అడవుల సమీప గ్రామాలు, పట్టణాల్లోకి వన్యప్రాణులు ప్రవేశించి అలజడి సృష్టిస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అడవి చుట్టుపక్కల నివసించే రైతులు, గ్రామీణ ప్రజలకు ఇది కొత్త సమస్య కాదు. తెలుగురాష్ట్రాల్లో పెద్దపులి, ఎలుగుబంటి, అడవి పంది, కోతి, చిరుత వంటి వన్య ప్రాణులవల్ల మనుషులకు, పశువులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. గత 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా పాము కాటు వల్ల 12 లక్షలమంది బలయినట్లు కెనడాకు చెందిన సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ రిసెర్చ్ ఆరునెలల క్రితం వెల్లడించిన అధ్యయన నివేదికలో పేర్కొంది. ఇందులో సగానికి పైగా మరణాలు కేవలం ఎనిమిది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జరిగాయి. అందులో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి.
అడవుల సమీపంలో ఉన్న గ్రామాల్లో పాముకాటుకు గురయ్యేవారు ఎక్కువగా ఉంటారు. కొంతకాలం క్రితం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ జనావాసాల్లోకి ప్రవేశిస్తున్న వన్యప్రాణుల జాబితాలో పామునూ చేర్చింది. ఇటీవలి కాలంలో సమాచార వ్యవస్థ అందుబాటులోకి రావడంవల్ల వన్యప్రాణుల ఉనికి, సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందగలుగుతున్నాం. అడవుల్లో నీరు, ఆహారం లేకపోవడం, అడవుల నరకివేతవల్ల ఆవాసాలు కోల్పోవడం, అటవీ ప్రాంతాలను అనుకొని కొత్తగా జనావాసాలు ఏర్పడుతూ ఉండటంతో ఈ సమస్య నానాటికీ పెరుగుతోంది. ఇందుకు కారణాలను లోతుగా అధ్యయనం చేయాలి.
పెరుగుతున్న దాడులు
ఇటీవల ఎక్కువగా పులులు జనావాసాల్లోకి చొరబడుతూ ఉండటం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడి వల్ల ఇద్దరు వ్యక్తులు మరణించారు. తెలంగాణలో మొదటిసారిగా పెద్దపులి మనుషులపై దాడి చేయడం స్థానిక ప్రజల్లో భయాందోళనలకు కారణమయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో మూడు నెలల బాలుడిని నక్క నోట కరచుకొని వెళ్లి తీవ్రంగా గాయపరిచింది. ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి మండలంలో వ్యవసాయం చేస్తున్న వ్యక్తిపై చిరుతపులి దాడి చేసింది. ఒక రైతు పొలంలో పనిచేస్తున్నప్పుడు ఎలుగుబంటి దాడి చేసింది. అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ వన్యప్రాణుల దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ అటవీ ప్రాంతాల్లో తరచూ అడవి జంతువులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి.
అపోహలు ఎక్కువే
వన్యప్రాణులు ఎలాంటి సందర్భాల్లో మనుషులు లేదా పశువులపై దాడి చేస్తున్నాయో, శాస్త్రీయ పద్ధతుల్లో పరిశోధిస్తే- ఈ సమస్య మూలలను తెలుసుకోవచ్చు. వన్యప్రాణుల పట్ల అవగాహన లోపం వల్ల చాలాసార్లు ప్రజలు అనవసర భయానికి లోనవుతున్నారని అర్థం అవుతుంది. ఉదాహరణకు ఇటీవల కరీంనగర్‌జిల్లాలోని రామడుగు మండల గ్రామాల్లోని పొలంలో కనిపించిన జంతువు ఆఫ్రికా ఖండానికి చెందిన చిరుతపులిగా ప్రచారం జరిగింది. కానీ దాన్ని చివరికి హైనాగా గుర్తించారు. ప్రజలు వ్యవసాయ భూమిలో అడవి పిల్లిని చూసి, పెద్ద పులిగా అపోహ పడిన సందర్భాలూ అనేకం.