తమ దేశ భౌగోళిక పటాన్ని మార్చేందుకు నేపాల్ ప్రభుత్వం మే 31న రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. భారత్‌లోని కాలాపానీ, లింపియాధురా, లిపులేఖ్ ప్రాంతాలను తమ అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్‌ను రూపొందించింది. దీంతో ఇరుదేశాల మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత భారత్ నూతన మ్యాప్ విడుదల చేయడం వల్ల నేపాల్‌తో వివాదం ప్రారంభమైంది. కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను భారత్‌లో అంతర్భాగంగా చూపించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతకుముందు కుదుర్చుకున్న ఒప్పందాలకు ఈ చర్య విఘాతం కలిగిస్తోందని ఆరోపించింది. అయితే భారత్ మాత్రం నేపాల్ వాదనను ఖండిస్తూ వచ్చింది.
ఉత్తరాఖండ్‌లో భారత్ రోడ్డు మార్గం నిర్మించిన తర్వాత వివాదం మళ్లీ మొదలైంది. కైలాస మానస సరోవర్‌ను చేరుకోవడానికి భారత్ చేపట్టిన ఈ నిర్మాణం పట్ల అభ్యంతరం తెలిపింది కాఠ్మాండూ. మరోవైపు.. వేరొక దేశం ఆదేశాల ప్రకారమే నేపాల్ నిరసనవ్యక్తం చేస్తోందన్న భారత ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె వ్యాఖ్యల తర్వాత పరిస్థితి మరింత దిగజారింది.
విశేష బంధం
ముందునుంచి భారత్-నేపాల్ మధ్య చాలా ప్రత్యేక సంబంధాలే ఉన్నాయి. 1950లో కుదుర్చుకున్న శాంతి, స్నేహపూర్వక ఒప్పందం ప్రకారం ఎలాంటి పత్రాలు లేకుండా భారత్‌లో పనిచేసుకునే అవకాశం నేపాల్ పౌరులకు లభించింది. అటు భారత సైన్యంలోనూ నేపాల్ పౌరులు సేవలందిస్తున్నారు. 'జనరల్' హోదాకు చేరుకున్నవారూ ఉన్నారు. ఇరుదేశాల మధ్య సామరస్యానికి ఇవి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు.
భారత జాతీయ భద్రత విషయంలో నేపాల్ పౌరులు భాగస్వాములుగా ఉన్నారు. గూర్ఖా బ్రిగేడ్‌లోని ఏడు రెజిమెంట్లలో కలిపి ప్రస్తుతం 35 వేల మంది జవాన్లు భారత సైన్యంలో సేవలందిస్తున్నారు. మరో 90 వేల మంది పెన్షనర్లుగా ఉన్నారు. ఈ విషయంలో ఇరుదేశాల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. దీన్ని మరింత కాపాడుకోవాలి.
వ్యతిరేక వర్గాల కుట్ర!
నేపాల్ మాత్రం భారత్‌ను మిశ్రమ దృష్టి కోణంతో చూస్తూ వస్తోంది. చాలా ద్వైపాక్షిక సమస్యలకు పరిష్కారాలు అసంపూర్ణంగా ఉన్నాయని నేపాల్ భావిస్తోంది. ఇప్పటికే చేసుకున్న వాగ్దానాలను భారత్ గౌరవించలేదని అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ నిబద్ధత పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
ఇదీ చదవండి: భారత్‌తో 'మ్యాప్ వార్' కోసం నేపాల్ రాజ్యాంగ సవరణ!
లిపులేఖ్ పాస్ గుండా భారత్ రహదారి ప్రారంభించిన విషయంలో నేపాల్ పూర్తి స్థాయిలో ఘర్షణకు దిగకపోయినప్పటికీ.. భారత్‌కు వ్యతిరేకంగా పొరుగు దేశంలో అంతర్గతంగా ఏర్పడిన వర్గాలే ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తున్నట్లు తెలుస్తోంది.
చైనా చిచ్చు!
భౌగోళికంగా ఆసియాలో రెండు శక్తిమంతమైన దేశాల మధ్య ఉన్న నేపాల్ 2006లో రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వం వైపు అడుగులు వేసింది. ఈ సమయంలో భారత్-నేపాల్ మధ్యనున్న ప్రత్యేక బంధానికి పరీక్షలు మొదలయ్యాయి. నేపాల్‌లో కమ్యునిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌తో సంబంధాలు క్రమంగా క్షీణించాయి. మరోవైపు కమ్యునిస్టు దేశమైన చైనాకు సైద్ధాంతికంగా, రాజకీయంగా కాస్త ప్రయోజనం కలిగింది.
ఇదీ చదవండి: భారత్‌కు వ్యతిరేకంగా నేపాల్‌లో చైనా చిచ్చు!