భారీ వర్షాలు, వరదల ధాటికి కేరళ, ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. కేరళ వరద బీభత్సం- దేశీయ ప్రకృతి వ్యవస్థల పరిరక్షణ తీరుతెన్నులను మరోసారి చర్చకు తీసుకువచ్చింది. పశ్చిమ, తూర్పు కనుమల్లో విచ్చలవిడిగా సాగుతున్న వనాల విధ్వంసం, సున్నితమైన పర్యావరణ వ్యవస్థల పరిరక్షణలో అంతులేని నిర్లక్ష్యం, వాతావరణ మార్పుల చేదు ఫలితాలు ఎక్కడికక్కడ విపత్తుల తాకిడిని పెంచుతున్నాయి. ముందు జాగ్రత్తల ద్వారా నష్టాలను తగ్గించే కార్యాచరణ లోపిస్తుండటమే విచారకరం!
బుట్టదాఖలవుతున్న నివేదికలు..
భిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులు కలిగిన భారతదేశంలో ఏటా రుతుపవనాలు ప్రవేశించాక వరదలు, తుపానులు సంభవించడం సర్వసాధారణం. కొన్నేళ్లుగా లెక్కకుమిక్కిలిగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులు- జనజీవనాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దశాబ్దం క్రితంతో పోలిస్తే తుపానుల్ని ముందే పసిగట్టి హెచ్చరించే సాంకేతిక పరిజ్ఞానం, సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. వాటి ఆసరాతో సమర్థ చర్యలు చేపడితే నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. కేంద్ర జల సంఘం, విజ్ఞానశాస్త్ర-పర్యావరణ కేంద్రం(సీఎస్‌ఈ) సమాచారం మేరకు గడిచిన అరవై ఏళ్లలో వరదల మూలంగా దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా చనిపోయారు. దాదాపు 62 కోట్ల ఎకరాల్లో పంటలు, ఎనిమిది కోట్లకు పైగా గృహాలు నాశనమయ్యాయి. కేంద్ర జలశక్తి శాఖ నివేదికల ప్రకారం దేశంలో అధిక శాతం నదులు 2019లో భారీ వరద ఉధృతిని చవిచూశాయి.
వందేళ్లలో కనీవినీ ఎరగని స్థాయిలో ముంచెత్తిన వరదల ధాటికి 2018లో కేరళ బాగా దెబ్బతింది. ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, బిహార్, పశ్చిమ్ బంగ, ఈశాన్య రాష్ట్రాలూ గడచిన కొన్నేళ్లలో భీకర వరదల తాకిడికి గురయ్యాయి. శ్రీనగర్, చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాలూ అలాగే శోకసంద్రాలయ్యాయి. విశాఖతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు హుద్‌హుద్, తిత్లీ వంటి తుపానులు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. దేశవ్యాప్తంగా ఏటా మూడు కోట్ల మంది వరదల బారిన పడుతున్నారు. దేశంలో జూన్-అక్టోబర్ మధ్య కాలంలో భారీ వర్షాలతో నదుల్లోకి అధిక నీటి ప్రవాహం చేరుతోంది. ఆ సమయంలో పర్వత శ్రేణులకు ఆనుకుని ఉండే ప్రదేశాలు, నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విచక్షణారహితంగా సాగుతున్న ఇసుక తవ్వకాలు నదుల సహజ ప్రవాహ గమనాన్ని దెబ్బతీస్తున్నాయి. అనేక నగరాల్లో దశాబ్దాల నాటి మురుగు నీటిపారుదల వ్యవస్థలు ఇప్పటికీ మెరుగుపడలేదు. దాంతో వరద నీరు ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.
గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల పరిధిలో సుమారు 1.60 లక్షల చదరపు కిలోమీటర్ల మేర పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. అక్కడి పర్యావరణ, జీవవైవిధ్య వ్యవస్థల పరిరక్షణ కోసం 2010లో కేంద్ర ప్రభుత్వం ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ నేతృత్వంలో అధ్యయన సంఘాన్ని నియమించింది. పశ్చిమ కనుమలను పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించాలని ఆ సంఘం సూచించింది. నిర్దేశిత ప్రాంతాల్లో నూతన ఆర్థిక మండళ్లు, హిల్‌స్టేషన్ల ఏర్పాటు, ఖనిజాల తవ్వకాలకు అనుమతులు ఇవ్వకూడదని సిఫార్సు చేసింది. కనుమల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ భూములను బదిలీ చేయకూడదని పేర్కొంది. పశ్చిమ కనుమల పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. వీటిని అమలు చేయకుండా 2012లో శాస్త్రవేత్త కస్తూరి రంగన్ నేతృత్వంలో కేంద్రం మరో సంఘాన్ని కొలువుతీర్చింది. గాడ్గిల్ కమిటీ బాటలోనే- కనుమలలో గనుల తవ్వకం, క్వారీ కార్యక్రమాలపై పూర్తిగా నిషేధం విధించాలని ఆ సంఘం సిఫార్సు చేసింది. కనుమలలో 37శాతం భూభాగాన్ని సున్నిత పర్యావరణ ప్రాంతంగా గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొంది. వీటిని అమలు చేసి ఉంటే- వరదల తీవ్రత తగ్గి ఉండేది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించిన తూర్పు కనుమల దుస్థితీ ఇలాగే ఉంది. ఒడిశా, ఆంధ్ర పరిధుల్లోని కనుమలలో లేటరైట్, బాక్సైట్ వంటి ఖనిజాల తవ్వకాల మూలంగా అడవులకు తీరని నష్టం వాటిల్లుతోంది. నదుల గమనంలో మార్పులతో భవిష్యత్తులో వరద ప్రమాదాలు అనూహ్యస్థాయిలో ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవ పరిస్థితులను మదింపు వేయడానికి అధ్యయనాలు చేపట్టేందుకు సైతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపకపోవడం ఆందోళనకరం.