'యాస్' తుపాను కల్లోలానికి ఒడిశా, పశ్చిమ్ బంగ రాష్ట్రాలు విలవిల్లాడిపోయి నాలుగు నెలలు కాలేదు- బంగాళాఖాతం మీదుగా మరో ఉపద్రవం తీరప్రాంతాన్ని ముంచెత్తింది. ప్రచండ గాలులు, మహోద్ధృత వర్షధారలతో ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో 'గులాబ్' తుపాను విధ్వంసం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు ఆరు జిల్లాల్లో 1.64 లక్షల ఎకరాల్లో పంటలను పొట్టనపెట్టుకొంది. ముందస్తు హెచ్చరికల పుణ్యమా అని ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగినా.. ఒక్క విద్యుత్తు శాఖకే రూ.800 కోట్ల రూపాయల దాకా ఆస్తినష్టం సంభవించింది. ఏడేళ్ల క్రితం విలయ తాండవం చేసిన హుద్‌హుద్ తుపాను తరవాత అంతటి కుంభవృష్టితో విశాఖ నగరం నిలువెల్లా వణికిపోయింది. అతి భారీ వర్షాలతో హైదరాబాద్ సహా తెలంగాణలో పలు ప్రాంతాలు కన్నీటి సంద్రాలయ్యాయి. కొట్టుకుపోయిన కల్వర్టులు, కోసుకుపోయిన రహదారులు, నీటమునిగిన పైరులతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులు తెప్పరిల్లేలా తక్షణ సాయం అందించడం ఎంత కీలకమో.. ప్రకృతి విపత్తులను మరింత మెరుగ్గా ఎదుర్కొనేలా దీర్ఘకాలిక వ్యూహాలపైనా ప్రభుత్వాలు శ్రద్ధపెట్టడం అంతే అవసరం.
ఐదేళ్లలో 30 తుపానులు
గడచిన అయిదేళ్లలో భారత ద్వీపకల్పంపై 30 తుపానులు విరుచుకుపడ్డాయి. 720 నిండు ప్రాణాలను బలితీసుకొన్న ఈ వైపరీత్యాలు- 29.70 లక్షల ఇళ్లను, 1.45 కోట్ల ఎకరాల్లో పంటలను తుడిచిపెట్టేశాయి. వాతావరణ మార్పుల మూలంగా ఆందోళనకర స్థాయిలో ఎగబాకుతున్న హిందూ మహాసముద్ర ఉష్ణోగ్రతలతో తీరప్రాంతాలకు పెనుముప్పు పొంచి ఉందని ఐరాస అంతర ప్రభుత్వాల సంఘం(ఐపీసీసీ) ఇటీవలే హెచ్చరించింది. జాతీయ స్థాయి నుంచి జిల్లాల వరకు సువ్యవస్థితమైన ఏర్పాట్లతో ఉత్పాతాలను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నామని గత నెలలో కేంద్రం పార్లమెంటులో సెలవిచ్చింది. పూర్వ విపత్తుల విశ్లేషణ, భవితకు సన్నద్ధత, ప్రమాద తీవ్రత తగ్గింపు ప్రణాళికల అమలులో ఎక్కడికక్కడ మేటవేసిన సమస్యలు- జనావళికి ఏటా కడగండ్లనే మిగుల్చుతున్నాయన్నది నిష్ఠుర సత్యం!