కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛ భారత్ (గ్రామీణ్) రెండో దశను ప్రారంభించింది. ఇందులో భాగంగా మరుగుదొడ్డి వాడకంతోపాటు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కుళ్ళిపోయే, కుళ్ళిపోని ఘన వ్యర్థాలు, మురుగు నీరు, మలంతోకూడిన బురద... తదితరాల సమర్థ నిర్వహణ ద్వారా పరిసరాల్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది- బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్ ప్లస్) (ODF Plus) గ్రామాలను సాకారం చేయాలన్నది లక్ష్యం. 2024-25 వరకు ఓడీఎఫ్ ప్లస్ లక్ష్యసాధన కోసం చెత్తను వేరుచేసే షెడ్లు, కంపోస్ట్, ఇంకుడు గుంతల నిర్మాణంతో పాటు వ్యర్థాల నిర్వహణకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామీణ స్థానిక సంస్థలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర నిధులను పారిశుద్ధ్యానికి వెచ్చిస్తున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పారిశుద్ధ్య లోపమే పెద్ద సమస్య. 1954లో కేంద్రం మొదటి పంచవర్ష ప్రణాళికలో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో తొలి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టింది. 1981-90 అంతర్జాతీయ తాగునీరు, పారిశుద్ధ్య దశాబ్దం సందర్భంగా గ్రామాల్లో పరిశుభ్రత పెంపునకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచి, మహిళల గౌరవానికి గోప్యతకు రక్షణ కల్పించాలనే ధ్యేయంతో 1986లో కేంద్ర గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలే పారిశుద్ధ్య అవసరాన్ని గుర్తించి మానవ వనరులను, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలంటూ సంపూర్ణ పారిశుద్ధ్య ప్రచార కార్యక్రమాన్ని 1999లో అమలు చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణాలను సొంతంగా చేపట్టేలా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నగదు ప్రోత్సాహకాలను అందించినా సత్ఫలితాలు రాలేదు. సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని సాధించిన గ్రామాలకు పురస్కారాలిచ్చి ప్రోత్సహించేందుకు కేంద్రం 2003లో నిర్మల్ గ్రామ పురస్కార్‌ను (Nirmal Gram Puraskar) ప్రారంభించింది. పారిశుద్ధ్య కల్పనలో మెరుగైన పనితీరు కనబరచిన గ్రామ పంచాయతీలకు నగదు పురస్కారాలను అందించినా ఆశాజనకమైన ఫలితాలు రాలేదు. గ్రామీణ ప్రజలందరికీ త్వరితగతిన పారిశుద్ధ్య సౌకర్యాల్ని అందించి, పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దాలని 2012లో నిర్మల్ భారత్ అభియాన్ కార్యక్రమానికి కేంద్రం అంకురార్పణ చేసింది. నిధుల కొరతను తీర్చడానికి దాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రోత్సాహకంగా ఇచ్చే నగదు మొత్తాన్ని పెంచారు. మరుగుదొడ్ల నిర్మాణంపై అంతగా దృష్టి సారించకపోవడం, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చే కార్యక్రమాలు చేపట్టకపోవడం, సమన్వయలేమి, ప్రణాళికారాహిత్యం, ప్రజా భాగస్వామ్య లోపం వంటి కారణాలతో అదీ అంతగా ప్రభావం చూపలేదు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ గ్రామీణ పారిశుద్ధ్య ఆరోగ్య వ్యూహానికి (2012-2022) అనుగుణంగా స్వచ్ఛ భారత్‌ను (Swachh Bharat Mission) అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. సంపూర్ణ పారిశుద్ధ్యంతో స్వచ్ఛత దిశగా పయనించాలంటూ 2014 అక్టోబర్ రెండున స్వచ్ఛభారత్ మిషన్(Swachh Bharat Mission) (గ్రామీణ్)ను ప్రారంభించింది. స్వచ్ఛభారత్ ద్వారా గ్రామాల్లో పది కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. ఫలితంగా సుమారు 55 కోట్ల మంది బహిరంగ మలమూత్ర విసర్జన అలవాటును వీడినట్లు అంచనా. రెండున్నర లక్షల పైచిలుకు గ్రామ పంచాయతీలు బహిరంగ మలవిసర్జన రహితం(ఓడీఎఫ్)గా ప్రకటించుకున్నాయి. స్వచ్ఛభారత్ (Swachh Bharat Mission) ప్రారంభించే నాటికి దేశంలో పారిశుద్ధ్య వసతులు 38.7 శాతం మాత్రమే. 2019 నాటికి అవి 100శాతానికి చేరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి 2019 అక్టోబర్ వరకు స్వచ్ఛభారత్ అమలుతో దేశంలో మూడులక్షల మరణాలు నివారించగలిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ మదింపు వేసింది.