తెలంగాణ

telangana

ETV Bharat / opinion

భూతాపంపై పోరులో ముందంజ - How to reduce Global Warming

2015 పారిస్​ వాతావరణ సదస్సులో భూతాపాన్ని తగ్గించాలని ప్రకటించినా.. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా, చైనాలూ ఈ లక్ష్యసాధనలో వెనకబడేఉన్నాయి. భారత్​ ఒక్కటే వాతావరణ వైపరీత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తన వంతు ప్రయత్నాలు సాగిస్తోంది. 2030 ఏడాదిలోగా తన కర్బన ఉద్గారాలను 33-35 శాతం మేర తగ్గిస్తానని వాగ్దానం చేసింది భారత్​. దాన్ని నెరవేర్చడానికి ఇంధన, రవాణా, పారిశ్రామిక, వ్యర్థాల నిర్మూలన, అటవీ రంగాల్లో తగిన చర్యలు తీసుకొంటోందని 'క్లైమేట్‌ ట్రాన్స్‌పరెన్సీ' సంస్థ నివేదికలు వెల్లడించాయి.

GLOBAL WARMING
భూతాపంపై పోరులో ముందంజ

By

Published : Dec 13, 2020, 8:28 AM IST

భూతాప నివారణకు కర్బన ఉద్గారాలను కట్టడి చేయాలని 2015 పారిస్‌ వాతావరణ సదస్సులో ప్రపంచ దేశాలు కట్టుబాటు ప్రకటించినా, వాస్తవంలో పరిస్థితి... ఆర్భాటం జాస్తి ఆచరణ నాస్తిగా తయారైంది. అగ్రరాజ్యం అమెరికా, తదుపరి అగ్రరాజ్యంగా ఎదగాలనుకుంటున్న చైనాతో సహా జీ20 దేశాలన్నీ ఈ లక్ష్యసాధనలో చతికిలపడ్డాయి, భారత్‌ ఒక్కటే వాతావరణ వైపరీత్యాలకు ముకుతాడు వేయడానికి పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ఈ శతాబ్ది చివరకు భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్న పారిస్‌ లక్ష్యానికి ప్రధాన దేశాలు ఆమడ దూరంలోనే ఉండిపోగా, భారత్‌ భూతాప పెరుగుదలను రెండు డిగ్రీల వద్ద నిలిపివేసే స్థాయిని అందుకొంది. 14 అంతర్జాతీయ, ప్రభుత్వేతర పరిశోధన సంస్థలతో ఏర్పడిన 'క్లైమేట్‌ ట్రాన్స్‌పరెన్సీ' సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ అంశాన్ని వెల్లడించింది. వాతావరణ మార్పుల నివారణలో భారత్‌ అందరికన్నా ముందున్నదని ప్రశంసించింది. 2030 సంవత్సరానికల్లా తన కర్బన ఉద్గారాలను 33-35 శాతం మేర తగ్గిస్తానని వాగ్దానం చేసిన భారత్‌- దాన్ని నెరవేర్చడానికి ఇంధన, రవాణా, పారిశ్రామిక, వ్యర్థాల నిర్మూలన, అటవీ రంగాల్లో తగిన చర్యలు తీసుకొంటోందని ఆ నివేదిక పేర్కొంది.

ప్రధాన దేశాల పెడసరితనం

అమెరికా, చైనా, ఐరోపా సమాఖ్యల్లో పారిస్‌ ఒప్పంద లక్ష్యాలను అందుకోవాలన్న చిత్తశుద్ధి లోపించింది; అందువల్ల 2100 కల్లా భూతాపం 2.7 డిగ్రీల సెల్సియస్‌ను మించి పెరిగే ప్రమాదం ఉందని క్లైమేట్‌ ట్రాన్స్‌పరెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. పారిశ్రామిక యుగానికి ముందునాళ్లతో పోలిస్తే భూ ఉష్ణోగ్రత ఇప్పటికే 1.1 డిగ్రీలు పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాదిరిగా పారిస్‌ లక్ష్యాలను అందరూ తుంగలో తొక్కితే భూతాపం 2.9 డిగ్రీలు పెరుగుతుందని అంచనా. కర్బన ఉద్గారాల కట్టడికి చైనా తన వంతు చర్యలను తీసుకొంటున్నందువల్ల వాస్తవ పెరుగుదల 2.7 డిగ్రీలు ఉండవచ్చు. చైనా 2060కల్లా కర్బన ఉద్గారాలను నిర్మూలించాలని ఆశిస్తున్నా, అది భూతాప వృద్ధిని 1.5 డిగ్రీలకు పరిమితం చేయడానికి ఉపకరించదు. అసలు 1.5 డిగ్రీల లక్ష్యాన్ని అందుకున్నాక కూడా అతివృష్టి, అనావృష్టి, తీవ్ర తుపానుల బెడద తొలగిపోదు. పునరుత్పాదక, కాలుష్యరహిత ఇంధన వినియోగంపై ప్రపంచం శ్రద్ధ కొనసాగిస్తూనే ఉండాలి.

మోదీ మంత్రం ఫలించేనా?

ఇప్పటి వరకు ఏ దేశం కూడా 2100కల్లా భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తామని ప్రకటించకపోవడం విచారకరం. ప్రస్తుతానికి 2 డిగ్రీల వరకు వచ్చిన భారత్‌- లక్ష్యసాధనకు చేయాల్సింది ఎంతో ఉంది. కేంద్ర పర్యావరణ శాఖ పారిస్‌ వాతావరణ ఒప్పందాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి డిసెంబరు మొదటి వారంలో 14 మంత్రిత్వ శాఖల సీనియర్‌ అధికారులతో ఉన్నత స్థాయి సంఘాన్ని నెలకొల్పింది. ఈ సంఘం పారిస్‌ ఒప్పంద లక్ష్యాలను అందుకోవడానికి భారత్‌ 2015లో సమర్పించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికను నెరవేర్చడానికి కృషి సాగిస్తుంది. 2005నాటితో పోలిస్తే 2030కల్లా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో కర్బన ఉద్గారాలను 33-35శాతం మేర తగ్గించాలని ఆ ప్రణాళిక ఉద్దేశిస్తోంది. అదే సంవత్సరానికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యంలో 40 శాతాన్ని పునరుత్పాదక ఇంధనాల నుంచి సాధించాలని, అదనంగా 250 కోట్ల నుంచి 300 కోట్ల టన్నుల వరకు బొగ్గుపులుసు వాయువును పీల్చుకోగల స్థాయిలో అడవులను విస్తరించాలని లక్షిస్తోంది. అదనపు అడవుల పెంపకంలో భారత్‌ వెనకబడి ఉన్నమాట నిజమే కానీ, 2030కల్లా 2.6 కోట్ల హెక్టార్ల బంజరు భూములను అడవులుగా మార్చబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది నవంబరు జీ20 సదస్సులో ప్రకటించారు. 2022కల్లా పునరుత్పాదక ఇంధనాల ద్వారా 175 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి, 2030 కల్లా దీన్ని 450 గిగావాట్లకు పెంచదలచామనీ ప్రకటించారు.

పటిష్ఠ ప్రణాళిక

పారిస్‌ లక్ష్యాల సాధనలో భారత్‌ పురోగతి సాధించడం వెనక పటిష్ఠ ప్రణాళిక, కార్యాచరణ ఉన్నాయి. ఎల్‌ఈడీ బల్బుల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఏటా 3.8 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించనుంది. ఎనిమిది కోట్ల గృహాలకు ఉజ్ఞ్వల పథకం కింద వంట గ్యాస్‌ సిలిండర్లను అందించడమూ ఉద్గారాలకు అడ్డుకట్ట వేస్తుంది. మెట్రో రైళ్లు, కాలువల ద్వారా రవాణాను ప్రోత్సహించడం కూడా భూతాప నివారణకు తోడ్పడుతుంది. 2018నాటి జాతీయ విద్యుత్తు విధానం (ఎన్‌ఈపీ) పునరుత్పాదక ఇంధనాల నుంచి విద్యుదుత్పాదనకు ప్రాధాన్యమిచ్చింది. ఆ ఏడాది సెప్టెంబరునాటికి మనదేశంలో మొత్తం స్థాపిత విద్యుత్‌ సామర్థ్యంలో 21 శాతం (75 గిగావాట్లు) పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయినదే. 2019 సెప్టెంబరు నాటికి ఈ వాటా 37 శాతానికి పెరిగింది. కనుక ఈ వాటాను 2030కల్లా 40 శాతానికి పెంచాలన్న లక్ష్యం అత్యంత సులభసాధ్యం. 2017లో 67 శాతం విద్యుత్తు ఉద్గార కారక శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి అయితే, 2027కల్లా ఈ వాటాను 43 శాతానికి తగ్గించాలని ఎన్‌ఈపీ నిర్దేశించింది. తదనుగుణంగా పునరుత్పాదక ఇంధనాల నుంచి విద్యుదుత్పాదన ఏటేటా వృద్ధి చెందుతోంది. 2030కల్లా మొత్తం విద్యుదుత్పాదన సామర్థ్యంలో 65 శాతానికి పునరుత్పాదక ఇంధన వనరులే కారణం కానున్నాయి.

ముందుంజలో భారత్​

చైనా, అమెరికా, ఐరోపా సమాఖ్యలకన్నా భారత్‌ చాలా తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరిస్తూ, వాటిని తగ్గించడంలో అందరికన్నా ముందున్నది. అలాగని పరిపూర్ణ విజయం సాధించామని మురిసిపోవడానికి వీల్లేదు. ఇంకా సాధించాల్సినదెంతో ఉంది. కర్బన ఉద్గారాల కట్టడిలో వైఫల్యమే ప్రపంచమంతటా తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను పెంచుతోంది. 1999-2018 మధ్య జీ20 దేశాల్లో ప్రకృతి ఉత్పాతాల వల్ల కలిగిన నష్టం భారీ స్థాయిలో ఉన్నట్లు క్లైమేట్‌ ట్రాన్స్‌పరెన్సీ సంస్థ అంచనా. భూతాపాన్ని అదుపులో పెట్టకపోతే ప్రపంచానికి ప్రాణ, ధన నష్టాలు పెరిగిపోతూనే ఉంటాయి. బుద్ధిజీవి అయిన మానవుడు తనలో వివేకాన్ని మేల్కొలిపి ముందుకుసాగాలి.

భూతాపంపై పోరులో ముందంజ

ముందున్న సవాళ్లెన్నో...

2022కల్లా జల విద్యుత్తు కాకుండా, ఇతర పునరుత్పాదక ఇంధనాల నుంచి 175 గిగావాట్ల విద్యుదుత్పాదన లక్ష్యం నెరవేరాలంటే- భారత్‌ మరిన్ని వ్యయప్రయాసలకు సిద్ధం కావాలి. ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలిసికట్టుగా పెట్టుబడులు పెట్టి శ్రమించాలి. అడవుల విస్తీర్ణం పెంచడానికి ఉద్దేశించిన ‘గ్రీన్‌ ఇండియా’ కార్యక్రమం చాలినన్ని నిధులు లేక కునారిల్లుతోంది. రూ.60వేల కోట్లతో పదేళ్లలో అడవుల పెంపకం, పునరుద్ధరణకు ఉద్దేశించిన ఈ పథకానికి కనీసం వంద కోట్ల రూపాయలైనా వెచ్చించలేదని 2017-18లో పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. భూతాప కట్టడిలో పురోగతి సాధిస్తున్నట్లు భారత్‌ ప్రశంసలు అందుకోవడం బాగానే ఉన్నా, దేశ రాజధాని దిల్లీ తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవ్వడం ఏమాత్రం బాగాలేదు. మిగతా నగరాల పరిస్థితీ ఏమంత మెరుగ్గా లేదు!

- కైజర్‌ అడపా, రచయిత

ఇదీ చదవండి:అన్నదాతకే ఆకలి తీర్చిన చిన్నారి

ABOUT THE AUTHOR

...view details