ఏడు దశాబ్దాలకుపైగా నలుగుతున్న 'నాగా'ల సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయా..? కేంద్రం-నాగా వేర్పాటువాద వర్గాల మధ్య చర్చలు సానుకూల ఫలితాలిచ్చే అవకాశం ఉందా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తున్నా.. ఇందులో పెద్ద సవాల్ కూడా ఉంది. అయితే ఒప్పందం అయ్యేందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
- ఇండో-నాగా శాంతి ఒప్పందానికి సంధానకర్తగా ఉన్న ఎన్.రవిని 2019 జులై 20న నాగాలాండ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది భారత ప్రభుత్వం.
- 2019 ఆగస్టు 5న కశ్మీర్లో ఆర్టికల్ 370, 35 ఏ ను రద్దు చేసింది.
ఈ రెండు చర్యలు నాగాలను ఆలోచనలో పడేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తమకు ప్రత్యేక రాజ్యాంగం, జెండా ఏర్పాటుకు భారత ప్రభుత్వం అంగీకరించదనే విషయం వారికి అర్థమైంది. ఆ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన ఎన్ రవి సైతం 2020 డిసెంబర్ 1న జరిగిన సమావేశంలో ఈ డిమాండ్ నెరవేరే అవకాశం లేదని తేల్చిచెప్పారు. అందుకే నాగాలతో చర్చకు నిర్ణయించిన తుది గడువు (2019 అక్బోబర్ 31 నుంచి 2020 సెప్టెంబర్‌కు) వాయిదా పడింది. అయినప్పటికీ కొంతమంది ఈ డిమాండ్‌పై ఆశావహంగానే ఉన్నారు.
సుదీర్ఘ ఉద్యమం..
తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి నేటి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరకు ప్రభుత్వాలన్నీ ఈ సమస్యపై చర్చలు జరుపుతూ వచ్చాయి. నాగా అంశంపై గతంలో పలుమార్లు సాగిన చర్చల వల్ల ఫలితం లేకపోయింది. లండన్, పారిస్, ఒసాకా, బ్యాంకాక్ నగరాలు వేదికగా నాగా నాయకులతో జరిగిన శాంతి చర్చలు అర్ధంతరంగానే ముగిశాయి.
ఇండో-నాగాల మధ్య జరిగిన ఈ ఒప్పందాలు సమస్యకు పరిష్కారం చూపలేకపోయాయి.
- అక్బర్ హైదరీ ఒప్పందం (1947)
- 16 పాయింట్ ఒప్పందం (1960)
- షిల్లాంగ్ ఒప్పందం (1975)
ఈ ఒప్పందాలు అమలు కాకపోవడానికి ప్రధాన వేర్పాటు సంస్థ అయిన నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్- ఐఎం)లో నాయకత్వలోపం కూడా ఓ కారణం. సంస్థాగతంగా ఉద్యమం మారడం ఇందుకు మరో కారణం.
ప్రధాన కారణాలు..
ఈ ఒప్పందాలు అమలుకు నోచుకోకపోవడానికి ప్రధాన కారణం ప్రతి ఒప్పందంలోనూ నాగాలకు తక్కువ రాజకీయ హక్కులు కల్పించడమే.
- అక్బర్ హైదరీ ఒప్పందంలో 9 నిబంధనలు ఉన్నాయి. ది నాగా నేషనల్ కౌన్సిల్(ఎన్ఎన్సీ)కు ఉండే న్యాయ, కార్యనిర్వహక, చట్టపరమైన అధికారాలను ఈ ఒప్పందం వివరిస్తోంది. నాగాలు నివసించే ప్రాంతాల్లోని భూములపై ఎన్ఎన్సీకి ఉన్న అధికారాన్ని గుర్తిస్తోంది. ఆ భూములపై వేసే పన్నులు, వసూళ్లు, రెవెన్యూ బాధ్యత ఎన్ఎన్సీదే. నాగాలకు వారికి నచ్చిన పని చేసుకుని అభివృద్ధి చెందేలా, వారిని ఒక వర్గంగా గుర్తించాలని ఈ ఒప్పందం చెప్తోంది.
- 16 పాయింట్ ఒప్పందం.. నాగాలాండ్‌కు ప్రత్యేక రాష్ట్రంగా గుర్తింపును ఇచ్చింది. ఇందులో నిబంధనలు రెండు రకాలుగా ఉన్నాయి. ఇతర సంస్కృతి, సంప్రదాయాలు, మైనార్టీ వర్గాలకు ఏమేమి హక్కులు ఉన్నాయో వాటిని నాగాలకు కూడా ఉంటాయని తెలిపింది. వారి అభిప్రాయాన్ని తెలియజేసే స్వేచ్ఛను ఇచ్చింది. అయితే ఇవి భారతదేశ పౌరులందరికీ ఉండేవే. ప్రత్యేకంగా నాగాలకు ఇచ్చిన హక్కులేం లేవు. ఇక రెండో రకం నిబంధనలు.. భారత ప్రభుత్వానికి, నాగాలాండ్‌కు మధ్య ఉన్న సంబంధం గురించి వివరిస్తాయి. శాంతిభద్రతలు కాపాడేందుకు సాయుధ బలగాలకు ఆదేశాలిచ్చేలా గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలను ఇచ్చింది.
- 1975 నాటి షిల్లాంగ్ ఒప్పందం నాగాలకు ఎలాంటి హక్కులు కల్పించలేదు. ఉద్యమం నడిపిస్తోన్న గెరిల్లాల నిరాయుధీకరణ గురించి ఎక్కువగా వివరించింది.
ఈ ఒప్పందాలు ఎన్ఎన్సీకి ఉన్న మద్దతును విచ్ఛిన్నం చేశాయి. దాని చట్టబద్ధతను నాశనం చేశాయి. శాశ్వత శాంతిని సాధించేందుకు ఆకాంక్షిస్తోన్న నాగాల ఏకాభిప్రాయానికి ఈ ఒప్పందాలు తూట్లు పొడిచాయి.
ముసాయిదా ఒప్పందంలో..
2015 ఆగస్టులో ప్రధాన వేర్పాటు సంస్థ అయిన నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్- ఐఎం) వర్గంతో కేంద్ర ప్రభుత్వం ముసాయిదా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం నాగా సమాజంపై ప్రభావం చూపింది. ప్రధాన వేర్పాటువాద సంస్థ ఎన్‌ఎస్‌సీఎన్ (ఐఎం) వర్గం నాయకుడు మూవాను చర్చలకు ఒప్పించడంలో కేంద్రం సఫలమైంది.
చర్చల్లో కొరకరాని కొయ్యలాగా మారిన నాగా ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగంపై ఓ అవగాహనకు వచ్చేలా చేసింది. జెండా విషయంలో ఉభయపక్షాలూ ఓ మెట్టు దిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో నాగా జెండాను ఉపయోగించరు. కానీ నాగాల సాంస్కృతిక కార్యకలాపాలకు మాత్రం జెండాను ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేక రాజ్యాంగంపై ప్రస్తుతానికి వేర్పాటువాద సంస్థలు పట్టుపట్టడం లేదు. దీంతో చర్చలు దాదాపు ఓ కొలిక్కి వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరోవైపు నాగాలాండ్ పొరుగు రాష్ట్రం మణిపుర్‌లో పరిస్థితి ఉద్విగ్నంగా ఉంది. నాగాలాండ్ తర్వాత నాగాలు ఎక్కువగా నివసించేది ఇక్కడే. ఒప్పందం వల్ల తమ భూభాగం నాగాలాండ్‌కు కోల్పోవాల్సి వస్తుందని మణిపుర్ ఆందోళన చెందుతోంది. ఈ వాదనను విశ్వసించవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భాగస్వామ్య పక్షాలైన మిగతా రాష్ట్రాలతో మాట్లాడకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోబోమనీ ప్రకటించింది.
ఇంకేమున్నాయి..
- పక్క రాష్ట్రాల్లో నాగాలు నివసించే ప్రాంతాల్లో.. వారి ఆచార వ్యవహారాల్లో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవు.
- నాగాలాండ్‌తో పాటు మిగతా నాగా మెజారిటీ ప్రాంతాల్లో ఓ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యకలాపాలు సాగుతాయి.
- నాగా ప్రాంతాలకు ప్రత్యేక విద్యా సంస్థలు, అభివృద్ధి పనులను మంజూరు చేసే అవకాశముంది.
- నాగా నిషిద్ధ సైన్యాన్ని భారత సైన్యంలోకి గాని, ఇతర పారామిలిటరీ బలగాల్లోకి గానీ తీసుకుంటారు.
ఇదే సవాల్..
అయితే ప్రత్యేక జెండా, రాజ్యాంగం లేనిదే తుది ఒప్పందంపై సంతకం చేసేది లేదని 2020 అక్టోబర్ 16న ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్‌ఎస్‌సీఎన్ నాయకుడు మువా తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌సీఎన్‌ను తప్పించి మిగిలిన వేర్పాటువాద సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
ప్రత్యేక జెండా, రాజ్యాంగం అంశాలు లేకుండా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి మరికొందరు తిరుగుబాటుదారులు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వారందరికీ నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్ ఓ వేదికలా మారింది. పలు నాగా గ్రూపులతో పాటు మాజీ తిరుగుబాటుదారులు, ఎన్‌ఎస్‌సీఎన్ నుంచి విడిపోయిన నేతలకు నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్ వేదికైంది. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యకు పరిష్కారం లభించక విసిగిపోయిన నాగాజాతి ప్రజలు దీనికి చరమగీతం పాడాలని అనుకుంటున్నారు. భారత్‌తో సైనిక పోరాటం చేయగల సామర్థ్యం లేదన్న నిజాన్ని గుర్తించి.. తమ సమస్యకు త్వరగా ఓ పరిష్కారాన్ని కోరుకుంటున్నారు. వీరందరికీ ఎన్‌ఎన్‌పీజీ ఓ ప్రతినిధిలా వ్యవహరిస్తోంది.
అయితే ప్రధాన ఉద్యమ సంఘం అయిన ఎన్‌ఎస్‌సీఎన్‌ను తప్పిస్తే వాళ్లు మరోసారి ఆయుధాలు పట్టే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం సరిహద్దులో చైనాతో ఘర్షణ వాతావరణం ఉన్న తరుణంలో ఇలాంటి పరిణామం మంచిది కాదు. ఈశాన్య భారతంలో తిరుగుబాటుదారులకు చైనా మద్దతు ఇవ్వడానికి ఎప్పటినుంచో కాచుకొని ఉంది. అలాంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకుండా ప్రశాంతంగా ఒప్పందం చేసుకోవడమే భారత్ ముందున్న ప్రధాన సవాలు.
అలా అని వారు డిమాండ్ చేస్తున్నట్లు ప్రత్యేక జెండాకు ఒప్పుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే కశ్మీర్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు సైతం ఇంతకుముందు ప్రత్యేక జెండా కావాలని ఉద్యమించాయి. నాగాలకు ఆ అవకాశం ఇస్తే మరిన్ని ఉద్యమాలు వస్తాయి.
ప్రత్యేక అధికారాలు, రాజకీయ గుర్తింపు కోరుకునే ప్రాంతాలను సామరస్యంగా ఏకతాటిపైకి తేవాలి. ఇంతకుముందు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు చక్కని పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఎలాంటి హింస చెలరేగకుండా రాజకీయ గుర్తింపు కోరిన ప్రాంతాలకు కలిపి ప్రత్యేక రాష్ట్ర గుర్తింపును ఇచ్చాయి. అలాంటి పరిష్కారాలను భారత్ గమనిస్తే ఈశాన్య భారతంలో శాంతి పవనాలు వీచే అవకాశం ఉంది.
- కుమార్ సంజయ్ సింగ్, హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్, శ్రద్ధానంద కళాశాల, దిల్లీ విశ్వవిద్యాలయం