తెలంగాణ

telangana

ETV Bharat / opinion

'ఆర్థిక రథం కదలాలంటే.. ఆ దేశాలే దిక్సూచీలు' - 5 trillion economy pib

గడచిన తొమ్మిది త్రైమాసికాలకు ఎనిమిది త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిరేటు క్షీణించింది. బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగిపోయి, జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలకు పెను విఘాతం కలిగే ప్రమాదం ఉందని అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2024కల్లా భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దిద్ది తీర్చాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగా కరోనా చేసిన నష్టం నుంచి కోలుకుని ముందుకు వెళ్లడం అనేది సవాలుగా మారింది. కానీ ప్రతీ సవాలులోనూ అవకాశాలను వెతుక్కుని ఆర్థిక రథాన్ని పరుగుల పెట్టించాలి అంటే అభివృద్ధి చెందిన దేశాలను చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది.

india need to learn from developed countries regarding economic reforms after corona
పురోగమనానికి అభివృద్ధి చెందిన దేశాలే గీటురాళ్లు!

By

Published : Nov 29, 2020, 6:55 AM IST

నరేంద్ర మోదీ కేంద్రంలో రెండోసారి పగ్గాలు చేపట్టి మొన్న మే 30నాటికి ఏడాది పూర్తయింది. దానికి కొన్ని నెలల ముందు నుంచే కొవిడ్‌ సంక్షోభం విరుచుకుపడటంతో మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికకు పెను విఘాతం కలిగింది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన వివిధ కార్యక్రమాలను నిలిపివేయడమే కాదు, కొత్త పథకాలేవీ చేపట్టకూడదని మంత్రిత్వ శాఖలను కోరారు. బడ్జెట్‌లో ప్రకటించి, ప్రభుత్వ వ్యయాల శాఖ అనుమతి పొందిన పథకాలను మాత్రం కొనసాగిస్తూ, సూత్రప్రాయంగా అనుమతి పొంది నిధుల కేటాయింపు జరగని పథకాలను మాత్రం నిలిపేస్తారు. ఇంత నిధుల కటకటలోనూ రూ.20 లక్షల ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకాన్ని మాత్రం అనుకున్నట్లే కొనసాగిస్తారు.

సంక్షోభ సమయంలోనే నాయకుడి బలాబలాలు నిగ్గుతేలుతాయి. మోదీ రెండో సంవత్సర పాలనలో ప్రజలు ఆయన శక్తిసామర్థ్యాలపై సరైన అంచనాకు రాగలుగుతారు. అటు కరోనా ఇటు మిడతల దాడితో- కష్టాలు చెప్పిరావనీ, కట్టకట్టుకుని వస్తాయన్న పెద్దల మాట మరోసారి స్ఫురణకు వస్తోంది. ఈ సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థకు అగ్నిపరీక్షగా నిలవనున్నది. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం పగ్గాలు చేపట్టేసరికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉండేది. మోదీ ప్రభుత్వం 2019 మేలో రెండోసారి అధికారం చేపట్టేసరికి అది 2.7 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. 2024కల్లా భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్షిస్తున్నారు.

ప్రధాన సమస్యలివే...

మోదీ మొదటి సంవత్సర పాలనలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉండి స్థూల పెట్టుబడి సంచయం కాస్త పెరుగుదల నమోదు చేసింది. సులభతర వాణిజ్య సూచీలో భారత్‌ ర్యాంకు మెరుగుపడింది. మొదటి ఆరు నెలల్లో రాష్ట్రాల ఎన్నికలు, 370 అధికరణ వంటి రాజకీయ, పాలనా అంశాల మీద ప్రభుత్వం దృష్టిపెట్టడంతో ఆర్థిక రంగం మీద శ్రద్ధ తగ్గింది. పొదుపు, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు తగ్గిపోతుంటే- ప్రభుత్వ రుణ భారం, నిరుద్యోగం పెరగసాగాయి. గడచిన తొమ్మిది త్రైమాసికాలకు ఎనిమిది త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిరేటు క్షీణించింది. అసలే బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరిగిపోయి, జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయి ప్రభుత్వం అల్లలాడుతున్న సమయంలో- పులి మీద పుట్రలా కరోనా కల్లోలం వచ్చిపడింది.

ముందున్న సవాళ్లు...

అన్ని రంగాలకు రుణాలు అందించి ఉత్పత్తి, గిరాకీలను పెంచడమెలా అన్నది మోదీ సర్కారు ముందున్న సవాలు. లాక్‌ డౌన్‌ కాలంలో వచ్చిపడిన వ్యయభారం నుంచి తేరుకోవడానికి ప్రభుత్వం బ్యాంకుల నుంచి, మార్కెట్‌ నుంచీ కొత్త అప్పులు తీసుకోనుంది. ఈ ఏడాది మొత్తం రూ. 12 లక్షల కోట్ల రుణాలు తీసుకోనున్నట్లు సర్కారు ప్రకటించింది. స్వల్పకాలిక రుణాలు దీనికి అదనం. కొవిడ్‌ తెచ్చిపెట్టిన అనిశ్చిత వాతావరణంలో బ్యాంకులు వ్యాపారాలకు, పరిశ్రమలకు రుణమివ్వడానికి వెనుకాడుతున్నాయి. దీనికి బదులు తమ వద్ద ఉన్న నిధులను రిజర్వు బ్యాంకువద్ద అట్టిపెట్టడమే భద్రమని భావిస్తున్నాయి. ఈ వాతావరణం వల్లనే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మే 22 వరకు వ్యాపారాలకు రూ. 1.35 లక్షల కోట్లు తక్కువ రుణాలిచ్చాయి. అదే ప్రభుత్వానికి రూ. 4 లక్షల కోట్లు ఎక్కువ రుణాలిచ్చాయి. ఇవి కాకుండా లాక్‌ డౌన్‌ మొదలైనప్పటి నుంచి మరో రూ. 3 లక్షల కోట్లను రిజర్వు బ్యాంకు వద్ద ఉంచాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లను కొనడానికే తమ దగ్గరున్న మొత్తాలను బ్యాంకులు వెచ్చిస్తున్నందువల్ల- ప్రైవేటు రంగానికి రుణాలివ్వడానికి డబ్బేమీ ఉండటం లేదు. రుణం దొరక్కపోతే ప్రైవేటు సంస్థలు, వాటితోపాటు ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేవు. అదే జరిగితే విదేశీ సంస్థాగత మదుపరి సంస్థ (ఎఫ్‌.ఐ.ఐ.)లు భారత్‌ నుంచి తమ పెట్టుబడులను విదేశాలకు తరలించుకుపోతాయి. దాంతో మన ఆర్థిక రథం మరింత కుంటువడుతుంది. ధనిక దేశాల బాండ్లు సున్నా శాతం వడ్డీ ఇస్తుండగా భారత ప్రభుత్వ బాండ్లు 7 శాతం వరకు ఇస్తున్నాయి. అయినా కూడా ఎఫ్‌.ఐ.ఐ.లు మన దగ్గర కొన్న బాండ్లను ఎందుకు వదిలించుకోవాలని చూస్తున్నాయన్నది ప్రశ్న. ఇదే ధోరణి కొనసాగితే పర్యాటకం, ప్రవాస భారతీయుల జమలు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది.

కేంద్రం, రాష్ట్రాలు ప్రజారోగ్యంపైన, మౌలిక వసతులపైనా వ్యయాలను పెంచాలి. ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉన్న డబ్బంతా ఖర్చుచేస్తుంటే, పై కీలక రంగాలకు నిధులు కరవవుతాయి. ప్రపంచమంతా కాలుష్య కారక బొగ్గును వదలి సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరులకు మళ్లుతుంటే- భారత్‌ బొగ్గుపరిశ్రమపై పెట్టుబడులు పెంచుతానంటోంది. ఉద్దీపన ప్యాకేజీలో ఇందుకు తగిన నిధులు ప్రకటించారు. హరిత ఆర్థిక వ్యవస్థ స్థాపనకు ఇది ఎంతమాత్రమూ ఉపకరించదు. చైనా హైటెక్‌ రంగాలపై భారీ పెట్టుబడులు పెడుతూ అంతర్జాతీయ సరఫరా గొలుసులను ఆకర్షించి, ప్రపంచంలో మేటి దేశాలతో పోటీపడే స్థాయికి ఎదిగింది. భారతదేశం ఈ అనుభవం నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది.

ఆశలు ఆవిరి...

కరోనా తెచ్చిపెట్టిన కొవిడ్‌ వ్యాధి ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటుందనే ఆశలపై నీళ్ళు చల్లింది. రాబోయే రెండేళ్ల వరకు ఆర్థికంగా కోలుకుంటామనే ఆశ లేకుండా పోయింది. లాక్‌డౌన్‌ తరవాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ప్రభుత్వం పేరుకు రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినా, వాస్తవ కేటాయింపులు జీడీపీలో రెండు శాతాన్ని మించవని కొందరు నిపుణుల అంచనా. ఈ ప్యాకేజీలో చెప్పుకోదగిన అంశాలేమంటే- వ్యవసాయ సంస్కరణలు, బొగ్గు రవాణాపై పెట్టుబడులు. సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికీ ప్రయోజనాల్ని ఉద్దేశించారు. లాక్‌డౌన్‌ కాలంలో ముందనుకున్న ఆదాయవ్యయ లెక్కలన్నీ తప్పిపోయాయి. ఆర్థిక రథం దశదిశ ఏమిటో అగమ్యగోచరమైంది. సవరించిన అంచనాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం మొత్తం ఆదాయం రూ.26.54 లక్షల కోట్లు. అందులో పన్నుల ద్వారా రూ.21.63 లక్షల కోట్లు సమకూరాయి. కస్టమ్స్‌ సుంకాల వాటా రూ.1.25 లక్షల కోట్లయితే, ఎక్సైజు సుంకాల వాటా రూ.2.48 లక్షల కోట్లు. ఈ ఏడాది కస్టమ్స్‌, ఎక్సైజు సుంకాలు మినహా ఇతర రకాల పన్ను వసూళ్లు పడిపోవడం తథ్యం. పెట్రోలియం ఉత్పత్తులపై భారీగా పన్నులు వేసి ఆదాయ లోటు భర్తీ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నందువల్ల, ఇతర రంగాల్లో గిరాకీపై తప్పక ప్రతికూల ప్రభావం పడుతుంది.

- డాక్టర్​ ఎస్​. అనంత్​, ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు

ఇదీ చూడండి: 'ఆరోగ్య సేవలకు ఆటంకం లేకుండా కొవిడ్​ టీకా పంపిణీ'

ABOUT THE AUTHOR

...view details