తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు- ఆపేదెలా? - ప్రపంచ లింగ అసమానత్వ సూచీ

తరతరాలుగా వేళ్లూనుకుపోయిన సమాజ కట్టుబాట్లను ఛేదించుకొని- విద్య ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొని వనితాలోకం.. ఇప్పుడిప్పుడే హక్కులు, సమానత్వం, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు సమాజంలో పెరుగుతున్న పెడధోరణులు వారి ప్రగతికి అవరోధంగా మారడమే కాకుండా.. ఎందరినో బలి తీసుకుంటున్నాయి. పని ప్రదేశంలో మహిళలపై వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం ప్రైవేటు సంస్థల్లోనే కాదు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మహిళలపై వేధింపులు తగ్గట్లేదు.

Harassment of women in the workplace
పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు

By

Published : Apr 2, 2021, 6:39 AM IST

మహారాష్ట్రలో అటవీశాఖకు చెందిన మహిళా అధికారి దీపాలీ చవాన్‌ ఆత్మహత్య ఉదంతం పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల అంశంపై మరోసారి చర్చ లేవనెత్తింది. దేశంలో స్త్రీలపై నిత్యం వివిధ రకాల దాడులు సర్వసాధారణమయ్యాయి. మహిళల కోసం ఎన్నో పథకాలు, విధానాలు, వారి భద్రతకు చట్టాలు అనేకం ఉన్నా- అవి అక్కరకు రాని చుట్టాలుగా మిగిలిపోతున్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన లింగ సమానత్వం, స్వేచ్ఛ, హక్కులు, మహిళా సాధికారత అనేవి కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. ముంబయికి చెందిన నర్సు అరుణ శాంబాగ్‌ (1973), విశాఖ గైడ్‌లైన్స్‌ కేసు భన్వరీ దేవి (1997) నుంచి- నేటి దీపాలీ చవాన్‌ ఉదంతం వరకు దేశంలో లెక్కలేనన్ని అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయి. ఈ జాడ్యం కేవలం కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు- దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, వసతి గృహాలు, ఆస్పత్రులు... ఎక్కడ చూసినా ఈ తరహా ఉదంతాలు కోకొల్లలు, సమాజ కట్టుబాట్లు, కుటుంబ, ఉపాధి, ఆర్థిక కారణాల రీత్యా వెలుగులోకి రాని సంఘటనలే అధికం.

అరకొర చట్టాలు

తరతరాలుగా వేళ్లూనుకుపోయిన సమాజ కట్టుబాట్లను ఛేదించుకొని- విద్య ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొని వనితాలోకం ఇప్పుడిప్పుడే హక్కులు, సమానత్వం, ఆర్థిక స్వావలంబనగా దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు సమాజంలో పెరుగుతున్న పెడధోరణులు వారి ప్రగతికి అవరోధంగా మారడమే కాకుండా... ఎందరినో బలి తీసుకుంటున్నాయి. మహిళా శక్తిని కుటుంబ, దేశ అభివృద్ధికి అందించాలనే యువ మహిళల ఆశలు నీరుగారుతున్నాయి. 'ప్రపంచ లింగ అసమానత్వ సూచీ-2020' ప్రకారం ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్న 153 దేశాల్లో ఇండియా ర్యాంకు 112. కార్పొరేట్‌ కంపెనీల ఉన్నత పదవులు, ప్రముఖ విద్య, వైద్య, సాంకేతిక సంస్థలు, విశ్వవిద్యాలయాల ఉన్నతోద్యోగాల్లో మహిళల శాతం అతి తక్కువ.

భారత్‌లో 1997 వరకు పని ప్రదేశంలో మహిళలకు రక్షణ కల్పించే పటిష్ఠమైన చట్టాలు తక్కువనే చెప్పాలి. 1997లో రాజస్థాన్‌లో జరిగిన ఒక సంఘటనతో ఈ చట్టాలకు బీజం పడింది. విధి నిర్వహణలో భాగంగా బాల్య వివాహాలను నిరోధించడానికి వెళ్ళిన భన్వరీ దేవి అనే రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై కొంతమంది అత్యాచారానికి పాల్పడటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పని ప్రదేశాల్లో మహిళా రక్షణకు కొత్త చట్టాలు కావాలనే ప్రతిపాదనకు అది నాంది పలికింది. భన్వరీ దేవికి న్యాయం చేయాలని కోరుతూ వివిధ మహిళా సంఘాలు ఉమ్మడిగా 'విశాఖ' పేరుతో రాజస్థాన్‌ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. స్థానికంగా పలుకుబడి కలిగిన కొందరివల్ల అక్కడ భన్వరీ దేవికి న్యాయం జరగలేదు. తరవాత కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. విశాఖ అండ్‌ అదర్స్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ కేసు (1997)లో సుప్రీంకోర్టు 'పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధం' నియమావళిని సూచిస్తూ- ఈ దిశగా ప్రభుత్వాలు చట్టాలు తెచ్చేదాకా ఈ నియమాలను పాటించాలని చెప్పింది. సుప్రీంకోర్టు సూచనలకు ఫలశ్రుతే- 'పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, పరిష్కార) చట్టం- 2013'. ఈ తరహా చట్టం తేవడానికి దశాబ్దాల సమయం పట్టిందంటే- మహిళల భద్రత విషయంలో అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జాతీయ నేర గణాంకాల ప్రకారం 2019లో మహిళలపై లైంగిక వేధింపుల కింద నమోదైన మొత్తం కేసులు 18,334. ఇందులో శిక్షలు పడినవి తక్కువే. కొంతకాలం క్రితం ‘మీ టూ’ ఉద్యమం పెద్ద దుమారమే రేపింది. యూజీసీ విశ్వవిద్యాలయాల్లో మహిళల రక్షణకు మార్గదర్శకాలు, మహిళా కమిటీలు కౌన్సెలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం శుభ పరిణామం.

తీసుకోవాల్సిన చర్యలివే...

మానవ వికాసానికి కుటుంబం కేంద్ర బిందువు. వ్యక్తి ప్రవర్తన, మనుగడ కుటుంబ వాతావరణంతోనే ముడివడి ఉంటాయి. లింగ అసమానత్వ భావనలకు తావివ్వకుండా పిల్లలను పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. బాధ్యతాయుత పౌరులుగా వారిని తీర్చిదిద్దడంలో విద్యావ్యవస్థ పాత్ర కీలకం. ఆ బాధ్యత ఎంతవరకు నెరవేరుతోందనేది సందేహాస్పదమే. నూతన జాతీయ విద్యావిధానం నైతిక విలువలు, సమాజం పట్ల బాధ్యత మొదలైన అంశాలను పాఠ్యాంశాల్లో చేర్చి కొత్త ఒరవడిని సృష్టించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సమాజంలోని పెడ ధోరణులను, విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం పిల్లలపై చూపిస్తున్న ప్రభావాన్ని నియంత్రించాల్సి ఉంది. మహిళలపట్ల మగవారి ఆలోచనాధోరణి మారాలి. చట్టాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. అవి పటిష్ఠంగా అమలు కావాలి. అందరికీ సత్వర న్యాయం, జవాబుదారీతనం అనివార్యం. స్త్రీ శక్తిని, సృజనాత్మకతను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యే ఏ సమాజమైనా అభివృద్ధిలో వెనకబడే ఉంటుందనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. వారిని అభివృద్ధిలో కీలక భాగస్వాములను చేయాలి. మహిళలను గౌరవించడం, వారికి భద్రత కల్పించడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. పౌరులంతా దాన్ని తమ ఉమ్మడి బాధ్యతగా భావించాలి. అప్పుడే మహిళలపై హత్యాచారాలు, దమన కాండ తగ్గుముఖం పడతాయి.

- డాక్టర్‌ రమేశ్‌ బుద్దారం

(మధ్యప్రదేశ్‌లోని గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు)

ఇదీ చదవండి:'లవ్​ జిహాద్​' బిల్లుకు గుజరాత్ అసెంబ్లీ ఆమోదం​

ABOUT THE AUTHOR

...view details