తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఆరోగ్య రంగంలో సమగ్ర ప్రక్షాళనకు నాంది! - కరోనా వైరస్ తాజా వార్త

కరోనా వైరస్​ వచ్చి మన వ్యవస్థల్లో ఉన్న లోపాలను బయటపెట్టింది. ఇప్పుడు దేశాధినేతలు, విధాన నిర్ణేతలు పటిష్ఠమైన ఆరోగ్య పరిరక్షణ వైపు అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ ప్రజారోగ్య వ్యవస్థకు సాంకేతికతను మిళితం చేసి కొత్త రూపు ఇస్తే అర్థవంతమైన ఫలితాలు రాబట్టవచ్చన్నది వాస్తవం. ఇలాంటి ఆరోగ్య విపత్తులు మున్ముందు మరిన్ని పొంచి ఉండే ప్రమాదం ఉందని, కనుక ఆరోగ్య రక్షణ కవచాలతో సిద్ధంగా ఉండాలని ప్రజారోగ్య పరిశోధకులు చెబుతున్నారు.

Implementation outcomes of the national scale up of chlorhexidine cord cleansing in public health system
ఆరోగ్య రంగంలో సమగ్ర ప్రక్షాళనకు నాంది!

By

Published : Jul 4, 2020, 8:44 AM IST

కరోనా సంక్షోభం దేశాధినేతలను, విధాన నిర్ణేతలను సరికొత్తగా ఆలోచించేలా ప్రేరేపించింది. సంక్రామిక వ్యాధుల విజృంభణను దీటుగా ఎదుర్కోవాలంటే పటిష్ఠమైన ఆరోగ్య పరిరక్షణ అవసరమని ప్రపంచానికి బోధపడింది. సంప్రదాయ ప్రజారోగ్య వ్యవస్థకు సాంకేతికతను మిళితం చేసి కొత్త రూపు ఇస్తే అర్థవంతమైన ఫలితాలు రాబట్టవచ్చనేది ఇప్పటికే రుజువైన వాస్తవం. నాణ్యతలో రాజీ లేకుండా ప్రజలకు చౌకగా, సమర్థంగా ఆరోగ్య సేవల్ని అందించేందుకు ప్రపంచ దేశాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇలాంటి ఆరోగ్య విపత్తులు మరిన్ని పొంచి ఉన్నాయని, అవి విరుచుకుపడితే పరిస్థితులు మరింత దుర్భరంగా ఉంటాయని, 'ఆరోగ్య రక్షణ కవచాల'తో సంసిద్ధంగా ఉండాలని డాక్టర్‌ ఫిలిప్‌ మాథ్యూవంటి ప్రజారోగ్య పరిశోధకులు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నారు.

వైద్యుల రక్షణకు భరోసా అవసరం

ఆసుపత్రుల్లో సిబ్బందికి, రోగులకు మరింత భద్రత ఉండేలా చూడాలని అర్బన్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త హోవర్ట్‌ గ్లెక్‌మాన్‌ సూచిస్తున్నారు. తాము నిర్వహిస్తున్న విధుల మాటున తమకే ప్రమాదం దాగి ఉందన్న యథార్థం తెలిసీ- సంతోషంగా సేవలందించడం వైద్య సిబ్బందికి పెద్ద సవాలు. వారి రక్షణకు పూర్తి భరోసా ఉండేలా చూడాలని సెయింట్‌ లూయిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో సెన్సిటివిటీ డైరెక్టర్‌ టెర్రీ రెబ్‌మాన్‌ అంటున్నారు. ఆరోగ్య వ్యవస్థలో ‘కృత్రిమ మేధస్సు’ పాత్ర ఇక కీలకం కానుంది. డిజిటల్‌ ఆరోగ్యం, చరవాణి వైద్యం వంటి నూతన పోకడలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. డ్రోన్‌లు, రోబోలు ఆరోగ్యపరిరక్షణలో భాగస్వాములుగా మారాయి. వ్యక్తిగత పరిశుభ్రత, ముఖ కవచధారణ, సామాజిక దూరం వంటి అలవాట్ల ఆవశ్యకతపై ప్రచారాన్ని విస్తృతం చేయాలని జాతీయ అలెర్జీ, అంటువ్యాధుల సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ఫాసీ సూచిస్తున్నారు.

వైద్య పరికరాలు తామే ఉత్పత్తి చేసుకోవాలని దిగుమతులపై ఇక ఏ మాత్రం ఆధారపడకూడదని అభివృద్ధి చెందుతున్న దేశాలు భావిస్తున్నాయి. అధునాతన వైద్యం కేవలం అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితం కాకుండా ‘వికేంద్రీకరణ’కు మార్గం సుగమం అవుతుందన్నది వారి అంచనా. టీకాలు, మందులపై పరిశోధనలు క్రియాశీలకంగా మారి వేగాన్ని సంతరించుకున్నాయి. ఆరోగ్య సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో చైనా అన్ని దేశాలకన్నా ముందుంది. ‘ఆరోగ్య చైనా - 2030’ లక్ష్యంతో వ్యాధుల నివారణ, నియంత్రణలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ చికిత్సల పట్లా అదే స్థాయిలో దృష్టి సారించింది. ఆరోగ్య బీమాను మరింత సరళం చేసింది. అమెరికా సైతం ఆరోగ్య, ఆర్థిక, సాంకేతిక రంగాలను సంఘటితపరచి, ఇటువంటి ఉపద్రవాలను సమైక్యంగా ఎదుర్కొనే వ్యూహాలను రచిస్తోంది.

ఆఫ్రికాకు డబ్ల్యూహెచ్ఓ..

ప్రపంచ ప్రజల ఆరోగ్యానికి రక్షకుడి పాత్ర పోషించే డబ్ల్యూహెచ్‌ఓ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యానికి తావు లేకుండా డైరెక్టర్‌ జనరల్‌కు విధి నిర్వహణలో పూర్తి స్వేచ్ఛ ఉండాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రధాన కార్యాలయాన్ని ధనిక దేశాల లోగిలి అయిన ఐరోపా ఖండంలోని జెనీవా నుంచి పేద దేశాల పందిరి అయిన ఆఫ్రికా ఖండానికి మారిస్తే సముచితంగా ఉంటుందన్న సూచనలు వస్తున్నాయి.

ఆయుష్మాన్‌ భారత్‌ పథకం...

ప్రజారోగ్య పరిరక్షణలో ప్రాథమిక వైద్యం అత్యంత కీలకం. దీనికి అగ్రాసనం వేస్తూ పల్లెలు, పట్టణ ప్రజలందరికీ సాంత్వన చేకూరేలా 40,000 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వెల్‌నెస్‌ కేంద్రాలను ఆయుష్మాన్‌ భారత్‌ పథకంకింద ఈ సంవత్సరాంతానికి పూర్తయ్యేలా చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటి ద్వారా సాధారణ వైద్యం, ప్రసూతి, చిన్న పిల్లల వైద్యం, టీకాలు, యోగా, ఆరోగ్య సలహాలు వంటి ప్రాథమిక వైద్య సేవలు 135 కోట్ల దేశ ప్రజలకు మరింత చేరువ అవుతాయని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఆయుష్మాన్‌ భారత్‌ - ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన పథకం కింద మరో 15 వేల వైద్యశాలలు రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో రూపు దిద్దుకోనున్నాయి.

నిధుల పెంపుదలతోనే ధీమా

'మేక్‌ ఇన్‌ ఇండియా' జాతీయ కార్యక్రమం ద్వారా ఆరోగ్య పరికరాల పరిశ్రమలను ఆహ్వానించడం ద్వారా భారత్‌ను ఆరోగ్య పరిశ్రమల కేంద్రంగా మార్చాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు. ఐసీఎంఆర్‌ వేదికగా పలు వైద్య పరిశోధనలను ఇప్పటికే ముమ్మరం చేశారు. వైద్యవిద్యలోనూ ప్రివెంటివ్‌ మెడిసిన్‌, వైరాలజీ, ఎంటమాలజీ వంటి అంశాలకు ప్రాధాన్యత పెంచాలని ఎంసీఐ భావిస్తోంది. నేషనల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ డేటా - 2018 అధ్యయనం ప్రకారం దేశంలో నాలుగు లక్షల మంది వైద్యులు, 30 లక్షల మంది నర్సుల కొరత ఉన్నట్లు తేలింది. సీడీడీఈపీ గణాంకాల ప్రకారం 18.99 లక్షల ఆసుపత్రి పడకలు, 94,000 వెంటిలేటర్స్‌ అవసరం ఉందని తేటతెల్లం అయింది. దేశంలో 2020-21 వార్షిక బడ్జెట్‌లో ప్రజారోగ్యానికి కేటాయింపులు కేవలం రూ.67,484 కోట్లు మాత్రమే. దీన్ని గణనీయంగా పెంచి, నాణ్యతతో కూడిన ఆరోగ్య ప్రమాణాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి. మహమ్మారులు కొత్త శత్రువులుగా రూపాంతరం చెందుతున్న దృష్ట్యా దేశ రక్షణకు కేటాయిస్తున్న బడ్జెట్‌కు దీటుగా ప్రజారోగ్యానికీ నిధుల కేటాయింపులు ఉండాలి. కరోనా రాక మనకు మేల్కొలుపు కావాలి.

- డాక్టర్‌ జెడ్‌.ఎస్‌.శివప్రసాద్‌

(ఏపీ వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్‌)

ABOUT THE AUTHOR

...view details