ఫాదర్ స్టాన్ స్వామి..ప్రస్తుతం ప్రసార సాధనాల్లో సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతున్న పేరిది. సామాజిక ఉద్యమకారుడిగా, గిరిజన హక్కుల నేతగా పేరున్న క్రైస్తవ మతాచార్యుడు స్టాన్ స్వామి వివాదాస్పద భీమా కొరెగావ్- ఎల్గార్ పరిషద్ కేసులో విచారణ ఖైదీగా గతవారం మృతిచెందడం పట్ల దేశవిదేశాల్లో తీవ్ర నిరసన, ఆవేదన వ్యక్తమవుతున్నాయి. ఇంతటి పెను సంచలనానికి దారితీసిన పరిస్థితులు, కారణాల విశ్లేషణ దేశంలోని నేరన్యాయ విచారణ తీరుతెన్నులనే సూటిగా నిగ్గదీస్తోంది.
పుట్టింది తమిళనాడులోనైనా దశాబ్దాలుగా మధ్య భారతావనితో అనుబంధం పెంచుకున్న ఎనభైనాలుగేళ్ల స్టాన్ స్వామి ఆదివాసుల హక్కుల పరిరక్షణకు పెట్టింది పేరు. మూడు వేలమంది యువ గిరిజనులు జైళ్లలో మగ్గుతున్నారని ప్రగాఢ విచారం వ్యక్తపరచిన ఆయన, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై తానూ అటువంటి విపత్కర స్థితిలోనే చిక్కుకుని బెయిలు కోసం ఎంతగా యత్నించినా సాధ్యపడలేదు. అక్టోబరు 2020లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకునేటప్పటికే ఆ పండు ముదుసలి పార్కిన్‌సన్స్ వ్యాధిగ్రస్థుడు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ అనుగ్రహిస్తే రాంచీ తిరిగి వెళ్ళి సన్నిహితుల మధ్య కన్నుమూయాలన్న అంతిమ కోరిక కడకు నెరవేరనే లేదు. 'విచారణ ఖైదీగానే చనిపోతానేమో!' అన్న భయమే నిజమైంది. వృద్ధాప్యంలో శరీరం సహకరించక, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ కిక్కిరిసిన జైలులో ఉండలేనని వేడుకున్నా పట్టించుకోని దర్యాప్తు సంస్థ మొండితనం నిర్దాక్షిణ్యంగా కొవిడ్‌ను ప్రసాదించింది. ఆపై హృద్రోగ సమస్యలు చుట్టుముట్టి శాశ్వత విముక్తి కలిగించాయి. ఈ యావత్ ఉదంతంలో ఎన్‌ఐఏ అమానవీయంగా, క్రూరంగా వ్యవహరించిందన్న ఘాటు విమర్శలిప్పుడు ఇంటా బయటా మోతెక్కుతున్నాయి.
విచక్షణ ఏది?
వృద్ధాప్య కోరల్లో చిక్కి, నయంకాని వ్యాధుల కర్కశ కౌగిలిలో విలవిల్లాడుతూ, కాటికి కాళ్లు చాపుకొన్న ఖైదీల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఒకటిన్నర దశాబ్దాల నాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్నదగ్గ ఆదేశాలిచ్చింది. గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష విధించగల కేసులకు సంబంధించి వ్యక్తుల అరెస్టులపై విచారణాధికారులు విచక్షణానుసారం మెలగాలని సర్వోన్నత న్యాయస్థానమే నిర్దేశించింది. తాను మోపిన నేరారోపణల్ని ఎన్‌ఐఏ నిర్ద్వంద్వంగా నిరూపించగలిగినా- వయసు, ఆరోగ్య దుర్బలతల దృష్ట్యా స్టాన్ స్వామికి అయితే గియితే పడి ఉండే శిక్ష ఆ లోపే కనుక బెయిలు ఇచ్చి ఉండాల్సిందేనన్నది విస్తృత ప్రాచుర్యం పొందుతున్న విశ్లేషణ. నిరుడు అక్టోబరులో అదుపులోకి తీసుకున్నాక ఇన్నాళ్లలో కనీసం ఒక్కసారీ స్టాన్ స్వామిని ఎన్‌ఐఏ విచారించనే లేదు. తక్షణ విచారణావకాశం లేనట్లయితే మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలకు గురైన వ్యక్తి సైతం బెయిలుకు అర్హుడేనని లోగడ సుప్రీంకోర్టే స్పష్టీకరించింది. అవసరమైతే తప్ప కొవిడ్ వేళ అరెస్టులతో జైళ్లను మరింత రద్దీగా మార్చవద్దనీ ఈ మధ్య లక్ష్మణ రేఖ గీసింది. వాటన్నింటినీ తుంగలో తొక్కిన చందంగా ఎన్‌ఐఏ, తలచిందే తడవుగా స్వీయ కార్యాచరణను పట్టాలకు ఎక్కించింది.
ఫాదర్ స్టాన్ స్వామి జీవితంలో ఎన్నడూ భీమా కొరెగావ్ ప్రాంతాన అడుగు పెట్టలేదని, ఎప్పుడూ ఆయుధం పట్టలేదన్నది దశాబ్దాలుగా ఆయనతో సన్నిహితంగా మెలిగినవారి మాట. ఝార్ఖండ్ నివాసానికి వెళ్ళి తాము వశపరచుకున్న కంప్యూటర్, ఇతర పత్రాల ప్రాతిపదికన వామపక్ష తీవ్రవాదులతో సంబంధాలున్నట్లు నిర్ధారణకు వచ్చామన్నది ఎన్‌ఐఏ ప్రధాన ఆరోపణ. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ-ఉపా)లోని నాలుగు, ఆరు ఛాప్టర్ల కింద దర్యాప్తు సంస్థ కేసు బనాయించి ఉచ్చు బిగించింది. అవి ఉగ్రవాద కార్యకలాపాలు, సంస్థల కట్టడికి ఉద్దేశించినవి. వయోవృద్ధుడిపై 43డీ(2) లాంటి కర్కశ సెక్షన్ ప్రయోగానికి సమర్థనగా ఎన్‌ఐఏ పేర్కొంటున్న కంప్యూటర్ సాక్ష్యం సహేతుకతను అంతర్జాతీయ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మాల్‌వేర్ చొప్పించి అటువంటి సాక్ష్యాధారాలను సృష్టించగల వీలుందన్న వారి ధ్రువీకరణ, జాతీయ దర్యాప్తు సంస్థ వృత్తి నిబద్ధతనే బోనెక్కిస్తోంది!