India china news: గల్వాన్ ఘర్షణల అనంతరం తీవ్ర ఉద్రిక్త స్థాయికి చేరిన భారత్-చైనా సంబంధాలు తిరిగి గాడినపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఇండొనేసియాలోని బాలిలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ పలు అంశాలపై చర్చలు జరిపారు. గత మార్చిలో భారత్ పర్యటనకు వాంగ్ వచ్చిన అనంతరం ఇరు దేశాల కీలక నేతలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి మెరుగవుతున్నాయని, రెండు దేశాలు పలు అంశాల్లో ఒకే రకమైన ప్రయోజనాలను, అవసరాలను కలిగి ఉన్నాయని చైనా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన ఒక రచయిత రాసిన 'అంధకారం అనేది దానంతట అదే వెళ్లిపోదు.. ఒక దీపం వెలిగిస్తేనే చీకట్లు పారిపోతాయి' అన్న కవితను వాంగ్‌యీ వినిపించడం విశేషం. ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం కోసం చైనా యత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. బీజింగ్‌తో సుహృద్భావ సంబంధాల కోసం ఆశాజనకమైన వాతావరణంలో సహకరించేందుకు దిల్లీ సిద్ధంగా ఉందని జైశంకర్ తెలిపారు. ఉభయుల మధ్య సరిహద్దు అంశం పరిష్కారం కానప్పటికీ ఏటేటా వాణిజ్యం అధికమవుతోంది. 2021లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఏకంగా దాదాపు రూ.9.65 లక్షల కోట్లకు చేరింది. అయితే భారత్ నుంచి చైనాకు ఎగుమతుల కన్నా, డ్రాగన్ నుంచి ఇండియాకు దిగుమతులే అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో బీజింగ్‌లో నిర్వహించిన 'బ్రిక్స్' జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. బీజింగ్-దిల్లీల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు అది తోడ్పడిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
గల్వాన్ ఘర్షణల తరవాత చైనా-భారత్‌లు సరిహద్దు సమస్యపై ఇప్పటికే 15 సార్లు కమాండర్ స్థాయిలో చర్చలు జరిపాయి. వాటిలో ప్యాంగ్యాంగ్‌త్సొ, గోగ్రా-హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతాల్లో గస్తీ, దళాల ఉపసంహరణలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా 16వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నివారణకు దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్ సూచిస్తోంది. చైనా మాత్రం దెప్సంగ్, దెమ్‌చాక్ ప్రాంతాలపై చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదు. ప్రస్తుత సరిహద్దు సమస్యకు, వాటికి సంబంధం లేదని వాదిస్తోంది. ఈ అంశంపైనే 13వ విడత చర్చలు ఏమీ తేల్చకుండా అర్ధాంతరంగా ముగిశాయి. తూర్పు లద్దాఖ్‌లో మే 2020 నాటి యధాతథా స్థితి ఉండాలని దిల్లీ డిమాండ్ చేస్తోంది. ఆ ప్రాంతంలోని కుంగ్రాంగ్‌నాలా సెక్టార్‌లో తిష్ఠవేసిన చైనా తిరిగి వెళ్ళకపోవడం వల్ల చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడుతోంది. తూర్పు లద్దాఖ్‌లో ఇరుదేశాల దళాలు దాదాపు రెండేళ్లుగా మోహరించి ఉన్నాయి.
గల్వాన్ ఘర్షణల అనంతరం రెండేళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు సమస్య పరిష్కారమయ్యేంత వరకూ సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదని భారత్ కరాఖండీగా తేల్చి చెప్పింది. సరిహద్దు అంశాన్ని పక్కనపెట్టి ఇతర అంశాల్లో కలిసి రావాలని బీజింగ్ కోరుతోంది. సరిహద్దు భద్రతకు సంబంధించిన అంశాల్లో భారత్ దృఢమైన వైఖరి అవలంబిస్తోంది. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు పరస్పర గౌరవం, ప్రయోజనాలు.. తదితర అంశాల ప్రాతిపదికన ఉంటాయని జైశంకర్ గతంలోనే ప్రకటించారు. 1993, 96 సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను గౌరవించాల్సిన బాధ్యత చైనాపై ఉందని భారత్ ప్రకటించింది. వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చేందుకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని భారత్ ఇటీవలే ఒక స్పష్టమైన ప్రకటనను విడుదల చేసింది. చైనా మాత్రం భారత్‌తో స్నేహసంబంధాల కోసం యత్నిస్తున్నట్టు నటిస్తోంది.
చైనాకు చెందిన పలు కంపెనీలు భారత్‌లో వేల కోట్ల రూపాయల కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇంత పెద్ద మార్కెట్‌ను వదులుకోవడానికి ఏ దేశమూ ఇష్టపడదు. అయితే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల కోసం కృషిచేస్తున్నట్టు ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో డ్రాగన్ చర్యలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఇప్పటికే చైనా పలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది. వేల మంది సైనికులకు వసతితో పాటు యుద్ధం వస్తే త్వరితగతిన తరలించేందుకు వీలుగా సైనిక సామగ్రినీ అక్కడకు చేర్చింది. భారత్ సైతం డ్రాగన్ వ్యూహానికి దీటుగా స్పందించాల్సిన అవసరముంది. చర్చలు జరుగుతున్నా సరిహద్దుల్లో ఎర్రసైన్యం కదలికలను నిశితంగా గమనించి అవసరమైతే అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రతివ్యూహాలను రూపొందించాలి.