పరాయి పాలనకు, పీడనకు చరమగీతం పాడి దేశమాతకు రాజకీయ స్వాతంత్య్రం సాధించిన మహోద్యమ సారథ్యం మహాత్మాగాంధీది అయితే, లైసెన్స్ పర్మిట్ రాజ్ చెరలో మగ్గుతున్న జాతికి ఆర్థిక స్వేచ్ఛ ప్రసాదించి భారతావని స్థితిని గతిని మార్చిన ధన్యజీవి- మన పీవీ! దేశం నాకేమిచ్చిందన్నది కాదు, దేశానికి నువ్వేం చేశావన్నదే ప్రధానమన్న జాన్ ఎఫ్ కెనెడీ మాటే గీటురాయి అనుకుంటే- కొత్త సహస్రాబ్ది సవాళ్లకు దీటుగా ఇండియా దశ దిశలను మార్చి, ఆర్థిక సంస్కరణలే దిక్సూచిగా వృద్ధిరేట్లకు కొత్త రెక్కలు తొడిగిన పీవీ, భరతమాత రుణం తీర్చుకొన్న కర్మయోగి!.
రాజనీతిజ్ఞత..
మూడు దశాబ్దాల క్రితం 70 ఏళ్ల వయసులో రాజకీయ వానప్రస్థానానికి సిద్ధమైన పీవీ ఇదే నెలలో దేశ తొమ్మిదో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. తమిళ పులుల రక్తదాహానికి రాజీవ్‌గాంధీ బలైపోయి శతాధిక వర్షీయసి కాంగ్రెస్ నిశ్చేతనమైన వేళ, దేశార్థికమూ దివాలా అంచులకు చేరిన సమయంలో పీవీ దార్శనికతే చుక్కానిగా ఇండియా తెరిపిన పడింది. పీవీ జమానాకు ముందు రెండు, దరిమిలా నాలుగు మైనారిటీ ప్రభుత్వాలు అర్ధాంతరంగా కుప్పకూలిన వాస్తవాన్ని గమనిస్తే, అంతర్గత ఆటుపోట్లను ఎదుర్కొంటూ సంఖ్యాబలం లేని సర్కారుతోనే సంస్కరణల తెరచాపలెత్తి దేశాన్ని విజయతీరాలకు చేర్చడంలో పాములపర్తి వారి రాజనీతిజ్ఞత అబ్బురపరుస్తుంది. నాడు ద్రవ్యలోటు స్థూలదేశీయోత్పత్తిలో తొమ్మిది శాతానికి, ద్రవ్యోల్బణం 16 శాతానికి ఎగబాకి, విదేశ మారక ద్రవ్య నిల్వలు అడుగంటి, బంగారం కుదువ పెట్టాల్సిన దౌర్భాగ్యస్థితి నుంచి- అయిదేళ్ల వ్యవధిలో ఏడు శాతం వృద్ధి రేటు నమోదు చేసేలా దేశ పథ గమనాన్ని తీర్చిదిద్దింది పీవీయే! ఆర్థిక వేత్త మన్‌మోహన్ సింగ్‌ను విత్తమంత్రిగా నియమించి, రాజకీయ ఒత్తిళ్ల నుంచి రక్షణ కల్పించి పీవీ కనబరచిన దార్శనికత వల్లే ఇండియా నేడు ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తిగా, అత్యధిక విదేశీ నిల్వలుగల (60 వేల కోట్ల డాలర్ల) నాలుగో దేశంగా విరాజిల్లుతోంది. భారతావని భాగ్యరేఖల్ని ఇలా తీర్చి దిద్దిన ఆ తెలుగుఠీవికి శతవసంతాల వేళ ఇది!
సంస్కరణాభిలాష..
సమస్య మూలాలకు సంస్కరణల చికిత్స చేయడంలో ఆది నుంచీ పీవీది అందెవేసిన చేయి!. ఉమ్మడి రాష్ట్రంలో న్యాయశాఖ మంత్రిగా అనంతపురంలో ఆరు బయలు జైలు, ఆరోగ్య మంత్రిగా వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై వేటు, దేవాదాయ శాఖ చూసేటప్పుడు కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడం, విద్యామంత్రిగా ఆదర్శ పాఠశాలలకు శ్రీకారం చుట్టడం- పీవీ సంస్కరణాభిలాషకు అద్దం పట్టాయి. అయిదు దశాబ్దాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూపరిమితి చట్టం తెచ్చి తన సొంత భూమి 500 ఎకరాల్ని ధారాదత్తం చేసిన పీవీ- స్వీయ ఆదర్శానికి కట్టుబాటు చాటిన వితరణ శీలి!.