ఏడాదికి నాలుగు శాతం వృద్ధి చెందుతుందని, వైద్యరంగంలో సమధిక పెట్టుబడులు విస్తృత ఉపాధి అవకాశాలకు ఊతమిస్తాయని కేంద్ర ఆరోగ్య శాఖే చెబుతున్నా- ప్రజారోగ్య రంగాన్ని పటిష్ఠీకరించి దేశాభివృద్ధికి బాటలు పరవడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రజలకు పెనుశాపమవుతోంది!

కాగ్ నివేదికలో...

జనారోగ్యం, శ్రేయస్సులకు ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపులు 137 శాతం పెంచామన్న కేంద్ర ఆర్థిక మంత్రి- పోషకాహారం, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా పద్దులనూ వీటిలో కలిపేసి లెక్కలను మసిపూసి మారేడు చేశారు. గ్రామీణ కుటుంబాల వైద్యావసరాల కోసమంటూ ప్రత్యక్ష పన్నులపై మూడు శాతంగా ఉన్న విద్య సెస్‌ను మూడేళ్ల క్రితం కేంద్రం 'విద్య, ఆరోగ్య సెస్‌'గా మార్చి నాలుగు శాతానికి పెంచింది. ఈ వసూళ్లలోంచి ప్రజారోగ్యంపై ఖర్చు చేసిందేమీ లేదని కాగ్‌ నివేదికలు లోగడే కుండ బద్దలుకొట్టాయి.

ఈ సెస్‌ సొమ్మును 'ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా నిధి'లో జమచేసి సద్వినియోగం చేస్తామన్న కేంద్రం ఇటీవలి ప్రకటన, ప్రజోపయోగ అంశాల్లో నత్తనడకన సాగుతున్న విధాన నిర్ణయాలనే వేలెత్తిచూపిస్తోంది! యూకే, అమెరికా, స్వీడన్‌, జపాన్‌, జర్మనీ తదితర ఎన్నో దేశాలు జీడీపీలో పది శాతం, అంతకు మించిన కేటాయింపులతో ప్రజారోగ్యాన్ని సంరక్షించుకుంటున్నాయి. దేశ ప్రజలందరికీ ఏకరూప వైద్యసేవలు అందించడానికి ఉద్దేశించిన 'జాతీయ ఆరోగ్య వ్యవస్థ'కు యూకే ప్రభుత్వమే 79 శాతం నిధులను సమకూరుస్తోంది.

దేశ జీడీపీలో మూడు శాతాన్ని జనారోగ్యంపై వెచ్చించగలిగితే ప్రజలపై వైద్య వ్యయభారం సగానికి సగం తగ్గిపోతుందని తాజా ఆర్థిక సర్వే సైతం సూచించింది. అయిదు లక్షల ఆసుపత్రి పడకలు, 64 లక్షల వైద్యారోగ్య వృత్తినిపుణులను సత్వరం సమకూర్చుకోలేకపోతే దేశీయంగా ఆరోగ్య రంగం గడ్డు సమస్యలు ఎదుర్కొంటుందని 'కేపీఎంజీ' నివేదిక అయిదేళ్ల క్రితమే హెచ్చరించింది. దేశాభివృద్ధికి ఊతమైన యువశక్తిలో తిరుగులేని భారత్‌- స్వస్థసేవలు జావగారి నిలువునా నీరసించిపోతోంది. పల్లె నుంచి నగరం దాకా ప్రతి అంచెలోనూ ప్రజారోగ్య సంరక్షణను కొత్త పుంతలు తొక్కించే సమగ్ర కార్యాచరణే ఆత్మనిర్భర భారత్‌ను ఆవిష్కరించగలుగుతుంది!

ఇదీ చదవండి:'విద్యార్థినులకు 33శాతం సీట్లు కేటాయింపు'

ABOUT THE AUTHOR

...view details