తెలంగాణ

telangana

ETV Bharat / opinion

దేశాన్ని రక్షించాలంటే.. ఇకనైనా కళ్లు తెరవాలి! - కరోనా టీకా

దశాబ్దాలుగా అమలులో ఉన్న జాతీయ ఉచిత టీకా కార్యక్రమాన్ని కొవిడ్‌ విషయంలో ఎందుకు పక్కన పెట్టారంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు- ప్రస్తుత విధానాన్ని పునఃపరిశీలించాలని కేంద్రానికి ఆదేశించింది. కేంద్రం ఇచ్చినా, రాష్ట్రాలు సమకూర్చినా టీకాల అంతిమ లక్ష్యం ప్రజారోగ్యమేనంటూ, ఆయా రాష్ట్రాలు ఉచితంగా వ్యాక్సిన్లు అందించలేకపోతే నిరుపేదల పరిస్థితేమిటనీ ప్రశ్నించింది. కేంద్రం తెచ్చిన టీకా విధానం రాజ్యాంగం ప్రసాదించిన జీవన హక్కుకు విరుద్ధంగా ఉన్నట్లుందన్న ధర్మాసనం- పునస్సమీక్ష జరగాలంటోంది. కొవిడ్‌ కోరల నుంచి దేశాన్ని రక్షించాలంటే- ప్రభుత్వాలు ఇకనైనా కళ్లు తెరవాలి!

india
దేశం

By

Published : May 5, 2021, 8:51 AM IST

పట్టుమని పక్షం రోజుల్లో 50 లక్షల కొత్త కేసులతో కొవిడ్‌ మహమ్మారి ఇండియాలో మరణమృదంగం మోగిస్తోంది. కరోనా కరకు కోరలకు అత్యధిక సంఖ్యాకులు బలైపోయిన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్‌ తరవాతి స్థానంలో నిలిచిన ఇండియాలో- రోజూ ప్రపంచవ్యాప్త మృతుల్లో మూడోవంతు నమోదవుతున్న ఘోరం గుండెల్ని మెలిపెడుతోంది!

మొదటి దశ ఉద్ధృతి కాస్తంత ఉపశమించిందనగానే కనీస జాగ్రత్తల్నీ గాలికొదిలేసి, విధిగా చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లను అటకెక్కించి నిష్పూచీగా వ్యవహరించిన ప్రభుత్వాల పాపమే కోట్లాది ప్రజల పాలిట నేడు పెను శాపమైంది. పలు ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళిని కాపాడే వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచ దేశాలకే పెద్దన్నగా వెలుగొందుతున్న ఇండియాలో కొవిడ్‌ టీకాలకు కొరత, నేతల హ్రస్వదృష్టి విధానాల ఫలితమనే చెప్పాలి.

అంచెలవారీగా వ్యాక్సిన్‌ లబ్ధిదారుల వయోపరిమితిని సడలిస్తూ వచ్చిన కేంద్రం, 18-45 మధ్యవయస్కుల టీకా బాధ్యత నుంచి వైదొలగడం; వ్యాక్సిన్ల ధరల నిర్ధారణ అవకాశాన్ని ప్రైవేటు కంపెనీలకు, సేకరణ పంపిణీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టడం ప్రమాదకరమని ప్రజారోగ్య రంగ నిపుణులెందరో మొత్తుకొంటున్నారు. దశాబ్దాలుగా అమలులో ఉన్న జాతీయ ఉచిత టీకా కార్యక్రమాన్ని కొవిడ్‌ విషయంలో ఎందుకు పక్కన పెట్టారంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు- ప్రస్తుత విధానాన్ని పునఃపరిశీలించాలని కేంద్రానికి గట్టిగా సూచించింది. కేంద్రం ఇచ్చినా, రాష్ట్రాలు సమకూర్చినా టీకాల అంతిమ లక్ష్యం ప్రజారోగ్యమేనంటూ, ఆయా రాష్ట్రాలు ఉచితంగా వ్యాక్సిన్లు అందించలేకపోతే నిరుపేదల పరిస్థితేమిటనీ ప్రశ్నించింది. కేంద్రం తెచ్చిన టీకా విధానం రాజ్యాంగం ప్రసాదించిన జీవన హక్కుకు విరుద్ధంగా ఉన్నట్లుందన్న ధర్మాసనం- పునస్సమీక్ష జరగాలంటోంది. కొవిడ్‌ కోరల నుంచి దేశాన్ని రక్షించాలంటే- ప్రభుత్వాలు ఇకనైనా కళ్లు తెరవాలి!

కొవిడ్‌ రోగుల కోసం దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆధ్వర్యంలోని రెండువేల పైచిలుకు ఆసుపత్రుల్లో 4.68 లక్షల పడకలున్నట్లు మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. చికిత్సల కోసం మూడంచెల వ్యవస్థల్ని ఏర్పాటు చేశామంటున్నా- దాదాపు 35 లక్షల క్రియాశీల కేసుల తాకిడితో ప్రజారోగ్య రంగమే కుదేలైపోతోంది. ఆసుపత్రుల్లో పడకల్లేక, ఆక్సిజన్‌ అందుబాటులోకి రాక, ప్రాణాధార ఔషధాలూ దొరకక నిస్సహాయంగా వేలమంది అభాగ్యులు నేలరాలిపోవడం- నిశ్చయంగా మానవ కల్పిత మహా విషాదం. కరోనాపై హాస్యాస్పద వ్యాఖ్యలతో వ్యక్తిగతంగా అభాసుపాలైతేనేం- దేశాధ్యక్షుడిగా ట్రంప్‌ 'వార్ప్‌ స్పీడ్‌' పేరిట వ్యాక్సిన్ల పరిశోధన, ఉత్పత్తి కోసం కేటాయించిన 2000 కోట్ల డాలర్ల నిధుల వల్లే అమెరికా నేడు నిబ్బరంగా ఉందన్నది నిజం.

కొవిడ్‌ నియంత్రణకు టీకాలే శరణ్యమన్న ముందుచూపుతో నిరుడు మే నెలలోనే తయారీ సంస్థలకు ముందస్తు చెల్లింపులు చేసేసిన ఇజ్రాయెల్‌ వంటి దేశాలు నేడు ధీమాగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల్ని వినియోగించగా, దేశ జనాభాలో ఎంత శాతానికి టీకా అందిందన్న ప్రాతిపదిక జాబితాలో ఇండియా 74వ స్థానంలో ఉంది. జులైదాకా టీకాలకు కటకట తప్పకపోవడం- నేతాగణాలకు ముందుచూపు కొరవడిన ఫలితమే! ఆక్సిజన్‌ సహా ప్రాణాధార మందుల కోసం రోగుల హాహాకారాలు మిన్నంటుతుంటే- పాతిక విమానాల్లో దిల్లీకి చేరిన 300 టన్నుల అత్యవసర ఔషధ సామగ్రి రోజుల తరబడి విమానాశ్రయంలోనే పడి ఉండటం, సగటు పౌరుల గుండెల్ని మండించేదే! అధికార శ్రేణుల్లో ఈ తరహా ప్రాణాంతక ఉదాసీనతను చెదరగొట్టి ప్రభుత్వాలు శాస్త్రీయ కార్యాచరణతో ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన కదిలితేనే కొవిడ్‌ మహమ్మారిని అదుపు చెయ్యగలిగేది!

ఇదీ చదవండి:'బంగాల్​లో శాంతిభద్రతలపై మోదీ ఆందోళన'

ABOUT THE AUTHOR

...view details