కదనరంగంలో కనురెప్ప పాటులో జయాపజయాలు మారిపోతుంటాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ వైరిపక్షంపై దాడి చేసే సమయానికి చేతుల్లో ఆయుధాలు మొరాయిస్తే- సైనికులకు అది ప్రాణాంతకమే అవుతుంది. భారత దళాలు కొన్నేళ్లుగా ఒక రైఫిల్‌తో అటువంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నాయి. అయినా, దాన్ని మార్చి భద్రతా బలగాలకు సమర్థమైన ప్రాథమిక ఆయుధాన్ని సమకూర్చడంపై దశాబ్ద కాలంగా ప్రభుత్వాలు జాప్యం చేస్తూ వచ్చాయి. చివరికి చైనా రూపంలో శత్రువు వచ్చి ముంగిట మోహరించడంతో కొత్త రైఫిళ్ల సమీకరణ ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేశారు. రష్యా నుంచి ఆధునిక ఏకే-203(ak-203 rifle) తుపాకుల అత్యవసర కొనుగోలుకు తాజాగా ఒప్పందం కుదిరింది. దాదాపు 70 వేల తుపాకులను దిగుమతి చేసుకోవచ్చని తెలుస్తోంది.
ఇన్సాస్‌లతో ఇక్కట్లు
భారత సైన్యం, పారామిలిటరీ, కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసు విభాగాలు 1998 నుంచి స్వదేశీ ఇన్సాస్ రైఫిల్‌ను వాడుతున్నాయి. డీఆర్‌డీఓ పరిధిలోని ఆయుధ పరిశోధన, అభివృద్ధి సంస్థ(ఏఆర్‌డీఈ) రూపొందించిన దీన్ని ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(ఓఎఫ్‌బీ) ఉత్పత్తి చేసింది. ఈ తుపాకీతో కార్గిల్ యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన సైన్యం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఉత్పత్తిలో నాణ్యత లోపించడంతో అతిశీతల వాతావరణంలో పనిచేయకపోవడం, ప్లాస్టిక్ కాట్రిడ్జిలు(తూటాలుంచే పెట్టెలు) పగిలిపోవడం, దానంతటకదే యాంత్రిక(ఆటొమేటిక్) మోడ్‌లోకి వెళ్ళిపోయి తూటాలను వెదజల్లడం, కాల్పులు జరిపే సమయంలో రైఫిల్‌లోంచి చమురు వెలువడి సైనికుల కళ్లలో పడటం వంటి సమస్యలు తలెత్తాయి.
ఇండియా ఈ తుపాకులను నేపాల్, భూటాన్, స్విట్జర్లాండ్‌లకూ ఎగుమతి చేసింది. నేపాల్ సైనిక స్థావరంపై 2005లో మావోలు దాడిచేశారు. ఆ సమయంలో సైనికుల దగ్గరి ఇన్సాస్‌లు మొరాయించాయి. దాంతో మావోయిస్టులు పైచేయి సాధించి 43 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఆ తరవాత ఇన్సాస్‌పై నేపాల్ బ్రిగేడియర్ జనరల్ దీపక్ గురుంగ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆయుధం తమ అవసరాలు తీర్చలేదని భారత సైన్యం సైతం 2010లో తేల్చిచెప్పేసింది. ఇన్సాస్‌లో మార్పులు చేయడానికి ప్రయత్నించినా విజయవంతం కాలేదు. ఆ క్రమంలోనే కశ్మీర్‌లో నిత్యం ఉగ్రవాదులతో పోరాడే రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు ఇన్సాస్ స్థానంలో ఏకే-47ను ఎంచుకొన్నాయి. భూమిలో కొన్నాళ్ల పాటు పాతిపెట్టినా, బురదలోంచి తీసి వాడినా ఇవి సమర్థంగా పనిచేస్తాయి. అత్యంత శీతల ప్రాంతాల్లోనూ మొరాయించవనే పేరుంది. అందుకే బలగాలు వీటికి ప్రాధాన్యమిస్తున్నాయి.
వాస్తవానికి దూరంగా..
ఇన్సాస్‌ల స్థానంలో 7.5 లక్షల మల్టీ క్యాలిబర్ రైఫిళ్లను సమకూర్చుకునేందుకు ఇండియా 2014లో గ్లోబల్ టెండర్లు పిలిచింది. సైన్యం అవసరాలకు తగిన ప్రతిపాదనలతో ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. సైన్యం కోరుకుంటున్న రైఫిల్ శక్తిసామర్థ్యాలు వాస్తవదూరంగా ఉన్నాయని నాటి సైన్యాధిపతి బిక్రమ్‌సింగ్ సమక్షంలోనే రక్షణ మంత్రి మనోహర్ పారేకర్ విమర్శించారు. మరుసటి సంవత్సరం టెండర్లను రద్దు చేశారు. ఇన్సాస్‌లను క్రమంగా తొలగించాలని మరో మూడేళ్లకు ప్రభుత్వం నిర్ణయించింది.
త్రివిధ దళాలకు కొత్త తుపాకులు, తేలికపాటి మెషీన్‌గన్‌లను అందించడానికి రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వాటిలో కొన్నింటిని నేరుగా దిగుమతి చేసుకొని, మిగిలినవి దేశీయంగా తయారు చేయించాలని తలపోశారు. రష్యా 2018లో వినియోగంలోకి తెచ్చిన ఏకే-203 రైఫిల్‌ను ఎంపిక చేశారు. ఈ తుపాకుల్లో 7.62 ఎం.ఎం.క్యాలిబర్ తూటాలను వినియోగిస్తారు. ఒక్క తూటాతోనే అవతలి వ్యక్తిని నేలకూల్చవచ్చు. అమెరికా నుంచి నిరుడు కొనుగోలు చేసిన సిగ్‌సావర్ 716 రైఫిళ్లలోను స్వల్పమార్పులతో ఇటువంటి తూటాలనే వాడుతున్నారు. ఇన్సాస్‌లో వాడే 5.56 ఎం.ఎం. తూటాలు అంత ప్రాణాంతకమైనవి కావు. కశ్మీర్‌లో మన బలగాలతో తలపడుతూ గాయపడిన ముష్కరులు- అలాగే ఎదురుదాడికి దిగిన సందర్భాలున్నాయి. ఇన్సాస్‌లపై భారత బలగాల అయిష్టతకు ఇదీ ఒక కారణమే!